Bisleri Water (File Photo)
* FSSAI ఆరోపణలు ఖండించిన సంస్థ
* మా వాటర్ పూర్తిగా సురక్షితం.. బిస్లరీ కీలక ప్రకటన
* 14 నెలల నాటి బ్యాచ్‌తో వివాదం.. బిస్లరీ వివరణ ఇదే..!
ఆకేరు న్యూస్, డెస్క్: ప్రముఖ ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ బ్రాండ్ బిస్లరీపై తలెత్తిన వివాదం ఆసక్తికరంగా మారింది. బిస్లరీ వాటర్ నమూనాల్లో నిర్ణీత పరిమితికి మించి రసాయనాలు ఉన్నాయని భారత ఆహార భద్రత, ప్రమాణాల ప్రాధికార సంస్థ (FSSAI) వెల్లడించగా.. ఈ ఆరోపణలను బిస్లరీ (Bisleri Water Controversy) ఇంటర్నేషనల్ ఖండించింది. తమ ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ పూర్తిగా సురక్షితమని సంస్థ స్పష్టం చేసింది.
ఎఫ్ఎస్ఎస్ఏఐ నిర్వహించిన పరీక్షల్లో బిస్లరీ ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ నమూనాలో బ్రోమేట్ స్థాయిలు అనుమతించిన పరిమితిని మించినట్లు గుర్తించారు. దీంతో ఆ నమూనాను సురక్షితం కానిదిగా ప్రకటించారు. సంస్థ అప్పీల్ చేయడంతో మరోసారి రిఫరల్ ఫుడ్ ల్యాబొరేటరీలో పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షల్లో పాలీ న్యూక్లియర్ అరోమాటిక్ హైడ్రోకార్బన్లు (PAHs) ఉన్నట్లు గుర్తించినట్లు సమాచారం. దీంతో బిస్లరీ సంస్థపై ప్రాసిక్యూషన్ చర్యలకు ఎఫ్ఎస్ఎస్ఏఐ అనుమతి ఇచ్చింది.
* ఆరోపణలను ఖండించిన బిస్లరీ..
మరోవైపు ఎఫ్ఎస్ఎస్ఏఐ ఆరోపణలను (Bisleri Water Controversy) బిస్లరీ ఇంటర్నేషనల్ ఖండించింది. తమ ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ పూర్తిగా సురక్షితమని స్పష్టం చేసింది. వివాదానికి సంబంధించినది సుమారు 14 నెలల క్రితం తయారైన పాత బ్యాచ్ నమూనా అని తెలిపింది. ఆ నమూనాకు సంబంధించి ప్రయోగశాల పరీక్షల ఫలితాలు భిన్నంగా వచ్చాయని పేర్కొంది.
* ప్లాంట్లలో 90కి పైగా నాణ్యత పరీక్షలు..
తమ ఉత్పత్తుల నాణ్యత, భద్రత విషయంలో ఎలాంటి రాజీ పడటం లేదని బిస్లరీ వెల్లడించింది. తమ ప్లాంట్లలో 90కి పైగా నాణ్యత పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపింది. ఉత్పత్తి ప్రక్రియలో ప్రతి దశలో నాణ్యతా ప్రమాణాలను పాటిస్తున్నామని సంస్థ పేర్కొంది. ఒకవైపు ఎఫ్ఎస్ఎస్ఏఐ ప్రయోగశాల పరీక్షల ఆధారంగా బిస్లరీ వాటర్ నమూనాపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తుండగా.. మరోవైపు సంస్థ తమ ఉత్పత్తులు సురక్షితమని చెబుతోంది. దీంతో ఈ వ్యవహారం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
అయితే పరీక్షల్లో అభ్యంతరాలు వ్యక్తమైన ఒక నిర్దిష్ట నమూనా ఆధారంగా మార్కెట్లో ఉన్న బిస్లరీ వాటర్ బాటిళ్లన్నీ సురక్షితం కావని నిర్ధారించలేం. ఈ వివాదంపై తదుపరి అధికారిక చర్యలు, స్పష్టత కోసం వినియోగదారులు ఎదురుచూస్తున్నారు.
Read Also : బిస్లరీ వాటర్ అన్‌సేఫ్..!

Please tell us what is wrong. Your report will be sent to the website team.

