ఆగ్రా, కాన్పూర్, లక్నో మీదుగా హైస్పీడ్ రైలు
* యూపీలో బుల్లెట్ ట్రైన్ కారిడార్‌కు కేంద్రం ఆమోదం
* ఆగ్రా, కాన్పూర్, లక్నో మీదుగా హైస్పీడ్ రైలు
Delhi Varanasi Bullet Train| ఆకేరు న్యూస్, డెస్క్: దేశంలో హైస్పీడ్ రైలు నెట్వర్క్ విస్తరణకు కేంద్ర ప్రభుత్వం కీలక అడుగు వేసింది. దేశ రాజధాని ఢిల్లీ నుంచి ఉత్తరప్రదేశ్‌లోని ప్రధాన నగరాల మీదుగా వారణాసి వరకు బుల్లెట్ ట్రైన్ కారిడార్ ఏర్పాటు చేసే ప్రతిపాదన తెరపైకి వచ్చింది. ఈ ప్రాజెక్టుకు ప్రధాని నరేంద్ర మోదీ ఆమోదం తెలిపినట్లు రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. ఈ కారిడార్ అందుబాటులోకి వస్తే ఢిల్లీ నుంచి వారణాసికి కేవలం 3 గంటల 33 నిమిషాల్లో చేరుకోవచ్చని అంచనా.
తగ్గనున్న ప్రయాణ సమయం
ప్రతిపాదిత హైస్పీడ్ రైలు కారిడార్ ద్వారా ఉత్తర భారతదేశంలోని ప్రధాన నగరాల మధ్య ప్రయాణ సమయం గణనీయంగా తగ్గనుంది. రైల్వే మంత్రి వెల్లడించిన అంచనాల ప్రకారం ప్రయాణ సమయాలు ఇలా ఉన్నాయి.
ఢిల్లీ – ఆగ్రా: 59 నిమిషాలు
ఢిల్లీ – కాన్పూర్: 1 గంట 45 నిమిషాలు
ఢిల్లీ – లక్నో: 2 గంటల 12 నిమిషాలు
లక్నో – వారణాసి: 1 గంట 21 నిమిషాలు
వారణాసి – పాట్నా: 1 గంట
ఢిల్లీ – వారణాసి: 3 గంటల 33 నిమిషాలు
వారణాసి – ప్రయాగ్‌రాజ్: 33 నిమిషాలు
విమానాలకు పోటీగా..
బుల్లెట్ ట్రైన్ అందుబాటులోకి వస్తే విమాన ప్రయాణానికి వేగవంతమైన ప్రత్యామ్నాయం ఏర్పడే అవకాశం ఉంది. విమానాశ్రయానికి చేరుకోవడం, చెక్-ఇన్, భద్రతా తనిఖీలకు పట్టే సమయాన్ని పరిగణనలోకి తీసుకుంటే హైస్పీడ్ రైలు ప్రయాణికులకు మరింత సౌకర్యవంతంగా మారవచ్చు. మధ్యతరగతి ప్రజలకు సైతం అందుబాటులో ఉండేలా టికెట్ ధరలను నిర్ణయించాలన్నది ప్రభుత్వ ఆలోచనగా మంత్రి పేర్కొన్నారు. అయితే ఛార్జీలపై ఇంకా అధికారిక ప్రకటన వెలువడలేదు.
పర్యాటక రంగానికి ఊతం
ఈ కారిడార్ ద్వారా ఆగ్రా, కాన్పూర్, లక్నో, అయోధ్య, వారణాసి వంటి ప్రాంతాలకు మెరుగైన రవాణా సదుపాయం కలగనుంది. ముఖ్యంగా వారణాసి, అయోధ్య వంటి ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రాలకు వెళ్లే ప్రయాణికులకు ప్రయోజనం చేకూరనుంది. వేగవంతమైన రవాణా సదుపాయంతో వ్యాపారం, విద్య, వైద్యం, పర్యాటక రంగాలు అభివృద్ధి చెందే అవకాశం ఉంది.
ఇంకా ఖరారు కాని పనుల షెడ్యూల్
2026-27 కేంద్ర బడ్జెట్లో ప్రకటించిన ఏడు కొత్త హైస్పీడ్ రైలు కారిడార్లలో ఢిల్లీ–వారణాసి మార్గం కూడా ఒకటి. అయితే ప్రాజెక్టుకు సంబంధించిన పూర్తి మంజూరు, నిర్మాణ వ్యయం, స్టేషన్ల వివరాలు, పనుల ప్రారంభ తేదీ ఇంకా ఖరారు కావాల్సి ఉంది. వివరణాత్మక ప్రాజెక్టు నివేదిక (DPR), సాంకేతిక, ఆర్థిక సాధ్యాసాధ్యాల పరిశీలన అనంతరం తదుపరి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ప్రస్తుతం వెల్లడైన ప్రయాణ సమయాలు ప్రతిపాదిత ప్రాజెక్టు అంచనాలు మాత్రమే. బుల్లెట్ ట్రైన్ పట్టాలెక్కేందుకు మరికొంత సమయం పట్టనుంది.

Please tell us what is wrong. Your report will be sent to the website team.

