BC Atma Gaurava Bhavanalu Minister Ponnam Prabhakar
* 38 కుల సంఘాల ప్రతినిధులకు మంజూరు జీవోలు అందజేసిన మంత్రి పొన్నం
* కార్తీక మాసంలో శంకుస్థాపనలు.. ప్రతి నెలా నిర్మాణాల ప్రగతిపై సమీక్ష
* సంఘాలన్నీ ఐక్యంగా భవనాలు పూర్తి చేసుకోవాలని వీహెచ్ పిలుపు
* ఐదెకరాల్లో ఉమ్మడి ‘బీసీ భవన్’ నిర్మించాలని జాజుల విజ్ఞప్తి
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : రాష్ట్రంలోని 38 బీసీ కుల సంఘాల ఆత్మగౌరవ భవనాల నిర్మాణాలకు రూ.88.50 కోట్ల నిధులకు సంబంధించిన మంజూరు జీవోలను మంత్రి పొన్నం ప్రభాకర్ ఆయా సంఘాల ప్రతినిధులకు అందజేశారు. హైదరాబాద్‌లోని మినిస్టర్స్ క్వార్టర్స్‌లో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. కేటాయించిన స్థలాల్లో వెంటనే నిర్మాణాలు ప్రారంభించి, నిర్ణీత గడువులోగా పూర్తి చేసుకోవాలని సూచించారు. అన్ని బీసీ సంఘాలు ఉమ్మడిగా కార్యక్రమాలు నిర్వహించుకునేందుకు ఐదెకరాల్లో ప్రత్యేకంగా ‘బీసీ భవన్’ నిర్మించాలని బీసీ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ ఈ సందర్భంగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
* నిర్మాణాలకు సింగిల్ విండో అనుమతులు
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సూచనలు, ఉపముఖ్యమంత్రి, ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క ఆదేశాల మేరకు భవన నిర్మాణాలను వేగవంతం చేస్తున్నామని మంత్రి పొన్నం తెలిపారు. గతంలో స్థలాలు కేటాయించినప్పటికీ కొన్ని చోట్ల నిర్మాణాలకు అనువైన పరిస్థితులు లేవని, హెచ్ఎండీఏ సహకారంతో ఆ సమస్యలను పరిష్కరించామని చెప్పారు. వెంటనే నిర్మాణాలు చేపట్టేందుకు వీలుగా లేఅవుట్లను అభివృద్ధి చేసినట్లు వివరించారు. కుల సంఘాలు కార్తీక మాసంలోనే భవనాలకు శంకుస్థాపనలు చేసుకోవాలని సూచించారు. ఇంజనీరింగ్ శాఖ, హెచ్ఎండీఏ సమన్వయంతో అవసరమైన అనుమతులను సింగిల్ విండో విధానంలో మంజూరు చేస్తామని తెలిపారు.
* నెలవారీ సమీక్షలతో పనుల పర్యవేక్షణ
బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ప్రతి నెలా నిర్మాణాల ప్రగతిని సమీక్షించి, పురోగతి నివేదికలు తీసుకుంటామని పొన్నం చెప్పారు. ఏడాది కాలంలో లేదా నిర్మాణ పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయించిన గడువులోగా భవనాలను పూర్తి చేయడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. నిర్మాణాల్లో జాప్యం జరిగితే సంబంధిత సంఘాల ప్రతినిధులను బాధ్యులను చేస్తూ పనులు పూర్తిచేయించేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.
భవనాల నిర్వహణ, నిర్మాణాల పర్యవేక్షణ కోసం కొత్త కార్యవర్గాల ఎంపికకు సంబంధించి జీవో నంబర్ 14 తీసుకొచ్చినట్లు చెప్పారు. సంఘాల ప్రతినిధులు అంతర్గత విభేదాలకు తావివ్వకుండా ఐక్యంగా పనిచేయాలని కోరారు. ఆర్థిక స్థోమత ఉన్న సంఘాలు ప్రభుత్వ నిధులకు అదనంగా తమ వంతు సహకారం అందించాలని సూచించారు.
* బీసీల భూములను వెనక్కి తీసుకోం..
బీసీ కుల సంఘాలకు కేటాయించిన భూములను ప్రభుత్వం వెనక్కి తీసుకుంటుందంటూ జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని మంత్రి స్పష్టం చేశారు. అవి బలహీన వర్గాల ఆస్తులని, వాటి పరిరక్షణకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. నిధులు, స్థలాల కేటాయింపులతో సరిపెట్టుకోకుండా భవనాలు నిర్మించి ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పారు. పేద బీసీ విద్యార్థులకు వసతి, నైపుణ్యాభివృద్ధి శిక్షణతో పాటు సామాజిక కార్యక్రమాలకు ఈ భవనాలు ఉపయోగపడాలని ఆకాంక్షించారు. హైదరాబాద్‌లో వివిధ కుల సంఘాలు నిర్వహిస్తున్న వసతి గృహాల ద్వారా వేలాది మంది విద్యార్థులు ఉన్నత స్థాయికి ఎదిగారని, అదే స్ఫూర్తితో కొత్త భవనాలు భవిష్యత్ తరాలకు ఉపయోగపడాలన్నారు.
