CM Revanth Reddy directs officials to transform Hyderabad into a clean and Traffic-Free city
* ట్రాఫిక్ ఫ్రీ సిటీగా భాగ్యనగరం
* సీఎం రేవంత్‌రెడ్డి కీలక ఆదేశాలు
* సిగ్నల్ ఫ్రీ ప్రయాణానికి కొత్త ప్లాన్
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : భాగ్యనగరాన్ని పరిశుభ్రమైన నగరంగా, ట్రాఫిక్ సమస్యలు లేని సిటీగా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. నగరంలో ఎక్కడా చెత్త కనిపించకుండా చర్యలు తీసుకోవాలని, ఇంటింటికీ ప్రతిరోజూ చెత్త సేకరణ జరిగేలా నిరంతర పర్యవేక్షణ ఉండాలని స్పష్టం చేశారు. జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో మున్సిపల్, హెచ్ఎండీఏ అధికారులతో సీఎం వివిధ అంశాలపై సమీక్ష నిర్వహించారు.
* చెత్త సేకరణలో నిర్లక్ష్యం చేస్తే చర్యలు..
హైదరాబాద్‌లో ప్రతి ఇంటి నుంచి రోజూ చెత్త సేకరించేలా అవసరమైన ఏర్పాట్లు చేయాలని రేవంత్‌రెడ్డి సూచించారు. ఈ విషయంలో నిర్లక్ష్యం వహించే సిబ్బంది, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. నిర్మాణ వ్యర్థాలను తరలించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని చెప్పారు. పారిశ్రామిక ప్రాంతాల్లో చెత్త సేకరణ కోసం ఇండస్ట్రియల్ లోకల్ అథారిటీ అధికారులతో సమన్వయం చేసుకోవాలని సూచించారు.
* నిర్మాణ పనులకు గ్రీన్ వాటర్ వినియోగం..
నగరంలో నిర్మాణ పనులు, పార్కుల నిర్వహణ, ల్యాండ్‌స్కేపింగ్, గార్డెనింగ్ వంటి అవసరాలకు తాగునీటికి బదులుగా మురుగునీటి శుద్ధి కేంద్రాల్లో శుద్ధి చేసిన నీటిని వినియోగించాలని సీఎం సూచించారు. ఇందుకోసం అందుబాటులోకి తీసుకొచ్చిన గ్రీన్ వాటర్ ట్యాంకర్లపై ప్రజలు, నిర్మాణ సంస్థలకు అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు. శుద్ధి చేసిన నీటిని వినియోగించడం ద్వారా తాగునీటిని ఆదా చేయవచ్చని పేర్కొన్నారు.
* 19 ఎస్టీపీల నుంచి 28 గ్రీన్ ట్యాంకర్లు..
జలమండలి తొలివిడతలో 19 మురుగునీటి శుద్ధి కేంద్రాల (ఎస్టీపీ) నుంచి 28 గ్రీన్ వాటర్ ట్యాంకర్ల ద్వారా సేవలను అందుబాటులోకి తీసుకొచ్చిందని సమావేశంలో ప్రస్తావించారు. జీహెచ్ఎంసీతో పాటు సీఎంసీ, ఎంఎంసీ పరిధుల్లోనూ గ్రీన్ వాటర్ సరఫరాను మరింత విస్తరించాలని ముఖ్యమంత్రి సూచించారు.
* సిగ్నల్ ఫ్రీ ప్రయాణానికి ప్రణాళికలు..
హైదరాబాద్‌లో ట్రాఫిక్ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపి, నగరాన్ని ట్రాఫిక్ ఫ్రీ సిటీగా మార్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని సీఎం ఆదేశించారు. అవసరమైన ప్రాంతాల్లో అండర్‌పాస్‌లు, ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణానికి ప్రతిపాదనలు రూపొందించాలని సూచించారు. సాధ్యమైనంత వరకు సిగ్నళ్ల వద్ద వాహనాలు నిలిచిపోకుండా, రాకపోకలు నిరంతరాయంగా సాగేలా సిగ్నల్ ఫ్రీ వ్యవస్థను అభివృద్ధి చేయాలని చెప్పారు. ఈ సమీక్షా సమావేశంలో ఎంపీ వేం నరేందర్‌రెడ్డితో పాటు హెచ్ఎండీఏ, మున్సిపల్ కార్పొరేషన్ల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.

