Mailaram Road Accident
* మైలారం రైస్ మిల్ జంక్షన్ వద్ద విషాదం
ఆకేరు న్యూస్, రాయపర్తి: మైలారం గ్రామానికి చెందిన వంగ సరస్వతి గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో మృతి చెందింది. గురువారం తెల్లవారుజామున 5:27 గంటల సమయంలో మైలారం రైస్ మిల్ జంక్షన్ సమీపంలో ఈ ప్రమాదం జరిగినట్లు ఫిర్యాదులో తెలిపారు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన సరస్వతి అక్కడికక్కడే మృతి చెందినట్లు పేర్కొన్నారు.
మైలారం గ్రామానికి చెందిన వంగ సరస్వతి (48) కూలీ పనులు చేసుకుంటూ జీవిస్తున్నారు. గురువారం ఉదయం సుమారు 5:27 గంటలకు వరంగల్ నుంచి ఖమ్మం వైపు వెళ్లే మార్గంలో రోడ్డు పక్కనే ఉన్న దుకాణానికి నడుచుకుంటూ వెళ్తుండగా.. వెనుక నుంచి వచ్చిన గుర్తుతెలియని వాహనం ఆమెను ఢీకొట్టి ఆపకుండా వెళ్లిపోయినట్లు ఆమె కుమార్తె నవ్య ఫిర్యాదులో తెలిపారు.
వాహనం ఢీకొట్టడంతో సరస్వతి రోడ్డుపై పడిపోయి తలకు, రెండు కాళ్లకు తీవ్ర గాయాలైనట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ విషయాన్ని ఆమె బాబాయి వంగ వెంకటేష్ ఉదయం సుమారు 5:50 గంటలకు ఫోన్ ద్వారా తనకు సమాచారం అందించారని నవ్య తెలిపారు. వెంటనే అక్కడికి చేరుకుని చూడగా తలకు, రెండు కాళ్లకు తీవ్ర గాయాలతో తన తల్లి మృతి చెంది ఉన్నట్లు గుర్తించినట్లు పేర్కొన్నారు.
తన తల్లిని ఢీకొట్టి వెళ్లిపోయిన గుర్తుతెలియని వాహనాన్ని గుర్తించి, డ్రైవర్‌పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని నవ్య పోలీసులను కోరారు. ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు సమాచారం. ప్రమాదానికి కారణమైన వాహనం, డ్రైవర్‌ను గుర్తించేందుకు పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.

