హైడ్రాలిక్ లిఫ్టర్ వాహనం
* 10 మీటర్లకు పైగా ఎత్తులోనూ మరమ్మతులు..
* విద్యుత్ శాఖ ఆధునిక వాహనం అందుబాటులోకి
Hydraulic Lifter Vehicle| ఆకేరు న్యూస్, ములుగు: జిల్లాలో విద్యుత్ అంతరాయాలను తగ్గించి వినియోగదారులకు నిరంతరాయంగా నాణ్యమైన విద్యుత్ సరఫరా అందించేందుకు విద్యుత్ శాఖ ప్రత్యేక హైడ్రాలిక్ లిఫ్టర్ వాహనాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. 300 కేజీల సామర్థ్యంతో పాటు భూమి నుంచి 10 మీటర్లకు పైగా ఎత్తు వరకు పనిచేసే హైడ్రాలిక్ లిఫ్టర్‌ను 3 ఎంటీ పికప్ వ్యాన్‌కు అమర్చారు.
ఈ వాహనాన్ని జిల్లా సూపరింటెండింగ్ ఇంజనీర్ (ఆపరేషన్) బి. భిక్షపతి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో డీఈటీ ఇన్చార్జి డివిజనల్ ఇంజనీర్ (ఆపరేషన్) కె. రాజు, ఏఈడీఈ ములుగు ఎన్. వేణుగోపాల్, ఏఈ రవి, సబ్ ఇంజనీర్లు, ఓ అండ్ ఎం సిబ్బంది, ములుగు డివిజన్ ఉద్యోగులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా బి. భిక్షపతి మాట్లాడుతూ.. కొత్తగా అందుబాటులోకి వచ్చిన వాహనంతో 33 కేవీ, 11 కేవీ విద్యుత్ లైన్ల బ్రేక్డౌన్లు, ఎఫ్ఓసీ పనులు, విద్యుత్ లైన్లకు అడ్డుగా ఉన్న చెట్ల కొమ్మల తొలగింపు, 10 మీటర్లకు పైగా ఎత్తులో చేపట్టాల్సిన మరమ్మతులను వేగంగా నిర్వహించవచ్చని తెలిపారు.
గతంలో ఎత్తైన ప్రదేశాల్లో విద్యుత్ మరమ్మతులు చేపట్టేందుకు ఎక్కువ సమయం, శ్రమ అవసరమయ్యేవని పేర్కొన్నారు. ప్రస్తుతం హైడ్రాలిక్ లిఫ్టర్ వాహనం అందుబాటులోకి రావడంతో పనులు వేగవంతం కావడమే కాకుండా విద్యుత్ సిబ్బంది భద్రతకు కూడా భరోసా లభిస్తుందని చెప్పారు.
ఈ వాహనం ద్వారా అత్యవసర విద్యుత్ నిర్వహణ పనులకు త్వరితగతిన స్పందించే అవకాశం ఉంటుందని, విద్యుత్ అంతరాయాల వ్యవధి తగ్గి వినియోగదారుల ఫిర్యాదులకు సత్వర పరిష్కారం లభిస్తుందని భిక్షపతి వివరించారు. జిల్లాలో విద్యుత్ సరఫరా వ్యవస్థను మరింత పటిష్టం చేసేందుకు ఈ వాహనం ఉపయోగపడుతుందని తెలిపారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.

