Telangana Rainfall
* రాష్ట్రంలో 17 శాతం తక్కువ వర్షపాతం
Telangana Rainfall| ఆకేరు న్యూస్, హైదరాబాద్: తెలంగాణలో వర్షాభావ పరిస్థితులపై ప్రభుత్వం దృష్టి సారించింది. రాష్ట్రవ్యాప్తంగా సాధారణం కంటే 17 శాతం తక్కువ వర్షపాతం నమోదైందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. ఎల్‌నినో ప్రభావంతో నెలకొన్న పరిస్థితులపై కేబినెట్ సబ్‌కమిటీ సమగ్ర నివేదిక రూపొందించాల్సి ఉందని చెప్పారు.
రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఇప్పటికే తాగునీటి సమస్యలు ఎదురవుతున్నాయని మంత్రి తెలిపారు. రానున్న రోజుల్లో ఆశించిన స్థాయిలో వర్షాలు కురిసే అవకాశం లేదన్న వాతావరణ శాఖ అంచనాల నేపథ్యంలో ప్రభుత్వం పరిస్థితులను నిశితంగా పరిశీలిస్తోందన్నారు. వర్షాభావ పరిస్థితుల కారణంగా తాగునీటి అవసరాలపై ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించాల్సిన పరిస్థితి ఏర్పడిందని పేర్కొన్నారు.
పెరిగిన విద్యుత్ డిమాండ్
రాష్ట్రంలో అన్ని రంగాల్లో విద్యుత్ వినియోగం గణనీయంగా పెరిగిందని పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. విద్యుత్ వినియోగం ఆల్‌టైమ్ రికార్డు స్థాయిని దాటిందని చెప్పారు. పెరుగుతున్న డిమాండ్‌కు అనుగుణంగా భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని విద్యుత్ ఉత్పత్తి, నిల్వ సామర్థ్యాలను పెంచేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోందన్నారు.
ఇందులో భాగంగా 5,800 మెగావాట్ల గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తి కోసం టెండర్లు పిలవాలని నిర్ణయించినట్లు మంత్రి వెల్లడించారు. అలాగే 2,000 మెగావాట్ల బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ కోసం కూడా టెండర్లు ఆహ్వానించనున్నట్లు తెలిపారు.
ఎల్‌నినోపై నివేదిక
ఎల్‌నినో పరిస్థితులపై త్వరలో కేబినెట్ సబ్‌కమిటీలో చర్చించి సమగ్ర నివేదిక సిద్ధం చేస్తామని మంత్రి తెలిపారు. అనంతరం అఖిలపక్ష సమావేశం నిర్వహించి వివిధ పార్టీల అభిప్రాయాలను తీసుకుంటామని చెప్పారు. ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వాన్ని కలిసి రాష్ట్ర పరిస్థితులను వివరించేందుకు ఢిల్లీ వెళ్లనున్నట్లు వెల్లడించారు.
ఇక 22A అంశానికి సంబంధించి లేఅవుట్లు, భవన నిర్మాణ అనుమతుల్లో ఎదురవుతున్న సమస్యలపై తదుపరి కేబినెట్ సమావేశంలో చర్చించనున్నట్లు మంత్రి తెలిపారు. సమస్యలను పరిశీలించి అవసరమైన నిర్ణయాలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
