Nagaur Blast
* మందుగుండు తయారీ గోదాములో ఘోర ప్రమాదం..
* భారీ శబ్దంతో దద్దరిల్లిన ప్రాంతం
ఆకేరు న్యూస్, నాగోర్ : రాజస్థాన్లోని నాగోర్ నగరంలో గురువారం ఉదయం ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. బర్లీ ప్రాంతంలో మందుగుండు సామగ్రి తయారు చేస్తున్న ఓ గోదాములో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఇద్దరు కజిన్ సోదరులు సజీవదహనమయ్యారు. పేలుడు తీవ్రతకు గోదాము పూర్తిగా నేలమట్టమైంది. శిథిలాల కింద మరికొందరు కార్మికులు చిక్కుకున్నట్లు అనుమానాలు వ్యక్తమవుతుండటంతో ఆందోళన నెలకొంది.
* భారీ శబ్దంతో ఉలిక్కిపడిన స్థానికులు
ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం.. గురువారం ఉదయం బర్లీ ప్రాంతంలోని ఓ ప్రైవేట్ గోదాములో బాణసంచా, మందుగుండు సామగ్రి తయారు చేస్తున్న సమయంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. పొటాషియం నైట్రేట్, ఇతర రసాయనాల కారణంగా మంటలు వేగంగా వ్యాపించి భారీ పేలుడు సంభవించినట్లు తెలుస్తోంది. పేలుడు శబ్దం ఒకటి నుంచి రెండు కిలోమీటర్ల దూరం వరకు వినిపించినట్లు స్థానికులు చెబుతున్నారు. సమీపంలోని ఇళ్ల కిటికీల అద్దాలు సైతం పగిలిపోయాయి. దీంతో స్థానికులు భయాందోళనలతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు.
* ఇద్దరు కజిన్ సోదరులు దుర్మరణం
ఈ ప్రమాదంలో గోదాములో మందుగుండు తయారీ పనులు చేస్తున్న ఇద్దరు కజిన్ సోదరులు ప్రాణాలు కోల్పోయారు. పేలుడు ధాటికి గోదాము పైకప్పు, గోడలు పూర్తిగా కూలిపోవడంతో వారు మంటలు, శిథిలాల మధ్య చిక్కుకుపోయారు. ప్రమాద తీవ్రతకు గోదాము శిథిలాలు సుమారు 100 అడుగుల దూరం వరకు ఎగిరిపడినట్లు సమాచారం.
* రంగంలోకి పోలీసులు, ఫైర్ సిబ్బంది
పేలుడు సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. తీవ్రంగా వ్యాపించిన మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. అనంతరం శిథిలాల కింద మరికొందరు కార్మికులు చిక్కుకున్నారా అనే కోణంలో జేసీబీల సహాయంతో సహాయక చర్యలు చేపట్టారు. జిల్లా ఉన్నతాధికారులు సైతం ఘటనాస్థలిని పరిశీలించి పరిస్థితిని సమీక్షించారు.
*ప్రమాదానికి కారణాలపై దర్యాప్తు
గోదాములో మందుగుండు సామగ్రి తయారీకి అవసరమైన అనుమతులు ఉన్నాయా? భద్రతా ప్రమాణాలు పాటించారా? అనే అంశాలపై అధికారులు విచారణ చేపట్టారు. సరైన అనుమతులు లేకుండా తయారీ కేంద్రం నిర్వహిస్తున్నట్లు ప్రాథమిక విచారణలో వెల్లడైనట్లు సమాచారం. పేలుడుకు అసలు కారణాలేంటి? మరికొందరు కార్మికులు శిథిలాల కింద చిక్కుకున్నారా? అనే అంశాలపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.

