‘ఓ నా సిద్ధయ్య’ ప్రైవేట్ ఆల్బమ్ సాంగ్
* సోనూసూద్, ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ చేతుల మీదుగా లాంచ్
O Na Siddhayya| ఆకేరు న్యూస్, హైదరాబాద్: భారతీయ సినీ చరిత్రలో సరికొత్త ప్రయత్నంగా ఓ నా సిద్ధయ్య ప్రైవేట్ ఆల్బమ్ సాంగ్ గ్రాండ్‌గా విడుదలైంది. హైదరాబాద్‌లోని శంషాబాద్ ప్రభుత్వ కళాశాల, పాఠశాల మైదానంలో అక్టోబర్ 30న నిర్వహించిన ఈ వేడుకలో ప్రముఖ నటుడు సోనూసూద్, రాజేంద్రనగర్ ఎమ్మెల్యే టి. ప్రకాష్ గౌడ్ ముఖ్య అతిథులుగా పాల్గొని పాటను లాంచ్ చేశారు. ఈ కార్యక్రమానికి 5 వేల మందికి పైగా ప్రేక్షకులు హాజరయ్యారు. భారీ వర్షం కురుస్తున్నప్పటికీ అభిమానులు పెద్ద సంఖ్యలో తరలిరావడం విశేషం.
అవుట్‌డోర్‌లో 70ఎంఎం స్క్రీన్
సాధారణంగా సినిమా థియేటర్లలో మాత్రమే అనుభూతి చెందే భారీ తెర, అత్యాధునిక సౌండ్ అనుభవాన్ని ప్రేక్షకులకు అందించాలనే ఉద్దేశంతో ‘ఓ నా సిద్ధయ్య’ టీమ్ వినూత్న ఏర్పాట్లు చేసింది. అవుట్డోర్ వేదికపై 70ఎంఎం భారీ స్క్రీన్‌తో పాటు డాల్బీ అట్మాస్ సౌండ్ సిస్టమ్‌ను ఏర్పాటు చేసి పాటను ప్రదర్శించారు. భారతదేశంలోనే తొలిసారిగా ఈ తరహా ప్రయోగం చేసినట్లు నిర్వాహకులు తెలిపారు.
ఈ సందర్భంగా సోనూసూద్ మాట్లాడుతూ.. బహిరంగ ప్రదేశంలో 70ఎంఎం భారీ స్క్రీన్‌పై పాటను విడుదల చేయడం సంతోషంగా ఉందన్నారు. ఇలాంటి వినూత్న ప్రయత్నానికి శ్రీకారం చుట్టిన ‘ఓ నా సిద్ధయ్య’ టీమ్‌ను అభినందించారు. ఈ పాట మంచి విజయాన్ని సాధించాలని ఆకాంక్షించారు.
ఎమ్మెల్యే టి. ప్రకాష్ గౌడ్ మాట్లాడుతూ.. ఈ కార్యక్రమంలో పాల్గొనడం ఆనందంగా ఉందన్నారు. ‘ఓ నా సిద్ధయ్య’ పాట ప్రేక్షకుల ఆదరణ పొందాలని, టీమ్‌కు మంచి గుర్తింపు రావాలని ఆకాంక్షించారు.
ఈ వేడుకలో హీరో ఇంద్రరామ్, గాయకుడు నల్గొండ గద్దర్ నరసన్న, సింగర్, మ్యూజిక్ డైరెక్టర్ బోలే షావలి, నటుడు ఉత్తేజ్‌తో పాటు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు పాల్గొన్నారు.
దాంపత్య ప్రేమకు ప్రతిరూపం
భార్యాభర్తల మధ్య ప్రేమ, అనుబంధం, పరస్పర నమ్మకం, జీవితాంతం ఒకరికొకరు తోడుగా నిలిచే భావనలతో ‘ఓ నా సిద్ధయ్య’ పాటను రూపొందించారు. పల్లెటూరి నేపథ్యంలో సిద్ధయ్య, చిట్టెమ్మ పాత్రల ద్వారా దాంపత్య జీవితంలోని సహజమైన భావోద్వేగాలను ఆవిష్కరించారు.
సిద్ధయ్య పాత్రలో నటించడంతో పాటు ఈ పాటను నిర్మించిన సిద్ధు రెడ్డి కందకట్ల తన నిజజీవిత అనుభవాల స్ఫూర్తితో ఈ ఆల్బమ్‌ను రూపొందించారు. జీవితంలో ఎదురయ్యే కష్టసుఖాలను భార్యాభర్తలు కలిసి ఎదుర్కోవడం, ఒకరిపై మరొకరు నమ్మకంతో ముందుకు సాగడం వంటి అంశాలను పాటలో చూపించారు. కుటుంబ బంధాలతో పాటు సమాజ సేవ, ఇతరులకు సహాయం చేయాలనే సందేశాన్ని కూడా ఇందులో పొందుపరిచారు.
సామాజిక సేవకు ప్రాధాన్యం
పాట విడుదల కార్యక్రమంతో పాటు సామాజిక సేవా కార్యక్రమాలకూ సిద్ధు రెడ్డి ప్రాధాన్యం ఇస్తున్నారు. గతంలో 300 మంది ఆటో డ్రైవర్లకు బీమా సదుపాయాలు కల్పించినట్లు నిర్వాహకులు తెలిపారు. సినీ పరిశ్రమలో తెరవెనుక పనిచేసే కార్మికుల భద్రతను దృష్టిలో ఉంచుకుని హెల్మెట్లను కూడా పంపిణీ చేశారు. రోడ్డు భద్రత, ఉపాధి అవకాశాలు, ఆర్థిక సహాయం ద్వారా అవసరంలో ఉన్నవారికి అండగా నిలవడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.

