దివ్య దేవరాజన్
* పనుల పురోగతిని నిరంతరం పర్యవేక్షించాలి
* పంచాయతీరాజ్ కమిషనర్ దివ్య దేవరాజన్
Divya Devarajan| ఆకేరు న్యూస్, ములుగు: గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి కల్పనతో పాటు జల సంరక్షణ పనులపై ప్రత్యేక దృష్టి సారించాలని పంచాయతీరాజ్ కమిషనర్ దివ్య దేవరాజన్ అధికారులను ఆదేశించారు. గ్రామీణ మౌలిక వసతుల నిర్మాణ పనులను నిర్దేశిత గడువులోగా పూర్తి చేసేలా నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు.
బుధవారం హైదరాబాద్ నుంచి అన్ని జిల్లాల సంబంధిత అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన కమిషనర్ ఉపాధి హామీ పనులు, కూలీల హాజరు, జాబ్‌కార్డుల జారీ, మేట్ల శిక్షణ, జలసిరి కార్యక్రమం, గ్రామీణ మౌలిక వసతుల నిర్మాణాల పురోగతిపై సమీక్షించారు. ములుగు జిల్లా సమీకృత కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుంచి జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) ఎం. సంపత్ రావు సమావేశంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నవంబర్ 3 నాటి నివేదిక ప్రకారం రాష్ట్రంలోని 12,760 గ్రామ పంచాయతీలకు గాను 12,280 పంచాయతీల్లో ఉపాధి పనులు ప్రారంభించినట్లు తెలిపారు. అదే రోజు రాష్ట్రవ్యాప్తంగా 5,02,697 మంది కూలీలు పనులకు హాజరయ్యారని వెల్లడించారు. ఇంకా పనులు ప్రారంభించని గ్రామ పంచాయతీల్లో వెంటనే పనులు చేపట్టాలని, ఉపాధి కోరే ప్రతి కూలీకి పని కల్పించాలని సూచించారు. జాబ్‌కార్డుల జారీకి సంబంధించిన పెండింగ్ సమస్యలను పరిష్కరించడంతో పాటు కూలీల హాజరు, పనిదినాల నమోదును పకడ్బందీగా నిర్వహించాలని ఆదేశించారు.
జలసిరి కార్యక్రమంలో రాష్ట్రవ్యాప్తంగా 55,133 పనులు ప్రారంభించగా, ఇప్పటివరకు 14,121 పనులు పూర్తయినట్లు తెలిపారు. వ్యవసాయ కుంటలు, ఊటకుంటలు, ఇంకుడు గుంతలు, బోర్వెల్ రీఛార్జ్ నిర్మాణాలను త్వరగా పూర్తి చేయాలని సూచించారు. పశుగ్రాస సాగు, పశువుల తాగునీటి తొట్టెల నిర్మాణాలకు ప్రాధాన్యత ఇవ్వాలని పేర్కొన్నారు. గ్రామీణ మౌలిక వసతుల పనులు నిర్ణీత గడువులోగా పూర్తయ్యేలా అధికారులు ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు.
ములుగు జిల్లాలో 171 గ్రామ పంచాయతీలకు గాను 162 పంచాయతీల్లో ఉపాధి పనులు ప్రారంభించినట్లు జిల్లా అదనపు కలెక్టర్ ఎం. సంపత్ రావు కమిషనర్‌కు వివరించారు. నవంబర్ 3న జిల్లావ్యాప్తంగా 7,465 మంది కూలీలు పనులకు హాజరైనట్లు తెలిపారు. పనులు ప్రారంభమైన పంచాయతీల్లో కూలీల సగటు హాజరు 46గా నమోదైందని, ఇది రాష్ట్ర సగటు 41 కంటే ఎక్కువగా ఉండటంపై కమిషనర్ జిల్లా అధికారులను అభినందించారు.
ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో డీఆర్డీఓ రవీందర్, సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.

