Apoorva Mukhija, Salman Khan, Amitabh Bachchan
Reality Shows| ఆకేరు న్యూస్, సినిమా : హీరోలుగా ప్రేక్షకులను అలరించిన పలువురు స్టార్లు ఇప్పుడు రియాల్టీ షోల వైపు అడుగులు వేస్తున్నారు. వెండితెరపై తమకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటులు.. బుల్లితెరపై హోస్టులుగా, మెంటర్లుగా కొత్త అవతారంలో కనిపించేందుకు ఆసక్తి చూపుతున్నారు. దీంతో రియాల్టీ షోలకు కూడా స్టార్ పవర్ పెరుగుతోంది.
తేజ సజ్జా సైతం..
యువ హీరో తేజ సజ్జా కూడా ఓ రియాల్టీ షోతో బుల్లితెర ప్రేక్షకులను పలకరించనున్నట్లు తెలుస్తోంది.పాపులర్ ఒటీటీ ప్లాట్‌ఫాం అమెజాన్ ప్రైమ్ వీడియో ఇంటర్నేషనల్ రియాలిటీ గేమ్ షో ‘ది ట్రైటర్స్’ తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్న విషయం తెలిసిందే. టాలీవుడ్ యాక్టర్ తేజ సజ్జ ఈ రియాలిటీ షోకు హోస్ట్‌గా వ్యవహరిస్తున్నాడు. ఇప్పటికే విడుదల చేసిన ప్రోమోకు మంచి స్పందన వస్తోంది.
సినిమాలతో బిజీగా ఉన్నప్పటికీ కొత్త తరహా కంటెంట్‌ను ప్రేక్షకులకు అందించాలనే ఉద్దేశంతో ఈ షోకు సంబంధించిన చర్చల్లో పాల్గొంటున్నట్లు సమాచారం. అయితే ఈ షోకు సంబంధించిన పూర్తి వివరాలు అధికారికంగా వెల్లడికావాల్సి ఉంది.
మాధవన్ కొత్త ప్రయోగం
ఇక విలక్షణ నటుడు ఆర్. మాధవన్ కూడా రియాల్టీ షో చేయనున్నట్లు టాక్ వినిపిస్తోంది. విదేశీ టెలివిజన్‌కు సంబంధించిన ఓ ఫార్మాట్ ఆధారంగా ఈ కార్యక్రమం రూపొందనుందని సమాచారం. నటుడిగా ఇప్పటికే తన ప్రత్యేకతను చాటుకున్న మాధవన్.. ఈ కొత్త ప్రయోగంతో ఎలాంటి మేజిక్ చేస్తారన్న ఆసక్తి నెలకొంది.
అమితాబ్.. కేబీసీకి కేరాఫ్
రియాల్టీ షోలకు స్టార్ హీరోలు హోస్టులుగా మారడం కొత్తేమీ కాదు. బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ ‘కౌన్ బనేగా కరోడ్‌పతి’తో ఈ ఫార్మాట్‌కు కొత్త క్రేజ్ తీసుకొచ్చారు. ఎన్నో సీజన్లుగా ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నడిపిస్తూ ప్రేక్షకులకు చేరువయ్యారు.
కరణ్ జోహార్ టాక్ షో
మరోవైపు దర్శకుడు, నిర్మాత, నటుడు కరణ్ జోహార్ ‘కాఫీ విత్ కరణ్’తో సెలబ్రిటీ టాక్ షోలకు ప్రత్యేక గుర్తింపు తెచ్చారు. సినీ ప్రముఖులతో ఆయన చేసే సంభాషణలు, వ్యక్తిగత విషయాలపై ప్రశ్నలు ఈ కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి.
నాగార్జునకు బిగ్ బాస్ క్రేజ్
తెలుగులో రియాల్టీ షోలకు భారీ ఆదరణ తీసుకొచ్చిన కార్యక్రమాల్లో ‘బిగ్ బాస్’ ముందుంటుంది. ముఖ్యంగా అక్కినేని నాగార్జున హోస్ట్‌గా వ్యవహరించడం ఈ షోకు మరింత క్రేజ్ తీసుకొచ్చింది. ప్రస్తుతం ఆయన మరోసారి బిగ్ బాస్ సీజన్‌తో ప్రేక్షకులను అలరిస్తున్నారు.
రియాల్టీ షోలదే రాజ్యం!
ఇలా ఒకవైపు సినిమాలు చేస్తూనే మరోవైపు రియాల్టీ షోలకు స్టార్లు ఓకే చెప్పడం ఆసక్తికరంగా మారింది. సినిమాల్లో కనిపించే ఇమేజ్‌కు భిన్నంగా తమ వ్యక్తిత్వాన్ని ప్రేక్షకులకు పరిచయం చేసుకునేందుకు రియాల్టీ షోలు మంచి వేదికగా మారుతున్నాయి. అందుకే స్టార్ హీరోలు, నటులు ఈ ఫార్మాట్‌పై ఆసక్తి చూపుతున్నారని విశ్లేషకులు భావిస్తున్నారు. రానున్న రోజుల్లో మరింత మంది సెలబ్రిటీలు రియాల్టీ షోల బాట పట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
