పూర్వ విద్యార్థుల అపూర్వ ఆత్మీయ సమ్మేళనం
* పూర్వ విద్యార్థుల అపూర్వ ఆత్మీయ సమ్మేళనం
Palakurthi| ఆకేరు న్యూస్, పాలకుర్తి: చిన్ననాటి స్నేహబంధాలు జీవితాంతం మధుర జ్ఞాపకాలుగా నిలిచిపోతాయని పాలకుర్తి హైస్కూల్ పూర్వ విద్యార్థులు పేర్కొన్నారు. సుదీర్ఘకాలం విద్యాశాఖలో ఉపాధ్యాయుడిగా సేవలందించి పదవీ విరమణ పొందిన రాగి రామకృష్ణకు ఆయన చిన్ననాటి మిత్రులు ఆత్మీయ అభినందన సభ ఏర్పాటు చేసి ఘనంగా సత్కరించారు.
ఈ సందర్భంగా మిత్రులు మాట్లాడుతూ.. పాలకుర్తి హైస్కూల్లో కలిసి చదువుకున్న రోజుల్ని, నాటి మధుర జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు. ఒకే పాఠశాలలో చదువుకుంటూ ఎన్నో కలలు కన్న తమ మిత్రుడు రామకృష్ణ ఉపాధ్యాయ వృత్తిని ఎంచుకుని, ఎంతోమంది విద్యార్థుల భవిష్యత్తుకు బంగారు బాటలు వేయడం గర్వకారణమని అన్నారు.
ఉపాధ్యాయుడిగా ఉద్యోగ బాధ్యతల నుంచి పదవీ విరమణ పొందినప్పటికీ, సమాజానికి జ్ఞానాన్ని పంచే గురువుగా ఆయన సేవలకు ఎప్పటికీ విరమణ ఉండదని కొనియాడారు. దశాబ్దాల పాటు విద్యారంగానికి అంకితభావంతో సేవలందించిన ఆయన ప్రస్థానం ఎందరికో ఆదర్శమని పేర్కొన్నారు.
చిన్ననాటి స్నేహితుడి పదవీ విరమణ వేడుకలో అందరూ ఒకచోట చేరి పాత జ్ఞాపకాలను నెమరువేసుకోవడం మరచిపోలేని అనుభూతిని కలిగించిందన్నారు. పదవీ విరమణ అనంతరం రామకృష్ణ ఆయురారోగ్యాలతో, కుటుంబ సభ్యులతో సుఖసంతోషాలతో జీవించాలని ఆకాంక్షించారు.
కాలం మారినా, పరిస్థితులు మారినా చిన్ననాటి స్నేహబంధం ఎప్పటికీ చెరిగిపోదని ఈ ఆత్మీయ సమ్మేళనం మరోసారి చాటిచెప్పింది.
ఈ కార్యక్రమంలో రాగి రామకృష్ణ చిన్ననాటి మిత్రులు సింగారపు నర్సింగం, ఎం. నాగయ్య, కె. రమేష్, కె. సోమయ్య, టి. హరిసింగ్, పి. కృష్ణమూర్తి, కె. కృష్ణమూర్తి, ఎ. సురేష్ బాబు, వెంకటనారాయణ, యాదగిరి, దామోదర్, సింగారపు దీపక్ తదితరులు పాల్గొన్నారు. పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు పాయం శోభారాణి, పీడీ మామిండ్ల సోమ్మల్లు, ఉపాధ్యాయులు, విద్యార్థులు హాజరయ్యారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.

