DTF
* డిటిఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి లింగారెడ్డి
* కొండూరు జెడ్పీహెచ్ఎస్లో డిటిఎఫ్ నాయకులు లింగారెడ్డి సన్మాన సభ
ఆకేరు న్యూస్, రాయపర్తి: తక్కువ విద్యార్థులు ఉన్నారనే నెపంతో ప్రభుత్వం పాఠశాలలను మూసివేయడానికి లేదా విలీనం చేయడానికి ప్రయత్నించడం తీవ్ర విచారకరమని, ఈ నిర్ణయం వల్ల బడుగు, బలహీన వర్గాల పిల్లలు, ముఖ్యంగా బాలికలు, విద్యకు దూరమయ్యే ప్రమాదం ఉందని డిటిఎఫ్ (DTF) నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు.
జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాల (జెడ్పీహెచ్ఎస్) కొండూరులో ఉపాధ్యాయులు లింగారెడ్డి ఉద్యోగ విరమణ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు కె.పద్మలత అధ్యక్షతన ప్రత్యేక సమావేశం నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన డిటిఎఫ్ ప్రతినిధి లింగారెడ్డి, మాట్లాడుతూ, విద్యారంగంలో ఇటీవల ప్రభుత్వం తీసుకొస్తున్న పలు మార్పులు, ప్రయోగాలు ఉపాధ్యాయులను బోధనకు దూరం చేసేలా ఉన్నాయని విమర్శించారు.
బోధనేతర పనులు, యాప్ల నిర్వహణ వంటి ప్రయోగాల వల్ల ఉపాధ్యాయులు బోధనపై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టలేకపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పాఠశాలలను మూసివేయడం లేదా విలీనం చేయడం విద్యా హక్కు చట్టం ఆశయాలకు విరుద్ధమని, ఇది ప్రభుత్వ విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేయడమేనని అన్నారు. ప్రభుత్వం వెంటనే ఈ ఆలోచనను విరమించుకుని, పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించి, ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో ఉద్యోగ విరమణ పొందిన లింగారెడ్డి, సేవలను పలువురు ఉపాధ్యాయులు కొనియాడారు. అనంతరం ఆయనను శాలువాతో సత్కరించి, జ్ఞాపికను అందజేశారు. ఈ సమావేశంలో పాఠశాల ఉపాధ్యాయులు, గ్రామ ప్రతినిధులు, పాఠశాల యాజమాన్య కమిటీ (SMC) సభ్యులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.

