Bhadrakali Navaratri 2026
* 11 రోజుల అలంకారాలు, వాహన సేవల పూర్తి షెడ్యూల్
* అక్టోబర్ 10 నుండి 21 వరకు శ్రీదేవి ఉత్సవాలు
ఆకేరు న్యూస్, వరంగల్: తెలంగాణ రాష్ట్రంలోని చారిత్రక రాజధాని ఏకశిలా నగరమైన వరంగల్ భద్రమ్మ గుట్టపై స్వయంవ్యక్తమై, భక్తుల కోరికలు తీర్చే కొంగుబంగారంగా విరాజిల్లుతున్న శ్రీ భద్రకాళీ దేవస్థానంలో ఈ ఏడాది శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవాలు అత్యంత వైభవంగా జరగనున్నాయి. స్వస్తిశ్రీ చాంద్రమాన పరాభవ నామ సంవత్సర ఆశ్వయుజ శుద్ధ ప్రతిపద్ (అక్టోబర్ 11) నుండి ఆశ్వయుజ శుద్ధ దశమి (అక్టోబర్ 21) వరకు ఆగమ సమ్రాట్ బ్రహ్మశ్రీ భద్రకాళి శేషు గారి ఆధ్వర్యంలో ఈ వేడుకలను అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించనున్నారు.
రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి, విశ్వశాంతికి, లోక కళ్యాణార్థం ఈ నవరాత్రి ఉత్సవాలలో శతచండీ మహాయాగము, మహారుద్ర యాగము, శ్రీలక్ష్మీ, దుర్గా, గణేశ, సరస్వతీ యాగాలతో పాటు దశమహావిద్య మహాయాగం మరియు సుదర్శన యాగాలు విశేషంగా జరపబడతాయి.
* రోజువారీ అలంకారాలు & పూజా కార్యక్రమాల సమగ్ర సమాచారం
అక్టోబర్ 10 (శనివారం – నవరాత్రి పూర్వాంగం):
హరిద్రాదర్శనము, బతుకమ్మ పండుగ ప్రారంభంతో పాటు శరన్నవరాత్త్ర్రయాగ పూర్వాంగవిధి కార్యక్రమాలు జరుగనున్నాయి.
అక్టోబర్ 11 (ఆదివారం – ఆశ్వయుజ శు॥ ప్రతిపద్):
ఉదయం 4:00 గంటలకు నిత్యాహ్నికం, గణపతి పూజ, ధ్వజారోహణము, కలశస్థాపనతో నవరాత్రులు ప్రారంభమవుతాయి. అమ్మవారు “బాలా త్రిపురసుందరీ అలంకారము”లో దర్శనమిస్తారు. ఉదయం 11:00 గంటలకు వృషభ వాహన సేవ, రాత్రి 7:00 గంటలకు మృగ (జింక) వాహన సేవ నిర్వహిస్తారు.
అక్టోబర్ 12 (సోమవారం – ఆశ్వయుజ శు॥ విదియ):
ఉదయం 4:00 గంటలకు నిత్యాహ్నికం అనంతరం అమ్మవారు “అన్నపూర్ణాలంకారము”లో కన్నులవిందు చేయనున్నారు. ఉదయం 11:00 గంటలకు మకర వాహన సేవ, సాయంత్రం 7:00 గంటలకు చంద్రప్రభ వాహన సేవలు ఉంటాయి.
అక్టోబర్ 13 (మంగళవారం – ఆశ్వయుజ శు॥ తదియ):
ఉదయం 4:00 గంటలకు ప్రత్యేక పూజల అనంతరం “గాయత్రీ అలంకారము” జరుగనుంది. ఈ రోజు ఉదయం 11:00 గంటలకు సింహ వాహన సేవ, సాయంత్రం 7:00గంటలకు గజవాహన సేవ ఘనంగా నిర్వహిస్తారు.
అక్టోబర్ 14 (బుధవారం – ఆశ్వయుజ శు॥ చతుర్థి):
ఉదయం 4:00 గంటల నుండి పూజలు ప్రారంభమై అమ్మవారు “శ్రీ మహాలక్ష్మీ అలంకారము”లో భక్తులకు అభయమిస్తారు. ఉదయం 11:00 గంటలకు సూర్యప్రభ వాహన సేవ, సాయంత్రం 7:00 గంటలకు హంసవాహన సేవ జరుగుతాయి.
