పర్ణశాల నిర్మాత మంచి వెంకట్
Manchi Venkat| ఆకేరు న్యూస్, డెస్క్: విడుదలకు సిద్ధమవుతున్న పర్ణశాల సినిమాలోని జిమ్ జిమ్ తార పాట ఇప్పుడు టాలీవుడ్లో చర్చనీయాంశంగా మారింది. వెంకటేష్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ఆదర్శ కుటుంబం సినిమాలో ఈ పాటను ఉపయోగించడంపై పర్ణశాల నిర్మాత మంచి వెంకట్ అభ్యంతరం వ్యక్తం చేశారు. తమ సినిమా విడుదలకు ముందే పాటను మరో చిత్రంలో వినియోగించడం చిన్న సినిమాకు నష్టం కలిగిస్తుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
అనుమతి లేకుండా?
మీడియాతో మాట్లాడిన నిర్మాత మంచి వెంకట్.. ఆదిత్య మ్యూజిక్ ద్వారా అధికారికంగా విడుదల చేసిన తమ సినిమా పాటను ఎలాంటి అనుమతి లేకుండా మరో చిత్రంలో ఉపయోగించారని ఆరోపించారు. తమ సినిమా విడుదల కాకముందే పాటను మరో సినిమాలో చూపించడం వల్ల పర్ణశాల చిత్రానికి నష్టం వాటిల్లే అవకాశం ఉందని పేర్కొన్నారు. చిన్న సినిమాలను ప్రోత్సహించాలని, వాటి మనుగడకు ఇబ్బందులు కలిగించకూడదని కోరారు.
వినూత్న ప్రచారం
ఎస్ఎల్టీ ఫిలిమ్స్ బ్యానర్‌పై మంచి వెంకట్ నిర్మిస్తున్న పర్ణశాల చిత్రానికి వై.జి. భరత్ దర్శకత్వం వహిస్తున్నారు. హారర్ కామెడీ, సస్పెన్స్ థ్రిల్లర్ అంశాలతో ఈ సినిమాను రూపొందిస్తున్నారు. ప్రమోషన్లలో భాగంగా జిమ్ జిమ్ తార పాటను లక్ష్మీదేవితో పాడించి చిత్ర బృందం వినూత్నంగా ప్రచారం చేపట్టింది. ఆదిత్య మ్యూజిక్ ద్వారా విడుదలైన ఈ పాట ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తోంది.
టాలీవుడ్లో చర్చ
వినూత్న ప్రచారంతో ఇప్పటికే ఆసక్తి రేకెత్తిస్తున్న పర్ణశాల సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే జిమ్ జిమ్ తార పాటను ఆదర్శ కుటుంబంలో ఉపయోగించడంపై నిర్మాత వ్యక్తం చేసిన అభ్యంతరాలు ఇప్పుడు సినీ వర్గాల్లో చర్చకు దారితీశాయి.

Please tell us what is wrong. Your report will be sent to the website team.

