Kodavatoor Murder Case
* మూఢనమ్మకంతో దారుణం
* నిందితుడి అరెస్టు..
ఆకేరు న్యూస్, జనగామ : జిల్లాలో సంచలనం సృష్టించిన కొడవటూరు హత్య కేసును నర్మెట్ట సర్కిల్ పోలీసులు ఛేదించారు. చేతబడి చేస్తున్నాడనే మూఢనమ్మకంతో సొంత బంధువైన వ్యక్తిని హత్య చేసినట్లు నిందితుడిపై ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసులో మృతుడి సవతి తల్లి కుమారుడైన మిన్నలాపురం శ్రీనివాస్‌ను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. సుమారు 30 మందిని విచారించి, 200 మంది సెల్‌ఫోన్ నంబర్ల కాల్ డేటాతో పాటు సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలించి నిందితుడిని గుర్తించినట్లు పోలీసులు వెల్లడించారు.
* వ్యవసాయ భూమి వద్ద హత్య..
జనగామ జిల్లా బచ్చన్నపేట మండలం కొడవటూరు గ్రామానికి చెందిన మిన్నలాపురం సిద్ధయ్య (60) ఈ నెల 23వ తేదీన తన వ్యవసాయ భూమి వద్ద తలకు తీవ్ర గాయాలతో కనిపించాడు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. తొలుత అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసిన బచ్చన్నపేట పోలీసులు.. సంఘటనా స్థలాన్ని పరిశీలించి హత్యగా అనుమానిస్తూ దర్యాప్తు చేపట్టారు.
* దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగులోకి..
మృతుడి సవతి తల్లి కుమారుడైన మిన్నలాపురం శ్రీనివాస్.. తన భార్య, పిల్లల అనారోగ్యానికి, కుటుంబంలో జరిగిన మరణాలకు సిద్ధయ్య చేతబడి చేయడమే కారణమని మూఢనమ్మకంతో భావించినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ క్రమంలో గత ఫిబ్రవరి 3న కూడా సిద్ధయ్యపై హత్యాయత్నం చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. ఆ ప్రయత్నం విఫలం కావడంతో మరోసారి హత్యకు పథకం రచించినట్లు పోలీసులు తెలిపారు. ఈ నెల 23వ తేదీ తెల్లవారుజామున కొడవటూరుకు చేరుకున్న నిందితుడు.. పాలు పితకడానికి వచ్చిన సిద్ధయ్యపై వెనుక నుంచి కత్తితో తలపై దాడి చేసి పరారైనట్లు పోలీసులు వెల్లడించారు.
* 30 మందిని విచారించి హంతకుడిని పట్టుకున్న పోలీసులు
ఈ కేసును ఛేదించేందుకు పోలీసులు సుమారు 30 మందిని విచారించడంతో పాటు 200 మంది సెల్‌ఫోన్ నంబర్ల కాల్ డేటా, సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలించారు. సాంకేతిక, క్షేత్రస్థాయి ఆధారాలతో నిందితుడిని గుర్తించి అరెస్ట్ చేశారు. నేరానికి ఉపయోగించిన స్కూటీతో పాటు ఇతర కీలక వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం నిందితుడిని కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించారు.
* కేసును చేధించిన పోలీసులను అభినందించిన కమిషనర్..
వరంగల్ పోలీస్ కమిషనర్ శ్వేత ఆదేశాలతో, వెస్ట్ జోన్ డీసీపీ రాజమహేంద్రనాయక్ పర్యవేక్షణలో, జనగామ ఏసీపీ భీమశర్మ ఆధ్వర్యంలో నర్మెట్ట సీఐ పెండ్యాల దేవేందర్, బచ్చన్నపేట ఎస్ఐ శ్రీకాంత్, పోలీసు సిబ్బంది ఈ కేసును ఛేదించారు. కేసును ఛేదించిన పోలీసు అధికారులను, సిబ్బందిని పోలీస్ కమిషనర్ అభినందించారు.
ఈ సందర్భంగా జనగామ ఏసీపీ భీమశర్మ మాట్లాడుతూ.. ప్రజలు మూఢనమ్మకాలకు దూరంగా ఉండాలని, చేతబడి, మంత్రతంత్రాలపై అంధవిశ్వాసాలు పెంచుకోవద్దని సూచించారు. అనారోగ్య సమస్యలకు అర్హత కలిగిన వైద్యులను సంప్రదించాలని, మూఢనమ్మకాలతో ఇతరులపై అనుమానాలు పెంచుకుని హింసకు పాల్పడవద్దని విజ్ఞప్తి చేశారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.