అక్టోబర్ 15 (గురువారం – ఆశ్వయుజ శు॥ పంచమి):
ఉదయం 4:00 గంటలకు నిత్యాహ్నికం అనంతరం “లలితా మహా త్రిపుర సుందరీ అలంకారము” చేపడతారు. ఉదయం 11:00 గంటలకు పల్లకీ సేవ, సాయంత్రం 7:00 గంటలకు శేషవాహన సేవలు నిర్వహించనున్నారు.
అక్టోబర్ 16 (శుక్రవారం – ఆశ్వయుజ శు॥ షష్ఠి):
మూలా నక్షత్రం సందర్భంగా పుస్తక రూపంలో ఉన్న సరస్వతీ దేవికి పూజలు నిర్వహిస్తారు. ఉదయం 4:00 గంటలకు నిత్యాహ్నికం మరియు “భవానీ అలంకారము” ఉంటుంది. ఉదయం 11:00 గంటలకు గంధోత్సవము, సాయంత్రం 7:00 గంటలకు సాలభంజిక సేవ ఊరేగింపు జరుగుతుంది.
అక్టోబర్ 17 (శనివారం – ఆశ్వయుజ శు॥ సప్తమి):
ఉదయం 4:00 గంటల నుండి చతుఃస్థానార్చన పూజలు, అమ్మవారికి “సరస్వతీ అలంకారము” చేస్తారు. సాయంత్రం 7:00 గంటలకు రథోత్సవము అత్యంత వైభవంగా సాగుతుంది.
అక్టోబర్ 18 (ఆదివారం – ఆశ్వయుజ శు॥ అష్టమి):
దుర్గాష్టమి, సద్దుల బతుకమ్మ పండుగ రోజున ఉదయం 4:00 గంటలకు నిత్యాహ్నికం, “శ్రీ భద్రకాళీ దుర్గా అలంకారము” సమర్పిస్తారు. ఉదయం భద్రపీఠ సేవ, సాయంత్రం అశ్వవాహన సేవలు ఉంటాయి. రాత్రి వేళ మహారాత్రి హవనము, విశేష అభిషేకాలు, జాగరణ కార్యక్రమాలు జరుగుతాయి.
అక్టోబర్ 19 (సోమవారం – ఆశ్వయుజ శు॥ నవమి):
మహానవమి పర్వదినాన ఉదయం 4:00 గంటలకు “మహిషాసురమర్ధిని అలంకారము” చేపడతారు. ఉదయం 11:00 గంటలకు చతురంగ సేవ, సాయంత్రం 7:00 గంటలకు విమానక సేవ (సర్వభూపాల వాహన సేవ) జరుగుతాయి.
అక్టోబర్ 20 (మంగళవారం – ఆశ్వయుజ శు॥ దశమి):
విజయదశమి (దసరా పండుగ) సందర్భంగా ఉదయం 4:00 గంటలకు నిత్యాహ్నికం, నవరాత్త్ర్రయాగ మహాపూర్ణాహుతి, శమీపూజ, ఆయుధ పూజలు నిర్వహిస్తారు. సాయంత్రం 7:00 గంటలకు శ్రీ భద్రకాళీ అమ్మవారి జలక్రీడోత్సవం (తెప్పోత్సవము) శోభాాయమానంగా జరుగనుంది.
అక్టోబర్ 21 (బుధవారం – ఆశ్వయుజ శు॥ ఏకాదశి/దశమి):
ఉదయం 6:00 గంటలకు కుంభాభిషేకం, సాయంత్రం “శ్రీ భద్రకాళీ అమ్మవారి సామ్రాజ్యపట్టాభిషేకం” సాయంత్రం 7:00 గంటలకు అత్యంత వైభవంగా “శ్రీ భద్రకాళీ భద్రేశ్వరుల కళ్యాణం”, పుష్పయాగం, మహదాశీర్వచనంతో నవరాత్రి ఉత్సవాలు పరిసమాప్తమవుతాయి.
ఈ ఉత్సవ దినములలో ప్రతిరోజూ తమిళనాడు రాష్ట్రానికి చెందిన రత్నగిరి, నామక్కల్, తంజావూరు కళాకారులచే విశేష పూలంగి సేవలు, పుష్పాలంకరణలు సమర్పించబడతాయని ఆలయ ధర్మకర్తల మండలి తెలిపింది.

Please tell us what is wrong. Your report will be sent to the website team.

