DLPO Vedavathi
DLPO Vedavathi| ఆకేరు న్యూస్, రాయపర్తి: గ్రామాల అభివృద్ధితో పాటు పరిశుభ్రతకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని డివిజనల్ పంచాయతీ అధికారి (DLPO) వేదవతి సూచించారు. గాంధీ జయంతి, స్వచ్ఛ భారత్ దివస్ సందర్భంగా శుక్రవారం రాయపర్తి మండలం కొత్తూరు గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద ప్రత్యేక గ్రామసభ నిర్వహించారు. సర్పంచ్ కందికట్ల స్వప్న సంతోష్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి DLPO వేదవతి, MPDO పాక శ్రీనివాసులు, MPO కూచన ప్రకాష్ తదితరులు హాజరయ్యారు.
సభ ప్రారంభంలో మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం గ్రామస్తులు స్వచ్ఛతా ప్రతిజ్ఞ చేశారు. పారిశుధ్య కార్మికులు, ఉత్తమ సేవలు అందించిన స్వయం సహాయక సంఘాల మహిళలను సత్కరించారు. గ్రామ పంచాయతీ కార్యాలయం ఎదుట రిసోర్స్ మ్యాప్, సోషల్ మ్యాప్ రూపొందించి వికసిత్ గ్రామపంచాయతీ ప్రణాళికలో భాగంగా చేపట్టాల్సిన అభివృద్ధి పనులను గుర్తించారు.
ఈ సందర్భంగా DLPO వేదవతి మాట్లాడుతూ గ్రామీణాభివృద్ధి ప్రణాళికలను గ్రామసభల ద్వారా పారదర్శకంగా రూపొందిస్తున్నట్లు తెలిపారు. 16వ ఆర్థిక సంఘం నిధులను సద్వినియోగం చేసుకుని మౌలిక వసతులను మెరుగుపరచాలని సూచించారు. తాగునీరు, పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, గ్రామసభ తీర్మానాలు, వివరాలను ‘నిర్ణయ్’ (NIRNAY) యాప్లో నమోదు చేయాలని అధికారులకు సూచించారు.
MPDO పాక శ్రీనివాసులు, MPO కూచన ప్రకాష్ మాట్లాడుతూ ఉపాధి హామీ పథకం కింద అర్హులైన వారికి పని కల్పిస్తున్నామని తెలిపారు. వచ్చే ఆర్థిక సంవత్సరానికి చేపట్టాల్సిన పనులను గ్రామసభలో గుర్తించి ఆమోదించినట్లు చెప్పారు. స్వయం సహాయక సంఘాల మహిళలు ప్రభుత్వ పథకాలను వినియోగించుకుని ఆర్థిక స్వావలంబన సాధించాలని, ‘లఖ్పతీ దీదీ’లుగా ఎదగాలని ఆకాంక్షించారు. తడి, పొడి చెత్తను వేరు చేయడంతో పాటు ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించాలని కోరారు.
సర్పంచ్ కందికట్ల స్వప్న సంతోష్ మాట్లాడుతూ గ్రామాభివృద్ధి ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రజల సమష్టి బాధ్యత అని అన్నారు. కొత్తూరు గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు పంచాయతీ కృషి చేస్తుందని తెలిపారు. ప్రతి ఇంటికీ రక్షిత తాగునీరు అందించేలా మిషన్ భగీరథ పనులను పర్యవేక్షిస్తామని, డ్రైనేజీలు, వీధి దీపాల నిర్వహణను మెరుగుపరుస్తామని చెప్పారు.
ఈ కార్యక్రమంలో ప్లాంటేషన్ మేనేజర్ రమేష్, ఏపీఓ కుమార్, ఈసీ ప్రవీణ్, సాంకేతిక సహాయకులు చాగంటి ఏకాంతం, సందీప్, పంచాయతీ కార్యదర్శి అస్మా, ఉప సర్పంచ్ చిప్ప శ్రీను, వార్డు సభ్యులు, పంచాయతీ సిబ్బంది, మహిళా సమాఖ్య ప్రతినిధులు, అంగన్వాడీ కార్యకర్తలు, గ్రామస్తులు పాల్గొన్నారు.
SEO Tags

Please tell us what is wrong. Your report will be sent to the website team.
