Aakash Puri recalls a childhood memory with Rahul Vijay
* నా ఓవర్ కాన్ఫిడెన్స్ తగ్గించాడు
* ఆకాష్ పూరి ఆసక్తికర కామెంట్స్
* బ్యాంకాక్‌లో ఏం జరిగింది?
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : నటుడు ఆకాష్ పూరి తన చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తన చిన్ననాటి స్నేహితుడు, నటుడు రాహుల్ విజయ్ టాలెంట్ చూసి తనలోని అతివిశ్వాసం తగ్గిందని సరదాగా వెల్లడించారు. రాహుల్ విజయ్, అర్చనా అయ్యర్ జంటగా నటిస్తున్న ‘AH’ సినిమా ట్రైలర్ విడుదల కార్యక్రమానికి ఆకాష్ పూరి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా రాహుల్‌తో తనకున్న అనుబంధాన్ని, బ్యాంకాక్‌లో జరిగిన ఓ సంఘటనను గుర్తు చేసుకున్నారు.
* చిన్ననాటి జ్ఞాపకాన్ని బయటపెట్టిన ఆకాష్ పూరి..
తనకు సుమారు 13 ఏళ్ల వయసున్నప్పుడు రాహుల్ విజయ్ను కలిశానని, అప్పటి నుంచి ఇద్దరం మంచి స్నేహితులమయ్యామని ఆకాష్ తెలిపారు. తన తండ్రి పూరి జగన్నాథ్ సినిమా షూటింగ్ కోసం బ్యాంకాక్‌లో ఉన్న సమయంలో ఓ పార్టీలో జరిగిన సంఘటనను వివరించారు. ఆ సినిమాకు విజయ్ మాస్టర్ ఫైట్ కంపోజ్ చేస్తున్నారని, ఆ సమయంలో పార్టీలో అందరూ తనను డ్యాన్స్ చేయమని అడిగారని చెప్పారు.
అప్పుడు తాను డ్యాన్స్ చేసిన తర్వాత.. హీరోగా ఎంట్రీ ఇస్తే అందరూ తన ముందు నిలవలేరనే నమ్మకంతో ఉండేవాడినని ఆకాష్ సరదాగా చెప్పారు. అయితే ఆ తర్వాత రాహుల్ విజయ్ డ్యాన్స్ చూసి ఆశ్చర్యపోయానన్నారు. తనకంటే ఎంతో ప్రతిభావంతులు ఉన్నారని అప్పుడే అర్థమైందని తెలిపారు. ఆ సంఘటన తనలోని అతివిశ్వాసాన్ని తగ్గించి, ఇతరుల ప్రతిభను గుర్తించేలా చేసిందని చెప్పారు.
* రాహుల్ నాకు అన్నలాంటి వాడు..
చిన్న వయసులోనే రాహుల్ తనకు గొప్ప పాఠం నేర్పించాడని ఆకాష్ పేర్కొన్నారు. అప్పటి నుంచి రాహుల్‌ను కేవలం స్నేహితుడిగానే కాకుండా అన్నలాంటి వ్యక్తిగా భావిస్తున్నానని తెలిపారు. ‘AH’ సినిమా టీజర్, ట్రైలర్ తనకు బాగా నచ్చాయని, సంగీతం, కెమెరా పనితనం ఆకట్టుకున్నాయని ప్రశంసించారు. రాహుల్ కష్టాన్ని చిన్నప్పటి నుంచి దగ్గరగా చూశానని, ఈ సినిమా అతనికి మంచి విజయాన్ని అందించాలని ఆకాంక్షించారు.
* నవంబర్ 12న ‘AH’ విడుదల..
రాహుల్ విజయ్, అర్చనా అయ్యర్ ప్రధాన పాత్రల్లో నటించిన ‘AH’ చిత్రానికి సాయి బాలి దర్శకత్వం వహించారు. ఈ సినిమాను డార్క్ క్రైమ్ థ్రిల్లర్‌గా తెరకెక్కించారు. శ్రీచరణ్ పాకాల సంగీతం అందించారు. నవంబర్ 2న హైదరాబాద్‌లో ట్రైలర్ విడుదల కార్యక్రమం నిర్వహించారు. నవంబర్ 12న ఈ చిత్రం థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు రానుంది.

Please tell us what is wrong. Your report will be sent to the website team.

