Online LLR Test Telangana
* ఇంటి నుంచే ఎల్ఎల్ఆర్ పరీక్ష
* లెర్నర్ లైసెన్స్ కోసం కొత్త విధానం.. ఏఐతో పరీక్ష
* వారంలో కొత్త సదుపాయం
ఆకేరు న్యూస్, డెస్క్ : డ్రైవింగ్ లెర్నర్ లైసెన్స్ (ఎల్ఎల్ఆర్) పొందాలనుకునే వారికి తెలంగాణ రవాణాశాఖ కొత్త సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చేందుకు సిద్ధమవుతోంది. ఇప్పటివరకు ఆర్టీఓ కార్యాలయానికి వెళ్లి రాయాల్సిన లెర్నర్ లైసెన్స్ పరీక్షను ఇంటి నుంచే రాసే విధానాన్ని ప్రవేశపెట్టేందుకు కసరత్తు చేస్తోంది. ఇందుకోసం సారథి న్యూ లెర్నర్ లైసెన్స్ టెస్ట్ వ్యవస్థతో పాటు కృత్రిమ మేధ (ఏఐ), ఫేషియల్ రికగ్నిషన్ సాంకేతికతను వినియోగించనున్నారు. ప్రస్తుతం ఈ విధానాన్ని పరీక్షిస్తున్న అధికారులు, ప్రయోగాలు విజయవంతమైతే వారంలోగా అందుబాటులోకి తీసుకురావాలని భావిస్తున్నారు.
* ఫేషియల్ రికగ్నిషన్‌తో అభ్యర్థి గుర్తింపు..
కొత్త విధానంలో అభ్యర్థి గుర్తింపును నిర్ధారించేందుకు ముఖ గుర్తింపు సాంకేతికతను ఉపయోగిస్తారు. పరీక్షకు లాగిన్ అయిన వెంటనే వెబ్‌క్యామ్ ద్వారా అభ్యర్థి ముఖాన్ని పరిశీలిస్తారు. దరఖాస్తులోని ఫొటోతో సరిపోలిన తర్వాతే పరీక్షకు అనుమతి లభిస్తుంది. పరీక్ష జరుగుతున్నంతసేపు అభ్యర్థి కెమెరా ముందు ఉండాలి. మధ్యలో వేరే వ్యక్తి కనిపించినా, అభ్యర్థి కెమెరా పరిధి నుంచి తప్పుకున్నా, ఇతర వెబ్సైట్లు తెరిచేందుకు ప్రయత్నించినా సిస్టమ్ హెచ్చరికలు జారీ చేస్తుంది.
* పరీక్ష రాసే విధానం ఇదే..
అభ్యర్థులు తమ అప్లికేషన్ నంబర్, పాస్వర్డ్, పుట్టిన తేదీ వివరాలతో పరీక్ష పోర్టల్‌లోకి లాగిన్ కావాలి. ఇందుకోసం సురక్షితమైన బ్రౌజర్‌ను ఉపయోగించాల్సి ఉంటుంది. పరీక్ష సమయంలో ఇతర వెబ్సైట్లు లేదా అదనపు విండోలను తెరవడానికి అనుమతి ఉండదు. ఏఐ ఆధారిత వ్యవస్థ అభ్యర్థి కదలికలను పర్యవేక్షిస్తూ అక్రమాలకు అవకాశం లేకుండా చూస్తుంది.
* ఫేషియల్ వెరిఫికేషన్ విఫలమైతే ప్రత్యామ్నాయం..
సాంకేతిక కారణాలతో ఫేషియల్ వెరిఫికేషన్ పలుమార్లు విఫలమైతే అభ్యర్థికి ఓటీపీ పంపించే అవకాశం ఉంది. ఆ ఓటీపీని నమోదు చేసిన తర్వాత ఆర్టీఓ కార్యాలయానికి వెళ్లి పరీక్ష రాసేందుకు ప్రత్యామ్నాయ సదుపాయం కల్పించనున్నారు. దీంతో సాంకేతిక సమస్యల కారణంగా అభ్యర్థులు ఇబ్బందులు పడకుండా చూడనున్నారు.
* రంగులతో ప్రశ్నల స్థితి గుర్తింపు..
పరీక్షలో ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చిన తీరును గుర్తించేందుకు రంగుల విధానాన్ని ఉపయోగించనున్నారు. సమాధానం నమోదు చేసిన ప్రశ్నలు ఆకుపచ్చ రంగులో కనిపిస్తాయి. ప్రశ్నను చూసి సమాధానం ఇవ్వకుండా వదిలేస్తే ఎరుపు రంగులో, ఇంకా చూడని ప్రశ్నలు తెలుపు రంగులో కనిపిస్తాయి. దీనివల్ల ఎన్ని ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు? ఎన్ని ప్రశ్నలు మిగిలాయి? అనే విషయం అభ్యర్థులకు సులభంగా తెలుస్తుంది.
* పరీక్ష పూర్తయిన వెంటనే ఎల్ఎల్ఆర్
పరీక్ష ముగిసిన వెంటనే ఫలితాన్ని వెల్లడించనున్నారు. ఎన్ని ప్రశ్నలకు సరైన సమాధానాలు ఇచ్చారో అభ్యర్థులు తెలుసుకోవచ్చు. పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన వారికి క్యూఆర్ కోడ్‌తో కూడిన లెర్నర్ లైసెన్స్ (ఎల్ఎల్ఆర్)ను వెంటనే జారీ చేసేలా వ్యవస్థను రూపొందిస్తున్నారు. ఈ విధానం అమల్లోకి వస్తే ఆర్టీఓ కార్యాలయాలకు వెళ్లాల్సిన అవసరం తగ్గడంతో పాటు అభ్యర్థుల సమయం, ప్రయాణ ఖర్చులు ఆదా అవుతాయి. అయితే కొత్త సదుపాయం అధికారికంగా ప్రారంభమయ్యే వరకు అభ్యర్థులు ప్రస్తుతం అమల్లో ఉన్న పరీక్ష విధానాన్నే అనుసరించాలి.

Please tell us what is wrong. Your report will be sent to the website team.

