National Medical Commission
* 100% క్యూర్ అంటూ హామీలు ఇక కుదరవు
* AIతో కల్పిత రోగుల ప్రశంసలకు NMC చెక్
NMC Guidelines| ఆకేరు న్యూస్, న్యూఢిల్లీ: విధానంపై జాతీయ వైద్య కమిషన్ (National Medical Commission–NMC) వైద్య విధానంపై కొత్త మార్గదర్శకాలు విడుదల చేసింది. అక్టోబర్ 6 నుంచి అమల్లోకి వచ్చిన ఈ మార్గదర్శకాల్లో వైద్యులు, ఆస్పత్రులు వాటి సేవలను ప్రజలకు తెలియజేయటంలో అతిశయోక్తులు, అబద్ధాలుండరాదని సూచించింది. వైద్య ప్రకటనలు, ప్రజలతో సమాచార వినిమయానికి కఠిన మార్గదర్శకాలను నిర్దేశించింది.
కృత్రిమ మేధ (Artificial Intelligence–AI)తో కల్పిత రోగుల ప్రశంసలు సృష్టించడం, నిర్ధారించలేని చికిత్స ఫలితాలను ప్రచారం చేయడం, డబ్బుతో ఆన్లైన్ ర్యాంకింగులను తారుమారు చేయడం వంటి పద్ధతులకు కొత్త మార్గదర్శకాలతో అడ్డుకట్ట పడింది. అనవసర వైద్య, శస్త్రచికిత్సలను ప్రోత్సహించే ఆఫర్లు, రోగులను తీసుకొచ్చినందుకు చెల్లింపులపైనా ఎన్ఎంసి నియంత్రణలను విధించింది.
ఇప్పుడే ఎందుకు?
సుప్రీంకోర్టులో దాఖలైన రిట్ పిటిషన్ నంబరు 1160/2023 ఆధారంగా, వైద్య వృత్తి నైతిక నియమావళి–2002 ను అనుసరించి ఈ పత్రాన్ని రూపొందించినట్లు ఎన్ఎంసీ తెలిపింది.
వైద్య ప్రకటనలపై ఆంక్షలు ఇప్పుడే మొదలైనవి కావు. 2002 నియమావళిలోనే ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా రోగులను ఆకర్షిం చడం, చికిత్స విజయాలను గొప్పగా ప్రచారం చేసుకోవడం, రిఫరల్ కమిషన్లు తీసుకోవడంపై నిషేధాలు ఉన్నాయి. ఆ క్రమంలోనే ప్రజారోగ్యంపై అవగాహన కల్పించడం వైద్యుల బాధ్యతగా పేర్కొంది.
వంద శాతం విజయం చెప్పొచ్చా?
100 శాతం విజయం, గ్యారంటీగా నయం, నంబర్‌వన్, అత్యంత విశ్వసనీయమైనది వంటి ప్రచారాలను తాజా మార్గదర్శకాలు నియంత్రిస్తున్నాయి. అనవసర వైద్యసంప్రదింపులను ప్రోత్సహించే పరిమితకాల డిస్కౌంట్లు, కూపన్లు, బహుమతులు, రిఫరల్ ప్రయోజనాలూ నిషేధిత పరిధిలోకి వస్తాయి.
చికిత్సలో వ్యక్తుల ఆరోగ్య పరిస్థితులు భిన్నంగా ఉంటాయి. ఒకరికి వచ్చిన మంచి ఫలితం మరొకరికి అలాగే వస్తుందనే హామీ లేదు. ఈ తేడాను దాచిపెట్టి విజయాన్ని మాత్రమే చూపించే ప్రచారం రోగి నిర్ణయాన్ని ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా పరిమితులు, పద్ధతి తెలియకుండా చికిత్సకు పూనుకుంటే ఆర్థిక భారం, ఆరోగ్య నష్టం రెండూ ఎదురయ్యే అవకాశం ఉంటుంది.
రోగి అనుమతి ఇచ్చినా హద్దులే!
వైద్య చికిత్సకు సంబంధించి ప్రశంసా ప్రకటనలు, చికిత్సకు ముందు–తర్వాత చిత్రాలు, విజయ ప్రచారాలకు రోగి సమ్మతి ఒక్కటే అనుమతి కాదని పత్రం స్పష్టం చేసింది. అనుమతించబడిన సమాచార వినియోగంలోనూ గోప్యతా రక్షణలు అవసరం.
ఇది కీలకమైన అంశం. చికిత్సకు ఇచ్చే సమ్మతి, తన అనుభవాన్ని బహిరంగంగా ప్రచారం చేయడానికి ఇచ్చే సమ్మతి వేర్వేరు. ఆస్పత్రిపై ఆధారపడిన సమయంలో రోగి ఇచ్చిన అంగీకారాన్ని ప్రచారానికి శాశ్వత అనుమతిగా భావించడం సందేహాత్మకం, సమస్యాత్మకం.
