మేడారంలో పోస్టర్ ఆవిష్కరణ
* లక్ష విల్లంబులతో ఆదివాసీల భారీ ప్రదర్శన
* మేడారంలో పోస్టర్ ఆవిష్కరణ
ఆకేరు న్యూస్, ములుగు: ఆదివాసీల హక్కుల సాధన కోసం డిసెంబర్ 9న హైదరాబాద్లో లక్ష విల్లంబులతో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నట్లు ఆదివాసి పోరాట సమితి తుడుం దెబ్బ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ మహిపతి అరుణ్ కుమార్ తెలిపారు. ఈ మేరకు మేడారం సమ్మక్క–సారలమ్మ వనదేవతల ఆలయ ప్రాంగణంలో ఆదివారం సభకు సంబంధించిన పోస్టర్ను ఆవిష్కరించారు.
ఆదివాసి పోరాట సమితి తుడుం దెబ్బ జాతీయ, రాష్ట్ర, జిల్లా కమిటీలతో పాటు తాడ్వాయి మండల, మేడారం గ్రామ కమిటీల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. తొలుత ఆదివాసీ సంప్రదాయ పద్ధతిలో డోలి వాయిద్యాలతో పూజలు నిర్వహించారు. పూజారుల సంఘం అధ్యక్షుడు సిద్ధబోయిన జగ్గారావు, సమ్మక్క పూజారుల ఆధ్వర్యంలో అమ్మవార్ల గద్దెలపై పసుపు, కుంకుమలతో కరపత్రాలను ఉంచి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఉద్యమ నేతలకు పూజారులు బొట్టు పెట్టి ఆశీర్వదించారు. రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ అరుణ్ కుమార్కు వీరతిలకం దిద్దారు. అనంతరం సమ్మక్క గేటు ఎదుట సభ పోస్టర్ను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా డాక్టర్ అరుణ్ కుమార్ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 12 సంవత్సరాలు గడిచినా ఆదివాసీల జీవన పరిస్థితుల్లో ఆశించిన మార్పు రాలేదని అన్నారు. ఆదివాసీల హక్కుల సాధన కోసం ఐటీడీఏల ముట్టడి కార్యక్రమాల అనంతరం హైదరాబాద్లో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు.
గత 50 ఏళ్లుగా లంబాడీలు అక్రమంగా ఎస్టీ జాబితాలో కొనసాగుతున్నారని, దీనివల్ల ఆదివాసీలకు విద్య, ఉద్యోగ, ఉపాధి, రాజకీయ రంగాల్లో లభించాల్సిన రిజర్వేషన్ ప్రయోజనాలకు నష్టం జరుగుతోందని ఆయన ఆరోపించారు. ఎస్టీ జాబితా అంశంలో రాజ్యాంగంలోని ఆర్టికల్ 342కు సంబంధించిన సవరణ జరగాలని డిమాండ్ చేశారు. ఆదివాసీలు ఎన్నో ఉద్యమాలు చేస్తున్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం, రాజకీయ పార్టీలు తమ సమస్యలను పట్టించుకోవడం లేదని విమర్శించారు. ఆదివాసీల హక్కుల సాధన కోసం హైదరాబాద్ సభను నిర్వహిస్తున్నామని తెలిపారు.
ఈ బహిరంగ సభను విజయవంతం చేసేందుకు రాష్ట్రంలోని ఆదివాసీ విద్యార్థులు, ఉద్యోగులు, మహిళలు, వివిధ ఆదివాసీ సంఘాల ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొని సహకరించాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో మేడారం సర్పంచ్ పీరీల భారతి, వెంకన్న, తుడుం దెబ్బ జాతీయ ఉపాధ్యక్షుడు పొడెం బాబు, రాష్ట్ర కార్యదర్శులు కుడిమేత సమ్మన్న, కోరగట్ల లక్ష్మణరావు, రాష్ట్ర ఉపాధ్యక్షుడు పులిసే బాలకృష్ణ, రాష్ట్ర ప్రచార కార్యదర్శి రేగ గణేష్, ఏఎస్యూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొర్నిబెల్లి గణేష్, తుడుం దెబ్బ మహిళా సంఘం అధ్యక్షురాలు వట్టం సుభద్ర, ములుగు జిల్లా అధ్యక్షుడు నల్లబోయిన లక్ష్మణరావు, వర్కింగ్ ప్రెసిడెంట్ పూనెం చంటి, విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు దబ్బగట్ల శ్రీకాంత్, తాడ్వాయి మండల అధ్యక్షుడు మోకాళ్ల వెంకటేష్, మేడారం గ్రామ అధ్యక్షుడు గడిగే సునీల్, మేడారం యువజన సంఘం అధ్యక్షుడు ఆలం శంకర్, సారలమ్మ యూత్ అధ్యక్షుడు పాయం నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.

