Save Democracy March
* ఢిల్లీలో కట్టుదిట్టమైన భద్రత
ఆకేరు న్యూస్, న్యూఢిల్లీ : కేంద్ర ఎన్నికల సంఘం (ECI) తీరుపై నిరసనగా ఇండియా కూటమి దేశవ్యాప్తంగా చేపట్టిన ‘సేవ్ డెమొక్రసీ మార్చ్’ నేటి నుంచి ప్రారంభం కానుంది. అక్టోబర్ 2 నుంచి 8వ తేదీ వరకు జిల్లా స్థాయిలో ఈ నిరసన కార్యక్రమాలను నిర్వహించాలని కూటమి నిర్ణయించింది. అక్టోబర్ 6న ప్రతిపక్ష ఎంపీలంతా ఎన్నికల సంఘం కార్యాలయం వైపు మార్చ్ నిర్వహించనున్నారు.
మరోవైపు ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద అక్టోబర్ 2న నిరసనకు వామపక్ష విద్యార్థి సంఘాలు, సామాజిక కార్యకర్తలు పిలుపునిచ్చారు. ఎన్నికల సంఘం పనితీరు, ఓటర్ల జాబితా సవరణకు సంబంధించిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR)పై వారు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి ఉదయం 11 గంటలకు హాజరుకావాలని నిర్వాహకులు పిలుపునిచ్చారు.
అయితే జంతర్‌మంతర్ వద్ద నిరసనకు ఢిల్లీ పోలీసులు అనుమతి ఇవ్వలేదు. ఎలాంటి సంస్థకూ ఈ వారం జంతర్‌మంతర్ వద్ద నిరసనకు అనుమతి మంజూరు కాలేదని పోలీసులు తెలిపారు. అయినప్పటికీ పెద్ద సంఖ్యలో ఆందోళనకారులు వచ్చే అవకాశం ఉందన్న అంచనాతో భద్రతను కట్టుదిట్టం చేశారు.
జంతర్‌మంతర్‌కు వెళ్లే మార్గాల్లో భారీగా బారికేడ్లు ఏర్పాటు చేశారు. లుటియన్స్ ఢిల్లీ పరిధిలోని పలు ప్రాంతాల్లో అదనపు బలగాలను మోహరించారు. సుమారు 4 వేల మంది భద్రతా సిబ్బంది, రిజర్వ్ బలగాలు, ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్, కేంద్ర సాయుధ పోలీసు బలగాలను రంగంలోకి దించారు.
నిరసనల నేపథ్యంలో న్యూఢిల్లీలోని పలు ప్రాంతాల్లో రాకపోకలపై ఆంక్షలు కూడా విధించారు. జంతర్‌మంతర్ పరిసరాల్లో భద్రతా చర్యలను మరింత పెంచడంతో పాటు, ఢిల్లీ మెట్రోలోని 11 స్టేషన్ల ప్రవేశ, నిష్క్రమణ మార్గాలను తాత్కాలికంగా మూసివేశారు.
ఇలా ఒకవైపు ఇండియా కూటమి దేశవ్యాప్తంగా ‘సేవ్ డెమొక్రసీ మార్చ్’కు శ్రీకారం చుట్టగా.. మరోవైపు జంతర్‌మంతర్ నిరసనకు అనుమతి లేకపోవడంతో ఢిల్లీలో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తకుండా పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
