రోడ్డు పనులు పూర్తి చేయాలంటూ గ్రామస్తులు చేపట్టిన ఆందోళన
* దీక్షకు సిద్ధమైన మాజీ జెడ్పీటీసీ అరెస్ట్
* గ్రామస్తుల ఆందోళనతో దిగొచ్చిన కాంట్రాక్టర్
* నవంబర్ 15లోగా రోడ్డు నిర్మాణం పూర్తి చేస్తామని హామీ
Kamalapur Pangidipalli Road| ఆకేరు న్యూస్, కమలాపూర్: హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలంలోని కమలాపూర్–పంగిడిపల్లి రోడ్డు నిర్మాణ సమస్య ఎట్టకేలకు ఓ కొలిక్కి వచ్చింది. ఏళ్ల తరబడి అసంపూర్తిగా ఉన్న రోడ్డు పనులు పూర్తి చేయాలంటూ గ్రామస్తులు చేపట్టిన ఆందోళన ఆదివారం ఉద్రిక్తతకు దారితీసింది. ఆమరణ నిరాహార దీక్షకు సిద్ధమైన పంగిడిపల్లి గ్రామానికి చెందిన మాజీ జెడ్పీటీసీ సభ్యుడు వలిగె సాంబారావును పోలీసులు ముందస్తుగా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
రోడ్డు నిర్మాణం పూర్తి చేయాలని పలుమార్లు అధికారులకు వినతులు సమర్పించినా, గతంలో రాస్తారోకోలు నిర్వహించినా సమస్య పరిష్కారం కాకపోవడంతో సాంబారావు ఆమరణ నిరాహార దీక్షకు పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో పోలీసులు ఆయనను ఉదయమే అదుపులోకి తీసుకున్నారు.
అంబేద్కర్ కూడలి వద్ద రాస్తారోకో
సాంబారావు అరెస్ట్‌ను నిరసిస్తూ కమలాపూర్ ప్రజలు, పంగిడిపల్లి సర్పంచ్ కళ్యాణి, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో కమలాపూర్‌లోని అంబేద్కర్ కూడలి వద్దకు చేరుకున్నారు. హుజూరాబాద్–పరకాల ప్రధాన రహదారిపై ధర్నా, రాస్తారోకో నిర్వహించారు. దీంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో కమలాపూర్ పోలీస్ ఇన్స్పెక్టర్ నవీన్ పోలీసు సిబ్బందితో అక్కడికి చేరుకుని ఆందోళనకారులతో మాట్లాడారు.
నవంబర్ 15లోగా పనులు పూర్తి చేస్తామని హామీ
ఈ క్రమంలో రోడ్డు కాంట్రాక్టర్ మీడియా సమక్షంలో స్పందిస్తూ.. నవంబర్ 15వ తేదీలోగా రోడ్డు నిర్మాణ పనులు పూర్తి చేసి డాంబర్ రోడ్డును అందుబాటులోకి తీసుకొస్తామని హామీ ఇచ్చారు. ఇచ్చిన గడువులోగా పనులు పూర్తి చేయకపోతే మరోసారి ఆందోళన చేపడతామని గ్రామస్తులు స్పష్టం చేశారు. కాంట్రాక్టర్ హామీతో తాత్కాలికంగా నిరసనను విరమించారు.
సమస్య పరిష్కారానికి చొరవ చూపిన పోలీసులు, అధికారులకు స్థానికులు కృతజ్ఞతలు తెలిపారు. అయితే కాంట్రాక్టర్ ఇచ్చిన హామీ మేరకు నవంబర్ 15లోగా రోడ్డు నిర్మాణం పూర్తవుతుందా? అన్నది ఇప్పుడు స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.

Please tell us what is wrong. Your report will be sent to the website team.

