ఇళ్లలోకి చేరిన మురుగు నీరు
* అరగంట వర్షానికే ఇళ్లలోకి వరద నీరు..
* ఇళ్లలోకి చేరిన మురుగు నీరు
Hanamkonda Rain| ఆకేరు న్యూస్, హన్మకొండ: హనుమకొండ నగరంలో కురిసిన భారీ వర్షం స్థానిక ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేసింది. ముఖ్యంగా గోకుల్ నగర్, పాత బస్టాండ్ సమీపంలోని తిరుమల బార్ ప్రాంతాల్లో కేవలం అరగంట పాటు కురిసిన వర్షానికే పరిస్థితి ఆందోళనకరంగా మారింది. అల్ప వ్యవధిలోనే కురిసిన వర్షానికి రహదారులపై భారీగా నీరు నిలిచిపోయింది. మరోవైపు సరైన డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడంతో వర్షపు నీరు నేరుగా స్థానికుల ఇళ్లలోకి చేరింది. దీంతో ఇళ్లలోని వస్తువులు తడిసిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
ప్రతిసారీ వర్షం కురిసినప్పుడు ఇదే పరిస్థితి ఎదురవుతోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చిన్నపాటి వర్షానికే ఇళ్లలోకి నీరు చేరుతుంటే, భారీ వర్షాలు కురిసినప్పుడు తమ పరిస్థితి ఏమిటని ప్రశ్నిస్తున్నారు. డ్రైనేజీ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపడంలో అధికారులు చొరవ తీసుకోవాలని కోరుతున్నారు. ఇప్పటికైనా సంబంధిత మున్సిపల్ అధికారులు స్పందించి ఆయా ప్రాంతాల్లో డ్రైనేజీ వ్యవస్థను క్షేత్రస్థాయిలో పరిశీలించాలని స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు. వర్షపు నీరు రహదారులపై, ఇళ్లలోకి చేరకుండా అవసరమైన చర్యలు చేపట్టాలని కోరుతున్నారు. ప్రజాప్రతినిధులు సైతం వెంటనే ఆయా ప్రాంతాలను సందర్శించి సమస్య తీవ్రతను పరిశీలించి, శాశ్వత పరిష్కారం చూపించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.

