సీఐ భరత్ సుమన్
* తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలి
* పాలకుర్తి సీఐ భరత్ సుమన్ హెచ్చరిక
Palakurthi Police ఆకేరు న్యూస్, పాలకుర్తి: యువత భవిష్యత్తును గంజాయి వంటి మత్తు పదార్థాలు ప్రమాదంలోకి నెడుతున్నాయని, పిల్లల ప్రవర్తన, స్నేహాలు, దైనందిన అలవాట్లపై తల్లిదండ్రులు ప్రత్యేక దృష్టి సారించాలని పాలకుర్తి సీఐ భరత్ సుమన్ సూచించారు. పిల్లల చదువుతో పాటు వారి జీవనశైలిని ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలని హితవు పలికారు.
బుధవారం వెలుగులోకి వచ్చిన ఘటనలో వల్మిడి గ్రామానికి చెందిన సోహైల్, పాలకుర్తి పట్టణానికి చెందిన కౌశిక్‌కు నిర్వహించిన వైద్య పరీక్షల్లో గంజాయి సేవించినట్లు నిర్ధారణ అయిందని సీఐ వెల్లడించారు. ఈ నేపథ్యంలో వారిని మేజిస్ట్రేట్ ఎదుట హాజరుపరిచిన అనంతరం పునరావాసం కోసం జనగామలోని డీ-అడిక్షన్ కేంద్రానికి 15 రోజుల పాటు తరలించినట్లు తెలిపారు.
వ్యసనాలకు దూరంగా ఉండాలి
యువత చెడు వ్యసనాలకు బానిసలై తమ భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని సీఐ సూచించారు. గంజాయి సేవించడం, విక్రయించడం లేదా ఇతర చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇప్పటికే ఈ అలవాటుకు బానిసైన యువకులు వెంటనే దూరమై, పునరావాసం ద్వారా సాధారణ జీవితంలోకి రావాలని కోరారు.
సమాచారం ఇస్తే గోప్యత
పాలకుర్తి పరిసర ప్రాంతాల్లో ఎవరైనా గంజాయి లేదా ఇతర మత్తు పదార్థాలను సేవిస్తున్నా, విక్రయిస్తున్నా ప్రజలు పోలీసులకు సమాచారం అందించాలని సీఐ భరత్ సుమన్ విజ్ఞప్తి చేశారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలను పూర్తిగా గోప్యంగా ఉంచుతామని భరోసా ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో ఎస్సై సృజన్ కుమార్‌తో పాటు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.

