Common Mobility Card
* హైదరాబాద్ ప్రయాణికులకు గుడ్ న్యూస్
* నేడు ప్రారంభించనున్న డిప్యూటీ సీఎం
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : సినిమా టికెట్ నుంచి షాపింగ్ బిల్లుల వరకు… అన్నీ డిజిటల్ మయమైన ఈ రోజుల్లో, హైదరాబాద్ మహా నగరంలో ప్రజా రవాణా వ్యవస్థ కూడా సరికొత్త డిజిటల్ విప్లవానికి సిద్ధమైంది. నగరవాసులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ‘కామన్ మొబిలిటీ కార్డు’ (ఉమ్మడి పాస్) ఎట్టకేలకు అందుబాటులోకి రానుంది. గాంధీ జయంతిని పురస్కరించుకుని బేగంపేట ప్రజాభవన్‌లో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క దీనిని లాంఛనంగా ప్రారంభించారు. నేటి నుంచే ఈ కార్డు చలామణీలోకి వస్తుందని అధికారులు ప్రకటించారు.
ప్రయాణం సులువు… సమయం ఆదా
గ్రేటర్ హైదరాబాద్‌లో నిత్యం రద్దీ విపరీతంగా పెరిగిపోతోంది. రోడ్లపై ట్రాఫిక్ కష్టాలను తప్పించుకోవడానికి చాలామంది మెట్రోను ఆశ్రయిస్తుంటే, తక్కువ ఖర్చుతో కూడిన ఆర్టీసీ బస్సులను లక్షలాది మంది నిత్యం వాడుతున్నారు. అయితే, బస్సు ఎక్కాలన్నా, మెట్రో ఎక్కాలన్నా విడివిడిగా టికెట్లు తీసుకోవడం ప్రయాణికులకు కొంత శ్రమతో కూడుకున్నది. ఈ సమస్యకు చెక్ పెడుతూ.. ఒకే కార్డుతో ఆర్టీసీ సిటీ బస్సులు, మెట్రో రైళ్లలో ప్రయాణించే అద్భుతమైన సౌకర్యాన్ని ప్రభుత్వం తీసుకొచ్చింది.
ఉమ్మడి పాస్ విశేషాలు ఇలా..
* ఈ పాస్‌లు అన్ని మెట్రో స్టేషన్లలో అందుబాటులో ఉంటాయి.
* ఎక్కడెక్కడ వర్తిస్తుంది? ఔటర్ రింగ్ రోడ్డు (ORR) లోపల నడిచే అన్ని రకాల ఆర్టీసీ సిటీ బస్సులు (పుష్పక్ మినహా), అలాగే మెట్రో రైళ్లలో ఈ ఉమ్మడి పాస్‌తో ప్రయాణించవచ్చు.
* మొదటిసారి కార్డు కొనుగోలు చేసేటప్పుడు రూ.100 వసూలు చేస్తారు. భవిష్యత్తులో కార్డును తిరిగి ఇచ్చేస్తే ఆ రూ.100 పూర్తిగా వాపస్ ఇస్తారు.
చార్జీలు ఇలా..
రోజు వారీ మెట్రో రూ.300, ఆర్టీసి రూ.100 : మొత్తం 400
నెల వారీగా మెట్రో చార్జీ రూ. 7,000.. ఆర్టీసీ బస్సు రూ. 1,500 : మొత్తం 8500
మీ టికెట్ యాప్
ఉమ్మడి పాస్‌తో పాటు సిటీ బస్సు ప్రయాణికుల కోసం ప్రభుత్వం సరికొత్తగా ‘మీ టికెట్’ (Me Ticket App) యాప్‌ను కూడా అందుబాటులోకి తెచ్చింది. బస్సులో చెల్లింపు పూర్తి కాగానే యాప్‌లో డైనమిక్ క్యూఆర్ కోడ్‌తో కూడిన డిజిటల్ టికెట్ జనరేట్ అవుతుంది. దీన్ని కండక్టర్‌కు చూపిస్తే సరిపోతుంది. చిల్లర సమస్యలు, కాగితపు టికెట్ల ఇబ్బందులు పూర్తిగా తొలగిపోతాయి.
రోజూ ప్రయాణించే నిత్య ప్రయాణికుల కోసం రూ.600 ధరతో వారాంతపు డిజిటల్ పాస్‌ను తెచ్చారు. ఇకపై పాస్‌ల కోసం సెంటర్ల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా, నేరుగా యాప్ నుంచే రూ.600 కే వీక్లీ పాస్ కొనుగోలు చేసి వారం రోజుల పాటు అపరిమితంగా బస్సుల్లో ప్రయాణించవచ్చు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
