Bathukamma Celebrations
Bathukamma Celebrations| ఆకేరు న్యూస్, పాలకుర్తి: బతుకమ్మ సంబరాలు జనగామ జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలో వైభవంగా ప్రారంభమయ్యాయి. ఎంగిలిపూల బతుకమ్మ వేడుకల్లో పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని మహిళలతో కలిసి బతుకమ్మ ఆడారు. సంప్రదాయ బతుకమ్మ పాటలకు అనుగుణంగా అడుగులు వేస్తూ నృత్యం చేయడంతో వేడుకల్లో ఉత్సాహం నెలకొంది.
మహిళలతో కలిసి సందడి
పాలకుర్తిలో నిర్వహించిన బతుకమ్మ వేడుకల్లో స్థానిక మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. బతుకమ్మలను అందంగా అలంకరించి, వాటి చుట్టూ చేరి సంప్రదాయ పాటలు పాడుతూ సంబరాలు చేసుకున్నారు. ఎమ్మెల్యే యశస్విని రెడ్డి మహిళలతో కలిసి బతుకమ్మ ఆడటంతో వేడుకలకు మరింత సందడి వచ్చింది. మహిళలు, ఆడపడుచులు ఉత్సాహంగా పాల్గొని పండుగ వాతావరణాన్ని తీసుకొచ్చారు.
సంస్కృతికి ప్రతీక
ఈ సందర్భంగా ఎమ్మెల్యే యశస్విని రెడ్డి మాట్లాడుతూ.. బతుకమ్మ పండుగ కేవలం పూల పండుగ మాత్రమే కాదని, తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు, ఐక్యతకు ప్రతీక అని అన్నారు. ప్రకృతిని ఆరాధిస్తూ పూలతో బతుకమ్మను పేర్చి పూజించడం తెలంగాణ ప్రత్యేకతను చాటిచెబుతుందని పేర్కొన్నారు.
తొమ్మిది రోజులపాటు జరిగే బతుకమ్మ పండుగ కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు ఒకచోట చేరి ఆనందంగా గడిపేందుకు దోహదపడుతుందని తెలిపారు. పల్లెల్లో పండుగ శోభను పెంచడంతోపాటు మహిళల్లో ఐక్యత, సంతోషాన్ని నింపుతుందని చెప్పారు.
భావితరాలకు సంప్రదాయాలు
తెలంగాణ అద్భుతమైన సంస్కృతి, సంప్రదాయాలను భావితరాలకు అందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. తెలంగాణ ఆడపడుచులందరూ ఆయురారోగ్యాలతో, సిరిసంపదలతో సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. మహిళల మధ్య ఒక కుటుంబ సభ్యురాలిగా బతుకమ్మ వేడుకల్లో పాల్గొనడం ఆనందంగా ఉందని తెలిపారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.

