ఎంపీడీఓకు వినతిపత్రం అందజేత
* అర్హుల ఎంపిక గ్రామసభల ద్వారానే జరగాలి
Palakurthi| ఆకేరు న్యూస్, పాలకుర్తి: పాలకుర్తి మండలంలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియలో అక్రమాలు చోటుచేసుకుంటున్నాయని బీజేపీ మండల నాయకులు ఆరోపించారు. నిజమైన నిరుపేదలను పక్కనపెట్టి, అధికార పార్టీకి చెందిన అనర్హులకు ఇళ్లు కేటాయిస్తున్నారని విమర్శించారు. లబ్ధిదారుల ఎంపికలో పారదర్శకత పాటించాలని కోరుతూ మంగళవారం మండల ఎంపీడీఓకు వినతిపత్రం సమర్పించారు.
ఈ సందర్భంగా బీజేపీ నాయకులు మాట్లాడుతూ.. ఇందిరమ్మ ఇళ్ల కమిటీల పేరుతో అధికార పార్టీ నాయకులు తమకు అనుకూలమైన వారికి ఇళ్లు కేటాయించుకుంటున్నారని ఆరోపించారు. గుడిసెల్లో నివసిస్తున్న నిరాశ్రయులైన పేదలకు అన్యాయం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇందిరమ్మ ఇళ్ల పథకంలో కేంద్ర ప్రభుత్వానికి చెందిన ప్రధానమంత్రి ఆవాస్ యోజన (PMAY) నిధులు కూడా వినియోగిస్తున్నందున ఎంపిక ప్రక్రియలో పారదర్శకతకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు.
గతంలో గ్రామ పంచాయతీ పాలకవర్గాలు అందుబాటులో లేని పరిస్థితుల్లో ఇందిరమ్మ కమిటీలను ఏర్పాటు చేశారని, ప్రస్తుతం ఎన్నికైన సర్పంచులు, పంచాయతీ పాలకవర్గాలు ఉన్నందున లబ్ధిదారుల ఎంపికను ప్రత్యేక గ్రామసభల ద్వారా నిర్వహించాలని డిమాండ్ చేశారు.
మొదటి విడతలో సొంత ఇళ్లు, ఆస్తులు ఉన్నవారికి ఇళ్లు కేటాయించారని, పూరి గుడిసెల్లో జీవిస్తున్న నిరుపేదలకు మాత్రం అవకాశం దక్కలేదని ఆరోపించారు. గ్రామ పంచాయతీలను సంప్రదించకుండానే ఏకపక్షంగా జాబితాలు రూపొందించారని, ఎలాంటి ఆధారాలు లేని ఎల్1, ఎల్2 జాబితాల పేరుతో అక్రమాలకు పాల్పడుతున్నారని విమర్శించారు. ప్రభుత్వం, అధికారులు వెంటనే స్పందించి అర్హులైన పేదలకు న్యాయం చేయాలని కోరారు.
ఈ కార్యక్రమంలో జనగామ జిల్లా కార్యదర్శి దుంపల సంపత్, జిల్లా ఎస్టీ మోర్చా అధ్యక్షుడు లకావత్ రవి, ఎండోమెంట్ కన్వీనర్, ఉప సర్పంచ్ ఈర్ల రాజు, మండల ప్రధాన కార్యదర్శి వేల్పుల దేవరాజ్, మండల కార్యదర్శి ఘనగాని రాజు, మండల నాయకుడు బెల్లి సతీష్ తదితరులు పాల్గొన్నారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.

