Chanchalguda Jail Asaduddin Owaisi Allegations
* ఎంఐఎం నేతలే టార్గెట్
* రౌడీషీటర్లతో సూపరింటెండెంట్ చర్చలు
* హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ సంచలన వ్యాఖ్యలు
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : చంచల్‌గూడ జైలు కేంద్రంగా ఎంఐఎం నేతలపై దాడులు చేయడానికి కుట్రలు పన్నుతున్నారని హైదరాబాద్ ఎంపీ, ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ సంచలన ఆరోపణలు చేశారు.
హైదరాబాద్‌లోని మీలాద్ మైదాన్‌లో నిర్వహించిన 57వ ‘జల్సా-ఎ-మిలాద్-ఉన్-నబి’ బహిరంగ సభలో ఆయన ప్రసంగిస్తూ జైలు యాజమాన్యంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
చంచల్‌గూడ జైలు సూపరింటెండెంట్ ఖైదీలతో రహస్యంగా సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారని, లంచాలు తీసుకుంటూ రౌడీషీటర్ల అక్రమ కార్యకలాపాలకు, విడుదలకు ప్రత్యక్షంగా సహకరిస్తున్నారని మండిపడ్డారు.
అమాయకుల ప్రాణాలు తీస్తూ హత్యలకు పాల్పడే నేరస్థులను సామాజికంగా బహిష్కరించాలని, నేరస్థులకు జైలు అధికారులు కొమ్ముకాయడం ప్రజాస్వామ్యానికే ప్రమాదకరమని ఆయన హెచ్చరించారు.
*ఈసీకి హెచ్చరిక
ఈ సందర్భంగా నకిలీ ఫారమ్-7లను ఉపయోగించి ఓటర్ల జాబితా నుంచి ఓట్లను అక్రమంగా తొలగిస్తున్న తీరుపై ఎన్నికల సంఘాన్ని ఒవైసీ ప్రశ్నించారు.
దరఖాస్తుదారుల స్పష్టమైన వివరాలు లేకుండా ఓట్లను తొలగించడం వెనుక ఉన్న కుట్రను సహించేది లేదని, ఈ అక్రమాలు తక్షణమే ఆగకపోతే ఢిల్లీలోని జంతర్ మంతర్ ఆందోళనల కంటే భారీ ఎత్తున హైదరాబాద్ వీధుల్లో పెద్దఎత్తున నిరసన కార్యక్రమాలు చేపడతామని స్పష్టం చేశారు.
అలాగే కేంద్రంలోని ప్రభుత్వం తీసుకొస్తున్న ఎస్ఐఆర్ ప్రక్రియను ఎన్ఆర్సీ అమలుకు దొడ్డిదారిన ఉపయోగిస్తున్నారని, దేశ పౌరులను పరీక్షించేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని ఆరోపిస్తూ ఈ అంశాలపై ఎంఐఎం మౌనంగా ఉండదని ఒవైసీ స్పష్టం చేశారు.
*పాతబస్తీలో భద్రతా బలగాల మాక్‌డ్రిల్
ఇదిలా ఉండగా హైదరాబాద్ పాతబస్తీలోని చార్మినార్, మక్కా మసీదు వంటి సమస్యాత్మక, చారిత్రక ప్రాంతాల్లో భద్రతా బలగాలు ఆదివారం భారీ మాక్‌డ్రిల్ ట్రయల్స్ నిర్వహించాయి.
అత్యవసర పరిస్థితులు, ఉగ్రవాద దాడులు సంభవించినప్పుడు తక్షణమే స్పందించి వాటిని సమర్థవంతంగా తిప్పికొట్టే లక్ష్యంతో కౌంటర్ టెర్రరిజం ఆపరేషన్ బృందాలు ఈ విన్యాసాల్లో పాల్గొన్నాయి. కమాండోలు, పోలీసులు ఈ మాక్ డ్రిల్ లో పాల్గొన్నారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
