Chandrababu Naidu
* ప్రజల మధ్య ఉండాలి
* ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు
ఆకేరు న్యూస్, రేపల్లె : “ముఖ్యమంత్రి అంటే అధికారం చలాయించే వ్యక్తి కాదు.. ఆయనొక కామన్ మ్యాన్” అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. బాపట్ల జిల్లా రేపల్లెలో నిర్వహించిన ‘ఎన్టీఆర్ భరోసా’ పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో సీఎం పాల్గొని మాట్లాడారు.
నిత్యం ప్రజల మధ్య ఉంటూ వారి కష్టాలు, సమస్యలు తెలుసుకుని పరిష్కరించడమే ధ్యేయంగా పనిచేస్తున్నామని పేర్కొన్నారు. గత 28 నెలలుగా ప్రతి నెలా ఒకటో తేదీన స్వయంగా తానే లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పింఛన్లు అందిస్తున్నానని, అధికారులు, ప్రజాప్రతినిధులు సైతం మొదటి తేదీన ‘పేదల సేవ’లోనే గడుపుతున్నారని ఆయన స్పష్టం చేశారు.
* ప్రజా సేవలో నాలుగు కీలక మైలురాళ్లు
రాష్ట్ర ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉండేలా ప్రభుత్వం స్పష్టమైన క్యాలెండర్‌తో పనిచేస్తోందని ముఖ్యమంత్రి వివరించారు. ప్రతి నెలా 1వ తేదీన సామాజిక భద్రత కల్పించే ‘ఎన్టీఆర్ భరోసా’ పింఛన్ల పంపిణీ, 9వ తేదీన గత ప్రభుత్వంలో తలెత్తిన భూ వివాదాలను పరిష్కరించే ‘మీ భూమి – మీ హక్కు’ కార్యక్రమాల్లో పాల్గొంటున్నట్లు తెలిపారు.
అలాగే ప్రతి మూడో శనివారం పర్యావరణ పరిరక్షణ కోసం ‘స్వచ్ఛాంధ్ర’, నాలుగో శనివారం ప్రజ ఆరోగ్య రక్షణకు ఉద్దేశించిన ‘సంజీవని’ కార్యక్రమాలకు హాజరవుతూ ప్రజా సేవకులుగా నిరంతరం శ్రమిస్తున్నామని వివరించారు.
* రూ.76 వేల కోట్లతో పింఛన్లు
గత పాలకులు అన్ని వ్యవస్థలను భ్రష్టు పట్టించి, రాష్ట్రాన్ని తీవ్ర విధ్వంసానికి గురి చేశారని సీఎం చంద్రబాబు మండిపడ్డారు. వెంటిలేటర్‌పై ఉన్న రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఆక్సిజన్ ఇచ్చి, తీవ్ర ఆర్థిక సవాళ్లను అధిగమిస్తూ సంక్షేమాన్ని అందిస్తున్నామని చెప్పారు.
ఇప్పటివరకు ఒక్క పింఛన్ల కోసమే రూ. 76,000 కోట్లు ఖర్చు చేశామని తెలిపారు. కేంద్రంలో, రాష్ట్రంలో ఉన్న డబుల్ ఇంజన్ సర్కార్ బుల్లెట్ వేగంతో సుపరిపాలన అందిస్తోందని, నిబద్ధతతో ఒక్కో ఇటుకా పేర్చుకుంటూ రాష్ట్ర పునర్నిర్మాణం చేస్తున్నామని ఉద్ఘాటించారు.
* గొడ్డలి పార్టీ నేతలు..
పేదరికాన్ని కేవలం ఆర్థిక కోణంలో కాకుండా మానవీయ కోణంలో ఆలోచిస్తున్నామని, ప్రతి వ్యక్తి, ప్రతి కుటుంబ సాధికారత సాధించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. అట్టడుగున ఉన్న 20 శాతం మందికి చేయూత అందించేలా పి4 విధానాన్ని అమలు చేస్తున్నామని అన్నారు.
బంగారు కుటుంబాలను ఎంపిక చేసి వారి జీవన ప్రమాణాలు పెంచేలా సమగ్ర చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఇదే సమయంలో ప్రజలు కొట్టిన దెబ్బకు తట్టుకోలేక ‘గొడ్డలి పార్టీ’ నేతలు అలిగి శాసనసభకు కూడా రాకుండా ముఖం చాటేస్తున్నారని విపక్ష తీరుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
