Vishwanathapuram
* సర్పంచ్, కుటుంబ సభ్యులపై దాడి
* పోలీసులకు ఫిర్యాదు
ఆకేరు న్యూస్, స్టేషన్ ఘన్ పూర్ : మద్య నిషేధ తీర్మానం పాటించడం లేదని ప్రశ్నించిన విశ్వనాధపురం సర్పంచ్ యాదమ్మపై గ్రామస్తులు దాడి చేశారు. కులం పేరుతో దూషించి తనతోపాటు భర్త, కుమారుడి పై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని ఆమె పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కింది.
వివరాల్లోకి వెళితే… జనగామ జిల్లా స్టేషన్ ఘన్పూర్ మండలం విశ్వనాథపురంలో బెల్ట్‌షాప్‌ల ద్వారా మద్యం అమ్మరాదని గ్రామసభలో ఏకగ్రీవంగా తీర్మానం చేసినప్పటికీ..ఓ వ్యక్తి ఆ తీర్మానాన్ని ధిక్కరించి మద్యం విక్రయిస్తున్నాడంటూ గ్రామ సర్పంచ్ గుర్రపు యాదమ్మ ఆరోపించారు. ఈ విషయాన్ని ప్రశ్నించేందుకు వెళ్లిన ఆమెపై దాడి చేశారంటూ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
గ్రామస్తుల సహకారంతో బెల్ట్‌షాపులను మూసివేసినప్పటికీ గ్రామానికి చెందిన ఓర్సు శ్రీను కొత్తగా బెల్ట్‌షాప్ ఏర్పాటు చేసి మద్యం విక్రయిస్తున్నాడని ఆరోపించారు. దీనిపై సమాచారం అందడంతో గ్రామపంచాయతీ సిబ్బంది మధును అక్కడికి పంపి ఫొటోలు తీయించినట్లు పేర్కొన్నారు.
ఈ క్రమంలో మధును శ్రీను దూషించి బెదిరించాడని తెలిపారు. విషయం తెలుసుకున్న తాను అక్కడికి వెళ్లి మద్యం విక్రయాలపై ప్రశ్నించగా వాగ్వాదం జరిగినట్లు సర్పంచ్ తెలిపారు. ఈ సందర్భంగా శ్రీను తనను కులం పేరుతో దూషించడంతో పాటు అతడు తండ్రి, ముగ్గురు కుమారులు నవీన్, ప్రవీణ్, రాజు, భార్య రజిత కలిసి తనపై దాడికి పాల్పడ్డారని ఆరోపించారు.
తనను అడ్డుకునేందుకు ప్రయత్నించిన భర్త ఎల్లయ్య, కుమారుడు నరేష్‌పై కూడా దాడి చేశారని ఫిర్యాదులో పేర్కొన్నట్లు తెలిపారు. గ్రామసభ తీర్మానాన్ని గౌరవించి గ్రామంలో బెల్ట్‌షాప్ నిర్వహణను అడ్డు కోవాలని, తనపై, తన కుటుంబ సభ్యులపై దాడికి పాల్పడ్డారంటూ ఫిర్యాదు చేసిన వారిపై సమగ్ర విచారణ జరిపి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సర్పంచ్ కోరారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