*సమష్టి కృషితో నిర్మాణాలు పూర్తి చేయాలి : వీహెచ్
ఆత్మగౌరవ భవనాల నిర్మాణానికి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కల్పించిన అవకాశాన్ని కుల సంఘాలు సద్వినియోగం చేసుకోవాలని ప్రభుత్వ సలహాదారు వి.హనుమంతరావు కోరారు. ప్రభుత్వ ఆర్థిక సహాయానికి తోడు ఆయా కులాల్లో ఆర్థిక స్థోమత ఉన్నవారు సహకరించి, నిర్మాణాలను త్వరగా పూర్తి చేయాలన్నారు. కులాలవారీగా సంఘాలు ఉన్నప్పటికీ అందరూ ఐక్యభావనతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. బడుగు, బలహీన వర్గాలకు న్యాయం చేయాలన్నదే ముఖ్యమంత్రి ఆలోచనని, రాహుల్ గాంధీ సామాజిక న్యాయ విధానాలను తెలంగాణలో అమలు చేస్తున్నారని పేర్కొన్నారు.
*అంబర్‌పేట్‌లో గ్రంథాలయం, ఆడిటోరియం నిర్మించాలి..
అంబర్పేట్ ఛే నంబర్ చౌరస్తా పరిసరాల్లో, ఉస్మానియా విశ్వవిద్యాలయానికి సమీపంలో ఫూలే విగ్రహం ఏర్పాటు చేసిన స్థలం కబ్జాలకు గురవుతోందని వి.హనుమంతరావు పేర్కొన్నారు. అక్కడ గ్రంథాలయం, రవీంద్రభారతి తరహాలో పెద్ద ఆడిటోరియం నిర్మిస్తే విద్యార్థులకు, బడుగు బలహీన వర్గాలకు ఉపయోగపడుతుందని సూచించారు. దీనిపై ఇప్పటికే ముఖ్యమంత్రికి లేఖ రాశానని, మంత్రి పొన్నం కూడా చొరవ తీసుకుని ఆ స్థలాన్ని బీసీల అవసరాలకు సద్వినియోగం చేయాలని కోరారు.
*ఉమ్మడి బీసీ భవన్ అవసరం : జాజుల
ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ ప్రభుత్వం భవన నిర్మాణాలకు నిధులు మంజూరు చేయడం అభినందనీయమని జాజుల శ్రీనివాస్ గౌడ్ అన్నారు. మంత్రి పొన్నం ప్రత్యేక చొరవతో 40 బీసీ కుల సంఘాలు, 36 సంచార జాతులకు కలిపి మొత్తం 76 కులాలకు ఆత్మగౌరవ భవనాల నిర్మాణానికి బడ్జెట్ మంజూరు జీవోలు అందజేశారని ఆయన పేర్కొన్నారు.
హైదరాబాద్‌లో చదువుకునే బీసీ విద్యార్థులకు, వివిధ అవసరాల కోసం నగరానికి వచ్చే ప్రజలకు ఈ భవనాలు ఉపయోగపడతాయన్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, మంత్రి పొన్నం ప్రభాకర్, పీసీసీ అధ్యక్షుడు మహేష్‌కుమార్ గౌడ్, వి.హనుమంతరావులకు ధన్యవాదాలు తెలిపారు. ప్రజాభవన్‌కు మహాత్మా జ్యోతిబా ఫూలే పేరు పెట్టడం, ఫూలే దంపతుల విగ్రహాల ఆవిష్కరణ, కులగణన సర్వే వంటి కార్యక్రమాలు బీసీలకు ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యాన్ని తెలియజేస్తున్నాయని పేర్కొన్నారు. మహనీయుల జయంతులు, సభలు, సామాజిక కార్యక్రమాల నిర్వహణకు ఐదెకరాల స్థలం కేటాయించి ఉమ్మడి బీసీ భవన్ నిర్మించాలని కోరారు.
కార్యక్రమంలో ఎంపీ సురేష్ షెట్కర్, ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్, బీసీ సంక్షేమ శాఖ కమిషనర్ బాలమాయ దేవి, మాజీ ఓబీసీ కార్పొరేషన్ చైర్మన్ నూతి శ్రీకాంత్ గౌడ్, మున్నూరు కాపు కార్పొరేషన్ చైర్మన్ బొమ్మ శ్రీరామ్ చక్రవర్తి, ఇతర కార్పొరేషన్ల చైర్మన్లు, కుల సంఘాల ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.

