Ursu Jagir Dargah
* కలెక్టర్, సీపీ, మున్సిపల్ కమిషనర్‌కు దర్గా కమిటీ విజ్ఞప్తి
అకేరు న్యూస్, వరంగల్ : ఖిలా వరంగల్ మండలం ఉర్సు శివారులోని తాళ్ల పద్మావతి కాలేజ్ సమీపంలో ఉన్న వక్ఫ్ భూములకు సంబంధించిన నిలిచిపోయిన సర్వేను వెంటనే పునఃప్రారంభించాలని జిందా బిక్కన్ ధర్వేష్ ఉర్సు జాగిర్ దర్గా కమిటీ ప్రభుత్వ అధికారులను కోరింది.
ఈ మేరకు వరంగల్ జిల్లా కలెక్టర్, పోలీస్ కమిషనర్, మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్‌కు కమిటీ ప్రతినిధులు విజ్ఞప్తి చేశారు.
ఖిలా వరంగల్ మండలం పరిధిలోని ఉర్సు శివారులో సర్వే నంబర్లు 273, 274, 275, 276లో ఉన్న చారిత్రాత్మక వక్ఫ్ భూములకు సంబంధించి సెప్టెంబర్ 17, 2026న సర్వే ప్రక్రియ ప్రారంభమైందని కమిటీ తెలిపింది. అయితే కొన్ని కారణాల వల్ల సర్వే ప్రక్రియ మధ్యలోనే నిలిచిపోయిందని పేర్కొంది.
ఈ భూములు వక్ఫ్ బోర్డు పరిధిలోకి వస్తాయని, వాటిని పరిరక్షించాల్సిన బాధ్యత సంబంధిత అధికారులపై ఉందని దర్గా కమిటీ పేర్కొంది. సర్వే నిలిచిపోవడంతో భూముల రక్షణపై ఆందోళన నెలకొందని తెలిపింది.
నిలిచిపోయిన సర్వేను ల్యాండ్ ఆఫీసర్, తహసీల్దార్ (ఎమ్మార్వో), డీఆర్వో ఆధ్వర్యంలో, పూర్తి స్థాయి పోలీస్ బందోబస్తు మధ్య తక్షణమే పునఃప్రారంభించి పూర్తి చేయాలని కమిటీ కోరింది. ప్రభుత్వ భూములు, వక్ఫ్ ఆస్తులు అన్యాక్రాంతం కాకుండా అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేసింది.
చారిత్రాత్మక వక్ఫ్ భూముల పరిరక్షణకు సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో చర్యలు తీసుకుని, సర్వే ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని జిందా బిక్కన్ ధర్వేష్ ఉర్సు జాగిర్ దర్గా కమిటీ కోరింది.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
