CM Rekha Gupta
* సీఎం రేఖా గుప్తా
CM Rekha Gupta| ఆకేరు న్యూస్, న్యూఢిల్లీ: మహిళలు, బాలికల భద్రత విషయంలో వారిపైనే ఆంక్షలు విధించడం సరైన విధానం కాదని ఢిల్లీ సీఎం రేఖా గుప్తా అన్నారు. అబ్బాయిల పెంపకం, ప్రవర్తన, బాధ్యతలపై కూడా కుటుంబాలు, సమాజం ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని ఆమె పేర్కొన్నారు.
ఢిల్లీలోని మైత్రేయి కాలేజీ డైమండ్ జూబ్లీ వేడుకల్లో పాల్గొన్న సీఎం.. మహిళలు, బాలికలపై లైంగిక వేధింపులు, హింసను అరికట్టేందుకు సమగ్ర చర్యలు అవసరమని అన్నారు. ఈ సందర్భంగా అమ్మాయిలపైనే ఎందుకు ఆంక్షలు? అబ్బాయిల విషయంలో ఏం చేస్తున్నాం? అనే అంశాన్ని ప్రస్తావించారు. చిన్న వయసు నుంచే అబ్బాయిలకు ఇతరులను గౌరవించడం, బాధ్యతగా ప్రవర్తించడం, సమ్మతి విలువను అర్థం చేసుకోవడం నేర్పించాలని రేఖా గుప్తా సూచించారు. ముఖ్యంగా ‘నో అంటే నో’ అనే భావనపై పిల్లల్లో స్పష్టమైన అవగాహన కల్పించాలని అన్నారు.
భద్రతపై ప్రత్యేక దృష్టి
మహిళలు, బాలికలకు సురక్షిత వాతావరణం కల్పించేందుకు పోలీసులు స్థానికంగా ఉన్న భద్రతా లోపాలను గుర్తించి చర్యలు తీసుకోవాలని సీఎం సూచించారు. అవసరమైన ప్రాంతాల్లో వీధి దీపాలు, సీసీ కెమెరాలు, అదనపు భద్రతా సిబ్బందిని ఏర్పాటు చేయాలని అన్నారు. మహిళలు, బాలికలకు సంబంధించిన కేసుల్లో విచారణ వేగంగా పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని, బాధితులకు సత్వర న్యాయం అందేలా చూడాల్సిన అవసరం ఉందని రేఖా గుప్తా పేర్కొన్నారు.
మోదీ పాత వ్యాఖ్యల ప్రస్తావన
తన ప్రసంగంలో ప్రధాని నరేంద్ర మోదీ 2014 ఆగస్టు 15న ఎర్రకోట నుంచి చేసిన స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగాన్ని కూడా సీఎం ప్రస్తావించారు. ఆ సమయంలో మోదీ.. కుమార్తెలపై మాత్రమే తల్లిదండ్రులు ఆంక్షలు విధించడం కాకుండా, కుమారుల ప్రవర్తనను కూడా గమనించాలని సూచించిన విషయాన్ని గుర్తు చేశారు. అమ్మాయిల భద్రతకు సంబంధించిన సమస్యలను కేవలం వారి స్వేచ్ఛపై పరిమితులతో పరిష్కరించలేమని, అబ్బాయిల పెంపకం, ప్రవర్తనలోనూ బాధ్యతాయుతమైన మార్పు అవసరమనే అంశాన్ని ఆమె తన ప్రసంగంలో ప్రస్తావించారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
