Bethupalli Cheruvu Boat Accident Ponguleti Srinivas Reddy
* మరో సిబ్బంది ఆచూకీ లభ్యం.. ఒడ్డుకు చేర్చాలని మంత్రి ఆదేశం
* అర్ధరాత్రి దాటే వరకు సహాయక చర్యలను పర్యవేక్షించిన పొంగులేటి
* సహాయక చర్యల్లో పాల్గొన్న ఎస్డీఆర్ఎఫ్ సిబ్బందికి సత్కారం
ఆకేరు న్యూస్, ఖమ్మం : సత్తుపల్లి మండలం బేతుపల్లి పెద్ద చెరువు వద్ద వరద ఉద్ధృతిలో పడవ బోల్తాపడి ప్రమాదంలో చిక్కుకున్న 11 మంది రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన దళం (NDRF) సిబ్బందిలో 10 మందిని సహాయక బృందాలు సురక్షితంగా ఒడ్డుకు చేర్చాయి. గల్లంతైన మరో సిబ్బంది ఆచూకీ లభించడంతో అతడిని కూడా సురక్షితంగా తీసుకురావాలని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ( Ponguleti Srinivas Reddy ) అధికారులను ఆదేశించారు.
* అర్ధరాత్రి వరకు నిరంతర పర్యవేక్షణ
ప్రమాదం జరిగిన సమాచారం అందుకున్న వెంటనే మంత్రి పొంగులేటి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి సమాచారం అందించారు. సీఎం ఆదేశాల మేరకు జిల్లా కలెక్టర్, ఎస్పీ, ఖమ్మం పోలీస్ కమిషనర్‌తో పాటు రెవెన్యూ, పోలీస్, రెస్క్యూ బృందాలు సమన్వయంతో సహాయక చర్యలు చేపట్టాయి. అర్ధరాత్రి దాటే వరకు మంత్రి ఫోన్ ద్వారా పరిస్థితిని నిరంతరం పర్యవేక్షించారు. సహాయక చర్యల్లో పాల్గొన్న అధికార యంత్రాంగాన్ని, రెస్క్యూ బృందాలను అభినందించారు.
హైదరాబాద్ నుంచి బయలుదేరి కల్లూరు మండలం నారాయణపురం చేరుకున్న మంత్రి గురువారం బేతుపల్లి పెద్ద చెరువు వద్ద పరిస్థితిని ప్రత్యక్షంగా పరిశీలించారు. సత్తుపల్లి ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి, అశ్వారావుపేట ఎమ్మెల్యే జారే ఆదినారాయణ, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ అంకిత్ ఆయన వెంట ఉన్నారు.
* దమ్మపేటలో వరద పరిస్థితిపై సమీక్ష
దమ్మపేట మండలంలోని మల్లెపూల వాగు, ముసలిబంధం చెరువుల వద్ద గండ్లు పడిన ప్రాంతాలను మంత్రి సందర్శించారు. వరద పరిస్థితులు, చేపడుతున్న సహాయక చర్యలను అధికారులతో సమీక్షించారు. బేతుపల్లి చెరువు ఉప్పొండి దమ్మపేట మండలంలోని పలు గ్రామాలకు వరద ముప్పు ఏర్పడిన సమయంలో ఎస్డీఆర్ఎఫ్ బృందాలు అందించిన సేవలను మంత్రి పొంగులేటి కొనియాడారు.
‘మీ సేవలు మరువలేనివి
భారీ వర్షాలు, వరదలతో ప్రమాదకర పరిస్థితులు నెలకొన్న వేళ ప్రాణాలకు తెగించి ప్రజలను కాపాడేందుకు ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది చూపిన ధైర్యసాహసాలు, అంకితభావం ప్రశంసనీయమని మంత్రి పేర్కొన్నారు. విపత్కర పరిస్థితుల్లో వారి సేవలు మరువలేనివన్నారు. సహాయక చర్యల్లో పాల్గొన్న సిబ్బందికి శాలువాలు కప్పి సత్కరించి, ప్రభుత్వం తరఫున అభినందనలు తెలిపారు

Please tell us what is wrong. Your report will be sent to the website team.

