KBR Park Traffic Changes
* కేబీఆర్ పార్క్ వద్ద కీలక ప్రాజెక్టులకు స్వస్తి!
* రూట్లలో భారీ మార్పులు
* ఇప్పటికే వన్ వే విధానం సక్సెస్
* మరింత పక్కాగా అమలుకు ప్రణాళికలు
ఆకేరు న్యూస్, స్పెషల్ స్టోరీ : బంజారాహిల్స్ పరిధిలోని కేబీఆర్ పార్క్ చుట్టూ అమల్లోకి వచ్చిన వన్‌వే ట్రాఫిక్ విధానం మంచి ఫలితాలు ఇస్తున్నట్లుగా అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి నిర్ధారణకు వచ్చారు. దీంతో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, ట్రాఫిక్ పోలీసులు, ఇతర ప్రభుత్వ రవాణా విభాగాలు సంయుక్తంగా దీనిని మరింత పటిష్టం చేయడానికి శ్రీకారం చుట్టాయి. వన్‌వే అమలులోకి వచ్చిన నాటి నుంచి ఈ ప్రాంతంలో రద్దీ గణనీయంగా తగ్గడంతో పాటు వాహనాల రాకపోకలలో స్పష్టమైన మార్పు కనిపించింది. మరిన్ని ప్రణాళికలు రచించి ఇంకాస్త సాఫీగా రాకపోకలు సాగేలా అధికారులు చర్యలు చేపడుతున్నారు.
* ఫ్లైఓవర్లు, అండర్ పాస్ లకు బ్రేక్
ఈ విధానం ఆశించిన దానికంటే మెరుగైన ఫలితాలనివ్వడంతో, మొదట హైదరాబాద్ సిటీ ఇన్నోవేటివ్ అండ్ ట్రాన్స్ఫార్మేటివ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ (హెచ్ -సిటి) ప్రాజెక్టు కింద ఇక్కడ నిర్మించాలని తలపెట్టిన భారీ ఫ్లైఓవర్లు, అండర్ పాస్‌ల ప్రతిపాదనలకు ప్రభుత్వం స్వస్తి చెప్పింది. కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించే బహుళ నిర్మాణాల కంటే రహదారుల నిర్వహణలో చిన్నచిన్న మార్పులు చేయడమే మేలనే అభిప్రాయానికి అధికారులు వచ్చారు.
* వాహన వేగం ఎక్కడ మందగిస్తోంది?
గడిచిన రెండు నెలలుగా క్షేత్రస్థాయిలో నిరంతర పరిశీలన జరిపిన అధికారులు, క్షేత్ర సమస్యలను ప్రత్యక్షంగా అధ్యయనం చేశారు. ఏ కూడలి వద్ద వాహనాల వేగం మందగిస్తోంది? ఎక్కడ మలుపులు ఇబ్బందికరంగా ఉన్నాయి? బాటిల్ నెక్ ప్రాంతాలు ఎక్కడ ఏర్పడుతున్నాయి? అనే అంశాలపై వాహనదారుల నుంచి కూడా అభిప్రాయాలను సేకరించారు. రహదారి మధ్యలో అనవసరంగా ఎక్కువ స్థలాన్ని ఆక్రమిస్తున్న డివైడర్ల వెడల్పును గణనీయంగా కుదించాలని కీలక నిర్ణయం తీసుకున్నారు. ముఖ్యంగా క్యాన్సర్ ఆసుపత్రి నుంచి అగ్రసేన్ మహారాజ్ చౌరస్తా వరకు ఉన్న వెడల్పాటి డివైడర్ వల్ల రోడ్డు విస్తీర్ణం బాగా తగ్గిపోయేది. ఇప్పుడు ఈ డివైడర్‌ను కుదించి, రోడ్డును ఇరువైపులా విస్తరించడం ద్వారా వాహనాల రాకపోకలను సులభతరం చేస్తున్నారు.
