జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) సీహెచ్. మహేందర్
* ఫార్మర్ రిజిస్ట్రీ నమోదుపై విస్తృత అవగాహన కల్పించాలి
* రైతులకు వ్యవసాయ శాఖ అధికారుల సూచనలు
Mulugu| ఆకేరు న్యూస్, ములుగు: జిల్లాలోని ప్రతి రైతు ఫార్మర్ రిజిస్ట్రీలో నమోదు చేసుకొని ఫార్మర్ ఐడీ పొందాలని జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) సీహెచ్. మహేందర్ జి సూచించారు. ఇంకా ఫార్మర్ రిజిస్ట్రీలో నమోదు చేసుకోని రైతులను గుర్తించి, వారికి అవగాహన కల్పించి నమోదు ప్రక్రియను త్వరగా పూర్తి చేయించాలని వ్యవసాయ, అనుబంధ శాఖల అధికారులను ఆదేశించారు.
సోమవారం జిల్లా సమీకృత కలెక్టరేట్ కార్యాలయ సమావేశ మందిరంలో అగ్రిస్టాక్–ఫార్మర్ రిజిస్ట్రీ నమోదు, జిల్లా టాస్క్‌ఫోర్స్ కమిటీ ఏర్పాటుపై అదనపు కలెక్టర్ (రెవెన్యూ) మహేందర్ జి, అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) ఎం. సంపత్ రావుతో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా మహేందర్ జి మాట్లాడుతూ.. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఫార్మర్ రిజిస్ట్రీ నమోదు ప్రక్రియ పర్యవేక్షణకు జిల్లా టాస్క్‌ఫోర్స్ కమిటీని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ కమిటీకి జిల్లా కలెక్టర్ చైర్మన్‌గా, జిల్లా వ్యవసాయ అధికారి కన్వీనర్‌గా, వ్యవసాయ అనుబంధ శాఖల అధికారులు సభ్యులుగా వ్యవహరిస్తారని వివరించారు. జిల్లాలోని ప్రతి రైతుకు ఫార్మర్ ఐడీ అందేలా కమిటీ సభ్యులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.
ఫార్మర్ ఐడీ ద్వారా వివిధ ప్రభుత్వ శాఖల వ్యవసాయ సేవలు, పథకాలు పొందేందుకు కలిగే ప్రయోజనాలపై రైతులకు విస్తృతంగా అవగాహన కల్పించాలని తెలిపారు. గ్రామస్థాయిలో ఇప్పటివరకు నమోదు చేసుకోని రైతులను గుర్తించి, వారికి అవసరమైన సహకారం అందించాలని అధికారులకు సూచించారు.
రైతులు తమ సమీపంలోని వ్యవసాయ విస్తరణ అధికారిని సంప్రదించడం ద్వారా లేదా మీసేవ కేంద్రం, కామన్ సర్వీస్ సెంటర్ (CSC)లను సందర్శించి ఫార్మర్ రిజిస్ట్రీలో నమోదు చేసుకోవచ్చని తెలిపారు.
ఈ సమావేశంలో జిల్లా వ్యవసాయ అధికారి సురేష్ కుమార్, వ్యవసాయ అనుబంధ శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.

