* రంగురంగుల పూలతో బతుకమ్మల పేర్పు
* జానపద గీతాలు, కోలాటాలతో సందడి
Kamalapur Bathukamma| ఆకేరు న్యూస్, కమలాపూర్: హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలంలోని పలు గ్రామాల్లో శనివారం ఎంగిలి పూల బతుకమ్మ వేడుకలు భక్తిశ్రద్ధలతో, ఉత్సాహభరిత వాతావరణంలో జరిగాయి. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగ ప్రారంభం కావడంతో మహిళలు, యువతులు పెద్ద సంఖ్యలో పాల్గొని సంబరాలు చేసుకున్నారు.
పూలతో బతుకమ్మల పేర్పు
ఉదయం నుంచే మహిళలు తంగేడు, గునుగు, చామంతి, బంతి తదితర రంగురంగుల పూలను సేకరించి అందంగా బతుకమ్మలను పేర్చారు. అనంతరం బతుకమ్మపై గౌరమ్మను ప్రతిష్ఠించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కుటుంబాలు సుఖసంతోషాలతో ఉండాలని, గ్రామాలు సుభిక్షంగా వర్ధిల్లాలని ప్రార్థించారు.
పాటలు.. కోలాటాలతో సందడి
సాయంత్రం వేళ ఆయా గ్రామాల్లోని ఆలయ ప్రాంగణాలు, చెరువు కట్టలు, మైదానాలు బతుకమ్మ వేడుకలకు వేదికలయ్యాయి. మహిళలు వలయాకారంలో చేరి సంప్రదాయ బతుకమ్మ పాటలు పాడుతూ కోలాటాలు, నృత్యాలతో సందడి చేశారు. పండుగ వాతావరణంతో గ్రామాల్లో సందడి నెలకొంది.
ఆలయాల వద్ద భారీగా పాల్గొన్న మహిళలు
కమలాపూర్‌లోని స్థానిక రామాలయం వద్ద మహిళలు పెద్ద సంఖ్యలో చేరి బతుకమ్మ ఆడారు. ఉప్పల్ గ్రామంలో మహిళలు, చిన్నారులు స్థానిక సాంబమూర్తి దేవాలయం వద్దకు చేరుకుని బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్నారు. పూజల అనంతరం సంప్రదాయం ప్రకారం వాయనాలు ఇచ్చిపుచ్చుకున్నారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.

