Khairatabad Bypoll
* కాంగ్రెస్‌పై డీకే అరుణ విమర్శలు
* ఎన్నికలకు రావాలని సవాల్
ఆకేరు న్యూస్, హైదరాబాద్: ఖైరతాబాద్ అసెంబ్లీ ఉపఎన్నిక విషయంలో అధికార కాంగ్రెస్‌పై బీజేపీ ఎంపీ డీకే అరుణ తీవ్ర విమర్శలు చేశారు. ఎన్నికల్లో ఓటమి తప్పదనే భయంతోనే ఉపఎన్నిక ప్రక్రియను అడ్డుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆమె ఆరోపించారు.
నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో డీకే అరుణ మాట్లాడారు. ఇతర పార్టీల నుంచి ఎమ్మెల్యేలను కాంగ్రెస్‌లో చేర్చుకోవడాన్ని ఆమె తప్పుపట్టారు. గతంలో ఫిరాయింపులను వ్యతిరేకించిన కాంగ్రెస్.. ఇప్పుడు ఇతర పార్టీల ప్రజాప్రతినిధులను తమ పార్టీలో చేర్చుకుంటోందని విమర్శించారు.
ఎన్నికలకు సిద్ధమా?
కాంగ్రెస్‌కు తన పాలనపై నమ్మకం ఉంటే ప్రజలను మరోసారి ఎదుర్కోవడానికి ఎన్నికలకు సిద్ధం కావాలని డీకే అరుణ సవాల్ చేశారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చామని చెబుతున్న కాంగ్రెస్ నాయకులు ఉపఎన్నిక విషయంలో ఎందుకు వెనుకడుగు వేస్తున్నారని ప్రశ్నించారు.
పార్టీ మారిన ఎమ్మెల్యేలతో రాజీనామాలు చేయించి, తిరిగి ప్రజల తీర్పు కోరాలని ఆమె డిమాండ్ చేశారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య లోపాయికారీ రాజకీయాలు కొనసాగుతున్నాయని, ఈ రెండు పార్టీల పాలనతో రాష్ట్రం అప్పుల భారంలోకి వెళ్లిందని డీకే అరుణ ఆరోపించారు.
కమలంపై ధీమా
ఖైరతాబాద్‌లో గతంలో బీజేపీ విజయాన్ని సాధించిందని గుర్తుచేసిన డీకే అరుణ.. రానున్న ఎన్నికల్లోనూ పార్టీ బలంగా పోటీ చేస్తుందని అన్నారు. కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం తెలంగాణ అభివృద్ధికి నిధులు అందిస్తోందని పేర్కొన్నారు.
ప్రజా సమస్యలను పక్కనపెట్టి రాజకీయ ప్రయోజనాల కోసం వ్యవహరిస్తున్న పార్టీలకు ప్రజలు తగిన సమాధానం చెబుతారని ఆమె వ్యాఖ్యానించారు.
మాజీ ఎమ్మెల్యే దానం నాగేందర్ అనర్హతతో ఖైరతాబాద్ అసెంబ్లీ స్థానం ఖాళీ అయింది. అయితే పెండింగ్‌లో ఉన్న ఎన్నికల పిటిషన్‌పై నిర్ణయం వచ్చే వరకు ఉపఎన్నిక నోటిఫికేషన్ జారీ చేయబోమని ఎన్నికల సంఘం తెలంగాణ హైకోర్టుకు తెలిపింది.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
