Murder Attempt Crime News
*మారుతున్న నేరాల తీరుపై చర్చ
* కలకలం రేపుతున్న ఘటనలు
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : వ్యక్తిగత కక్షలు.. వివాహేతర సంబంధాలు.. ఆర్థిక లావాదేవీలు.. ఇలా కారణాలు ఏమైనా హైదరాబాద్ లో హత్యలు పెరుగుతున్నాయి. గ్లోబల్ సిటీగా ఎదుగుతున్న హైదరాబాద్‌లో శాంతిభద్రతల పరిరక్షణకు పోలీసు యంత్రాంగం కఠిన చర్యలు తీసుకుంటున్నప్పటికీ, నేరాల స్వభావం మాత్రం మారుతోంది.
వ్యవస్థీకృత నేరాల స్థానంలో ఇప్పుడు వ్యక్తిగత కక్షలు, ఆర్థిక లావాదేవీలు, క్షణికావేశం కారణాలతో దారుణాలు జరుగుతున్నాయి. కోకాపేట నియోపోలిస్‌లో నిన్న వెలుగు చూసిన వెంకట్ హత్య నుండి గత నెలలో జరిగిన పలు ఉదంతాల వరకు పరిశీలిస్తే… దారుణాలు పెరుగుతున్నాయని స్పష్టమవుతోంది.
కోకాపేట నియోపోలిస్‌లో..
నార్సింగి పోలీస్‌స్టేషన్ పరిధిలోని కోకాపేట నియోపోలిస్ ప్రాంతంలో వెలుగు చూసిన వెంకట్ హత్య కేసు హైదరాబాద్‌లో తీవ్ర కలకలం రేపింది. తెలుగులో పీహెచ్డీ చేస్తూ, ఫైనాన్స్ వ్యాపారం (వాహనాలపై వడ్డీకి డబ్బులు ఇవ్వడం) చేసే వెంకట్‌ను అత్యంత కిరాతకంగా హతమార్చడం స్థానికంగా భయాందోళనలకు గురిచేసింది.
మృతదేహం పక్కనే నంబర్ ప్లేట్లు తొలగించిన కారు లభించడం, కుటుంబానికి దూరంగా ఒంటరిగా ఉంటున్న వ్యక్తిని టార్గెట్ చేయడం వంటి పరిణామాలు ఈ హత్య వెనుక పెద్ద కుట్ర కోణం ఉన్నట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఆర్థిక లావాదేవీలే కారణమై ఉండొచ్చని పోలీసులు ప్రాథమికంగా అంచనాకు వచ్చారు.
సెప్టెంబర్‌లో జరిగిన మరికొన్ని ఘటనలు ఇలా..
* మంగళ్‌హాట్ హత్యోదంతం:తనను వేధిస్తున్నాడనే కోపంతో ఓ యువకుడిని పుట్టింటికి పిలిపించి, మహిళ తన బంధువుల సహాయంతో మెడకు చున్నీ బిగించి హత్య చేసిన ఘటన మంగళ్‌హాట్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని రహీంపురాలో చోటుచేసుకుంది. ఈ కేసుకు సంబంధించి ఇద్దరు మహిళలు సహా మొత్తం ఏడుగురిని పోలీసులు అరెస్టు చేశారు.
* ఎస్.ఆర్. నగర్ లోని ఓ హోటల్ గదిలో 34 ఏళ్ల బ్యాంకు ఉద్యోగిని శిరీష విగతజీవిగా పడిఉన్న ఉదంతం కలకలం రేపింది. ఆమెతో పాటు గదిలో ఉన్న ప్రియుడు శ్రీనివాస్ గొడవ కారణంగా ఆమెను కర్టెన్ రాడ్డుతో వస్తువుతో దాడి చేసి హతమార్చి, తెల్లవారుజామునే పరారైనట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది.
* నగరంలోని వివిధ ప్రాంతాల్లో సెప్టెంబర్ నెలాఖరులో జరిగిన ఘర్షణల్లో భాగంగా, డ్రగ్స్ వివాదాలు మరియు పాత కక్షల కారణంగా కొందరు యువకులు కత్తులతో దాడికి గురై ప్రాణాలు కోల్పోయిన ఘటనలు నమోదయ్యాయి.
నిఘా పటిష్టం.. పెట్రోలింగ్ పెంపు
వరుస హత్యల నేపథ్యంలో రాత్రి సమయాల్లో అల్లరి మూకలు, రౌడీషీటర్లు, అనుమానాస్పద వ్యక్తుల కదలికలపై నిఘా పెట్టాలని కమిషనరేట్ పరిధిలోని అన్ని పోలీసు స్టేషన్లను ఉన్నతాధికారులు అప్రమత్తం చేశారు.
ముఖ్యంగా కొత్తగా అభివృద్ధి చెందుతున్న లేఅవుట్లు, జనసంచారం తక్కువగా ఉండే ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించారు. ప్రజలు ఎవరైనా ఆర్థికపరమైన వివాదాలు లేదా తీవ్రమైన వ్యక్తిగత గొడవల్లో చిక్కుకుంటే చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవద్దని, పోలీసులను ఆశ్రయించాలని సూచిస్తున్నారు.
Please tell us what is wrong. Your report will be sent to the website team.
