కమలాపూర్‌లో కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్ ఆకస్మిక తనిఖీ
* ఆసుపత్రిలో మెరుగైన వైద్యం
* గురుకులంలో నాణ్యమైన భోజనం అందించాలని ఆదేశాలు
Kamalapur| ఆకేరు న్యూస్, కమలాపూర్: హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్ శుక్రవారం కమలాపూర్ మండలంలో విస్తృతంగా పర్యటించి పలు ప్రభుత్వ సంస్థలు, సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. కమలాపూర్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, గూడూరులోని మహాత్మా జ్యోతిబాపూలే బాలికల గురుకుల పాఠశాల, జూనియర్ కళాశాలతో పాటు గూనిపర్తి గ్రామంలో ఇందిరమ్మ ఇంటి నిర్మాణ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారులకు పలు సూచనలు, ఆదేశాలు జారీ చేశారు.
రోగులకు మెరుగైన వైద్యం అందించాలి
కమలాపూర్ మండల కేంద్రంలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్ (సీహెచ్‌సీ), ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. రోజువారీ ఓపీ సేవల నమోదు, వైద్యులు, సిబ్బంది హాజరు రిజిస్టర్లను పరిశీలించారు. పురుషులు, మహిళల వార్డులు, టీకాల గది, మెడికల్ రికార్డుల విభాగం, మందుల నిల్వలను తనిఖీ చేశారు. ఆసుపత్రికి వచ్చే రోగులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన అన్ని వైద్య సదుపాయాలు అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. మందుల నిర్వహణలో నిర్లక్ష్యం వహించకూడదని, ప్రభుత్వ వైద్య సేవలపై ప్రజల్లో నమ్మకం పెరిగేలా వైద్యులు, సిబ్బంది బాధ్యతాయుతంగా విధులు నిర్వహించాలని సూచించారు.
గురుకులంలో నాణ్యమైన భోజనం
అనంతరం గూడూరులోని మహాత్మా జ్యోతిబాపూలే బాలికల గురుకుల పాఠశాల, జూనియర్ కళాశాలను కలెక్టర్ సందర్శించారు. విద్యార్థినులకు అందించే భోజనాన్ని పరిశీలించి వంటకాలు, బియ్యం, కూరగాయల నాణ్యతను తనిఖీ చేశారు. ప్రభుత్వం నిర్ణయించిన మెనూ ప్రకారం నాణ్యమైన ఆహారం అందించాలని సూచించారు. డార్మెటరీ గదులు, మరుగుదొడ్లు, గ్రంథాలయంలోని పుస్తకాల వివరాలను ప్రిన్సిపల్‌ను అడిగి తెలుసుకున్నారు. హాస్టల్ పరిసరాల్లో పరిశుభ్రత పాటించాలని, దోమల నివారణకు కిటికీలకు మెష్‌లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు.
ఇందిరమ్మ ఇంటి నిర్మాణంపై కలెక్టర్ ప్రశంసలు
గూనిపర్తి గ్రామంలో లబ్ధిదారు ముదిగొండ ధనలక్ష్మి నిర్మించుకున్న ఇందిరమ్మ ఇంటిని కలెక్టర్ పరిశీలించారు. ఆమె గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొని ఇంటి నిర్మాణ నాణ్యతను పరిశీలించారు. ఇంటి ఆవరణలో ఏర్పాటు చేసిన ఇంకుడు గుంత, మరుగుదొడ్డి నిర్మాణాన్ని పరిశీలించి లబ్ధిదారు కుటుంబాన్ని అభినందించారు. మిగతా లబ్ధిదారులు కూడా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేసుకోవాలని సూచించారు. గుడిసెల్లో నివసిస్తున్న నిరుపేదలకు రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల మంజూరులో ప్రాధాన్యత కల్పిస్తామని ఈ సందర్భంగా తెలిపారు.
అదే గ్రామంలో కొనసాగుతున్న భూ రీసర్వే పనుల పురోగతిని అధికారులను అడిగి తెలుసుకున్నారు. నూతనంగా నిర్మిస్తున్న గ్రామ పంచాయతీ భవన పనులను వేగవంతం చేసి త్వరగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
ఈ పర్యటనలో స్థానిక సర్పంచ్ రాధిక, తహసీల్దార్ సురేష్ కుమార్, మండల స్థాయి అధికారులు, ఆసుపత్రి వైద్యులు, సిబ్బంది, గురుకుల పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.