ఏఐపై పూర్తిగా నిషేధమా?
వాణిజ్య ప్రయోజనాల కోసం ఏఐ ప్రచారాన్ని నిషేధిస్తూ, అనుమతించబడిన ఏఐ సమాచారానికి మూలాన్ని వెల్లడించాలని పత్రం పేర్కొంది. రోగి చిత్రం, గొంతు, అనుభవం, చికిత్స ఫలితాన్ని ప్రకటించడం, మార్చడం అనుమతించదు. ఏఐతో రూపొందించిన వ్యక్తి నిజమైన రోగిలా కనిపిస్తే, అతని మాటలు వైద్యానికి సాక్ష్యంగా మారిపోతాయి. అందువల్ల ఈ నియంత్రణలో సాంకేతికత కంటే, దానితో తయారయ్యే నమ్మకమే ప్రధాన అంశం.
వైద్యుల ఇంటర్వ్యూలు కొనసాగవచ్చా?
వాణిజ్య ప్రచారంలో ఆరోగ్య విద్యకు అవకాశం ఉంది. ఆస్పత్రులు వాస్తవ సమాచారాన్ని అందించవచ్చు. మూడో పక్షంతో ప్రచారం చేయించినంత మాత్రాన బాధ్యత తొలగిపోదు. అంటే వైద్య నిపుణుడు వ్యాధి లక్షణాలు, నివారణ, చికిత్స పరిమితులను వివరించే ఇంటర్వ్యూకు, తన వద్దకే రావాలనే ఉద్దేశంతో చేసే ప్రచారానికి తేడా ఉంటుంది. మీడియా సంస్థలకు కూడా ఈ హద్దు ప్రాధాన్యం కలిగిస్తుంది.
ఉల్లంఘిస్తే ఏమవుతుంది?
ఎన్ఎంసి తప్పుడు, అబద్ధపు ప్రచారం చేసిన వ్యక్తులు, సంస్థలకు మొదటిసారి హెచ్చరిక చేస్తారు. ఆ తర్వాత కూడా అవే తప్పులు జరిగితే.. నైతిక శిక్షణ నుంచి సస్పెన్షన్, రిజిస్టర్ నుంచి తొలగింపు వరకు దశలవారీ చర్యలను ఎన్ఎంసి పత్రం సూచించింది. రాష్ట్ర వైద్య మండలి చట్టబద్ధ ప్రక్రియలో వైద్యంలో అపసవ్వాలను తొలగించాలి. అనైతికాలు, తప్పులకు పాల్పడితే.. వివరణ అవకాశం, అప్పీల్ ఉంటాయి. ఆసుపత్రులపై చట్టాల ప్రకారం చర్యలు ఉంటాయి.
అమలే అసలు పరీక్ష..
ఆరోగ్య సమాచారం ప్రజలకు అందాలి. అదే సమయంలో కల్పిత విజయాలు, కొనుగోలు చేసిన ప్రశంసల ఆధారంగా చికిత్స మార్కెట్ పెరగకూడదు. ఈ రెండింటి మధ్య స్పష్టమైన హద్దును అమలు చేయడమే కొత్త మార్గదర్శకాల అసలు పరీక్ష. వ్యక్తిగత వైద్యుడి ప్రకటనతోపాటు పెద్ద ఆస్పత్రులు, డిజిటల్ వేదికల ప్రచారాన్నీ సమానంగా పరిశీలించినప్పుడే రోగులకు వీటి ప్రయోజనం చేరుతుంది.
వైద్యంలో దోపిడి సంగతేంది?
వైద్యం పేరిట జరిగే తతంగం, చేసే శస్త్రచికిత్సల్లోనూ, వాటికి అవసరంగా వినియోగించే పరికరాల్లోనూ జరుగుతున్న దోపిడీ గురించి ఎన్ఎంసీ తాజా రిపోర్టులో ప్రస్తావన లేకపోవటం విషాదం. ఆస్పత్రుల్లో రూ. 1700 ధర ఉన్న ఓ క్యాన్సర్ మందును రూ. 37 వేలకు అమ్ముతున్న తీరుపట్ల ఇటీవల సుప్రీం కోర్టే విస్మయం వ్యక్తం చేసింది. అలాగే.., రూ 11 ధర ఉన్న ఐవీ ట్యూబ్ సెట్‌కు రూ. 325లు, రూ. 45 లకు దొరికే ఆక్సిజన్ మాస్క్‌కు 625 బిల్లులతో 2,840 శాతం అధికంగా వసూలు చేస్తున్న తీరును మాత్రం పట్టించుకోకపోవటం విడ్డూరం.

Please tell us what is wrong. Your report will be sent to the website team.

