ఓరి నాయనో సినిమా చిత్రీకరణ కార్యక్రమం
Ori Nayano| ఆకేరు న్యూస్, సినిమా: వినోదాత్మక కథాంశంతో ప్రేక్షకులను అలరించేందుకు ఓరి నాయనో చిత్రం సిద్ధమవుతోంది. వీరాంజనేయ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఎస్. సాయి అభిషేక్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి మణి తేజ గొంది దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా హైదరాబాద్‌లో ఈ సినిమా చిత్రీకరణ కార్యక్రమం ఘనంగా ప్రారంభమైంది.
ప్రముఖుల చేతుల మీదుగా..
ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ప్రముఖ నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ వంశీ నందిపాటి హాజరై ముహూర్తపు షాట్‌కు తొలి క్లాప్ కొట్టారు. ‘పొలిమేర’ ఫ్రాంచైజీ చిత్రాలతో గుర్తింపు పొందిన దర్శకుడు డా. అనిల్ విశ్వనాథ్ తొలి సన్నివేశానికి దర్శకత్వం వహించారు. దీంతో చిత్ర బృందం కొత్త ప్రయాణాన్ని ప్రారంభించింది.
25 రోజుల్లో షూటింగ్ పూర్తి
ఈ సందర్భంగా నిర్మాత ఎస్. సాయి అభిషేక్ మాట్లాడుతూ.. సినిమా నాణ్యత విషయంలో ఎక్కడా రాజీ పడకుండా, మంచి కంటెంట్‌తో పాటు అత్యుత్తమ నిర్మాణ విలువలతో చిత్రాన్ని రూపొందిస్తున్నట్లు తెలిపారు. కేవలం 25 రోజుల్లో చిత్రీకరణ పూర్తి చేసేలా ప్రణాళిక సిద్ధం చేసినట్లు వెల్లడించారు. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు పేర్కొన్నారు.
చిత్ర బృందానికి అభినందనలు
దర్శకుడు డా. అనిల్ విశ్వనాథ్ తన మిత్రుడు, నిర్మాత సాయి అభిషేక్ చేపట్టిన ఈ నూతన ప్రయత్నాన్ని అభినందించారు. చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలియజేస్తూ, సినిమా విజయవంతం కావాలని ఆకాంక్షించారు. తన వంతు సహాయ సహకారాలు ఎల్లప్పుడూ అందిస్తానని భరోసా ఇచ్చారు. వినోదాత్మక చిత్రంగా తెరకెక్కుతున్న ‘ఓరి నాయనో’ ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుంటుందో చూడాలి.

Please tell us what is wrong. Your report will be sent to the website team.

