* కండక్టర్‌పై చర్యలకు మంత్రి ఆదేశం
Tadepalli| ఆకేరు న్యూస్, తాడేపల్లి : బస్సులో పరిచయమైన ఆర్టీసీ కండక్టర్ ప్రేమ పేరుతో మోసం చేసి, తన వద్ద నుంచి రూ.20 లక్షల నగదు, బంగారం కాజేసి లైంగిక దాడికి పాల్పడ్డాడని బాధితురాలు తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డిని కలిసి ఫిర్యాదు చేశారు. చంద్రగిరి మండలం కొంగరవారిపల్లెకు చెందిన తాను నిత్యం బస్సులో ప్రయాణించే సమయంలో కండక్టర్ వి. సుబ్రహ్మణ్యంతో పరిచయం ఏర్పడిందని, అతడు నమ్మించి మోసం చేశాడని ఆమె తన గోడు వెళ్లబోసుకున్నారు. ఈ మోసానికి సంబంధించిన ఫోన్‌పే లావాదేవీలు, కాల్ రికార్డులు, బంగారం కొనుగోలు బిల్లులు వంటి అన్ని ఆధారాలను ఆమె మంత్రికి సమర్పించారు.
ఆర్ ఎంతో మంత్రి వీడియోకాల్
బాధితురాలి ఆవేదనను సానుకూలంగా స్పందించి ఆలకించిన మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి వెంటనే తిరుపతి ఆర్టీసీ రీజినల్ మేనేజర్‌కు (ఆర్ఎం) వీడియో కాల్ చేసి మాట్లాడారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి, బాధ్యుడైన కండక్టర్‌పై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ప్రయాణికులతో, ముఖ్యంగా మహిళలతో ఆర్టీసీ సిబ్బంది ఎంతో బాధ్యతగా మరియు మర్యాదగా ప్రవర్తించాల్సిన అవసరం ఉందని మంత్రి హితవు పలికారు.
మహిళల భద్రతకు భరోసా
ఇలాంటి ఘటనలు సంస్థకు చెడ్డపేరు తెవడమే కాకుండా క్షమించరానివని మంత్రి పేర్కొన్నారు. భవిష్యత్తులో ఇటువంటి అక్రమాలు, అరాచకాలు పునరావృతం కాకుండా ఆర్టీసీ సిబ్బంది ప్రవర్తనపై అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. బాధితురాలికి చట్టపరంగా తగిన న్యాయం జరిగేలా చూస్తామని, మహిళల భద్రతకు ప్రభుత్వం ఎప్పుడూ పెద్దపీట వేస్తుందని ఆయన భరోసా కల్పించారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
