Collector Chahat Bajpai | Warangal
* 3–5 రోజుల్లోనే మంజూరు
* హనుమకొండలో IGMS పోర్టల్ ప్రారంభం
Gravel Mining Permissions| ఆకేరు న్యూస్, హనుమకొండ: గ్రావెల్ (మట్టి) తవ్వకాలకు అనుమతులు పొందాలనుకునే వారికి హనుమకొండ జిల్లా యంత్రాంగం శుభవార్త అందించింది. ఇకపై అనుమతుల కోసం ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. ఇంటి వద్ద నుంచే మొబైల్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునే సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. అక్రమ మైనింగ్‌ను అరికట్టడంతో పాటు అనుమతుల ప్రక్రియను వేగవంతం చేసేందుకు ఇంటిగ్రేటెడ్ గ్రావెల్ మేనేజ్మెంట్ సిస్టం (IGMS) పోర్టల్‌ను ప్రారంభించింది. ఈ పోర్టల్ ద్వారా వచ్చిన దరఖాస్తులను పరిశీలించి మూడు నుంచి ఐదు రోజుల్లో అనుమతులు మంజూరు చేయనున్నట్లు జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్‌పాయి వెల్లడించారు.
కలెక్టర్ చేతుల మీదుగా ప్రారంభం
సోమవారం హనుమకొండ జిల్లా కలెక్టరేట్లో నిర్వహించిన కార్యక్రమంలో కలెక్టర్ చాహత్ బాజ్‌పాయి IGMS పోర్టల్‌ను ప్రారంభించారు. సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ (CGG) సహకారంతో ఈ వ్యవస్థను రూపొందించినట్లు తెలిపారు. మొబైల్ నంబర్ నమోదు చేసి, ఓటీపీ ద్వారా లాగిన్ అయిన అనంతరం గ్రావెల్ తవ్వకాల అనుమతుల కోసం దరఖాస్తు చేసుకోవచ్చని వివరించారు.
దరఖాస్తుకు ఏ పత్రాలు కావాలి?
గ్రావెల్ ఎక్కడి నుంచి తీసుకోవాలనుకుంటున్నారనే వివరాలతో పాటు అవసరమైన పత్రాలను ఆన్లైన్లో సమర్పించాలి. సొంత పట్టా భూమి నుంచి గ్రావెల్ తీసుకోవాలనుకునేవారు పట్టాదారు పాస్‌బుక్ కాపీని అప్లోడ్ చేయాలి. ఇతరుల భూమి నుంచి తవ్వాలనుకుంటే భూయజమాని సమ్మతి పత్రం జత చేయాలి. ప్రభుత్వ భూములకు సంబంధించి సర్వే నంబర్, జియో కోఆర్డినేట్స్ వివరాలను నమోదు చేయాల్సి ఉంటుంది.
3 నుంచి 5 రోజుల్లో అనుమతులు
పోర్టల్‌లో దరఖాస్తు చేసిన వెంటనే సంబంధిత అధికారులకు సమాచారం చేరుతుంది. రెవెన్యూ అధికారులు దరఖాస్తులను పరిశీలించి మూడు నుంచి ఐదు రోజుల్లో పరిష్కరించేలా ఏర్పాట్లు చేశారు. అవసరాన్ని బట్టి మట్టి తవ్వకాల దరఖాస్తులను నీటిపారుదల శాఖకు కూడా పంపిస్తారు. ఆ శాఖ అధికారులు రెండు రోజుల్లో పరిశీలించి నివేదిక అందిస్తారు. రెవెన్యూ శాఖ నుంచి నిరభ్యంతర పత్రం (NOC) వచ్చిన తర్వాత గ్రావెల్ పరిమాణాన్ని బట్టి మైనింగ్ శాఖ అధికారులు క్షేత్రస్థాయి పరిశీలన చేపడతారు.
అనుమతి ఉంటేనే QR కోడ్
అనుమతి మంజూరైన తర్వాత దరఖాస్తుదారుడికి ప్రత్యేక QR కోడ్ జనరేట్ అవుతుంది. ఇందులో ఎంత పరిమాణంలో గ్రావెల్ తరలించవచ్చు? ఎక్కడి నుంచి తీసుకెళ్లాలి? ఏ ప్రాంతానికి తరలించాలి? ఏ సమయంలో రవాణా చేయాలి? అనే వివరాలు ఉంటాయి. గ్రావెల్ తరలించే ట్రాక్టర్లు, ఇతర వాహనాల నంబర్లను కూడా నమోదు చేస్తారు. అనుమతి పొందిన వాహనాల ద్వారానే రవాణా చేయాల్సి ఉంటుంది. దీంతో అక్రమ తవ్వకాలు, అనధికార రవాణాకు అడ్డుకట్ట పడుతుందని అధికారులు భావిస్తున్నారు.
గ్రామ పంచాయతీలకు ఆదాయం
గ్రావెల్ అనుమతుల ప్రక్రియలో గ్రామ పంచాయతీలకూ బాధ్యతలు అప్పగించనున్నారు. అనుమతించిన ట్రిప్పులు, వాస్తవంగా తరలించిన ట్రిప్పుల సంఖ్యను పంచాయతీ సిబ్బంది పర్యవేక్షించాల్సి ఉంటుంది. ఈ పోర్టల్ వినియోగంపై రెవెన్యూ అధికారులు, పంచాయతీ కార్యదర్శులకు ఇప్పటికే శిక్షణ ఇచ్చారు. గ్రావెల్ అనుమతుల ద్వారా వచ్చే ఆదాయంలో కొంత మొత్తాన్ని గ్రామ పంచాయతీలకు అందించేలా నిర్ణయం తీసుకున్నట్లు కలెక్టర్ తెలిపారు.
ఇసుకకు ఈ పోర్టల్ వర్తించదు
కొత్తగా ప్రారంభించిన IGMS పోర్టల్ కేవలం గ్రావెల్ తవ్వకాల అనుమతుల కోసమేనని కలెక్టర్ స్పష్టం చేశారు. ఇసుక అనుమతులకు ఇది వర్తించదు. రాష్ట్రంలో ఇసుక కోసం ఇప్పటికే ప్రత్యేక పోర్టల్ అందుబాటులో ఉందని తెలిపారు. గ్రామాల్లో రోడ్ల నిర్మాణం, ఇతర చిన్న పనులకు అవసరమైన గ్రావెల్ అనుమతులు సులభంగా పొందేందుకు ఈ కొత్త విధానం ఉపయోగపడుతుందని వివరించారు.
ప్రజలకు అవగాహన కల్పించాలి
గ్రావెల్ అవసరమైన ప్రజలు ఆన్లైన్ పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకునేలా విస్తృతంగా అవగాహన కల్పించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ ఎన్. రవి, స్థానిక సంస్థల ఇన్‌ఛార్జి అదనపు కలెక్టర్ శేషాద్రి, డీఆర్వో శ్రీనివాస్, మైనింగ్ శాఖ ఏడీ రామాచారి, సీజీజీ ప్రాజెక్ట్ డైరెక్టర్ రాధాకృష్ణ తదితర అధికారులు పాల్గొన్నారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.