* అగ్రసేన్ మహారాజ్ విగ్రహం తొలగింపు
మరోవైపు, అగ్రసేన్ మహారాజ్ చౌరస్తా వద్ద ఉన్న ఐలాండ్‌ను తొలగించినప్పటికీ, అక్కడ ఉన్న విగ్రహం వల్ల మలుపు వద్ద వాహనాల కదలికకు ఆటంకం ఏర్పడుతున్నట్లు గుర్తించారు. దీంతో విగ్రహ కమిటీ ప్రతినిధులతో చర్చలు జరిపి, అగ్రసేన్ మహారాజ్ విగ్రహాన్ని తాజ్‌మహల్ హోటల్ సమీపంలోని మోనోలిత్ పార్క్‌కు అత్యంత జాగ్రత్తగా తరలించారు. ఆ స్థానంలో గతంలో ఉన్న పెద్ద ఐలాండ్‌కు బదులుగా అత్యంత చిన్న పరిమాణంలో ఐలాండ్‌ను ఏర్పాటు చేస్తున్నారు. దీనివల్ల చౌరస్తా వద్ద వాహనాలు మలుపులు తిరిగేందుకు అదనపు స్థలం అందుబాటులోకి వచ్చి, అక్కడ ఎదురవుతున్న ట్రాఫిక్ ప్రతిష్టంభన సంపూర్ణంగా తొలగిపోనుంది.
* తగ్గనున్న ట్రాఫిక్ ఒత్తిడి
ఇదే క్రమంలో బంజారాహిల్స్ రోడ్ నంబర్ 2 నుంచి క్యాన్సర్ ఆసుపత్రి వైపు మలుపు తిరిగే మార్గంలో ఇరుకైన ప్రాంతాన్ని విస్తరించేందుకు సినీమాక్స్ పక్కనే ఉన్న ‘శబ్దాలయ స్టూడియో’కు చెందిన సుమారు 500 చదరపు గజాల స్థలాన్ని అధికారులు సేకరించారు. ఇందుకు ప్రతిఫలంగా స్టూడియో యాజమాన్యానికి ట్రాన్స్ఫరబుల్ డెవలప్మెంట్ రైట్స్ (టీడీఆర్) కేటాయించి ఒప్పందం కుదుర్చుకున్నారు. ఆ స్థలంలో కూల్చివేతలు పూర్తి చేసి రహదారి విస్తరణ పనులు చేపట్టడం వల్ల మలుపుల వద్ద ట్రాఫిక్ ప్రవాహం మెరుగుపడటమే కాకుండా, ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ చౌరస్తాపై కూడా ట్రాఫిక్ ఒత్తిడి తగ్గుతుంది. అంతేకాకుండా, జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 36 నుంచి చెక్‌పోస్ట్ మీదుగా వెళ్లే మార్గంలో మెట్రో రవాణా విభాగానికి చెందిన కొంత స్థలాన్ని సేకరించి మలుపుల వద్ద రహదారిని వెడల్పు చేస్తున్నారు.
* శాశ్వత పరిష్కారం
అయితే, ఈ సులభతర రవాణా వ్యవస్థకు బంజారాహిల్స్ రోడ్ నంబర్ 12 నుంచి తాజ్‌మహల్ హోటల్, ఫిల్మ్‌నగర్ వైపు వెళ్లే మార్గాల్లో ఉన్న ఇరుకైన బాటిల్ నెక్ ప్రాంతాలు ఇంకా సవాలుగానే మారాయి. అధికారులు ప్రస్తుతం ఈ ప్రాంతాలలో కూడా అవసరమైన చోట రహదారిని వెడల్పు చేయడానికి కొత్త ప్రణాళికలు రూపొందిస్తున్నారు. నిధుల దుబారా అయ్యే భారీ కాంక్రీట్ నిర్మాణాల జోలికి వెళ్లకుండా, కేవలం సమర్థవంతమైన ప్రణాళికలు, స్థల సమీకరణ, చిన్న చిన్న మలుపుల విస్తరణలతోనే హైదరాబాద్‌లోని అత్యంత రద్దీ ప్రాంతాలైన బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ ట్రాఫిక్ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపవచ్చని అధికారులు నిరూపిస్తున్నారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.

