ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్
* పెండింగ్ కేసుల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి
* పోలీస్ అధికారులతో సమీక్ష
Bhupalpally Police| ఆకేరు న్యూస్, భూపాలపల్లి: జిల్లాలో నేరాల నియంత్రణకు పటిష్ట చర్యలు చేపట్టడంతో పాటు పెండింగ్ కేసుల పరిష్కారాన్ని వేగవంతం చేయాలని భూపాలపల్లి జిల్లా ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ ఐపీఎస్ పోలీస్ అధికారులను ఆదేశించారు. మంగళవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన నెలవారీ నేర సమీక్ష సమావేశంలో ఆయన పోలీస్ స్టేషన్ల వారీగా కేసుల నమోదు, దర్యాప్తు పురోగతి, పెండింగ్ కేసులు, శాంతిభద్రతల పరిస్థితిపై సమీక్షించారు.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. పోలీస్ స్టేషన్లకు వచ్చే బాధితుల ఫిర్యాదులను వెంటనే స్వీకరించి, వారితో మర్యాదపూర్వకంగా వ్యవహరించాలని సూచించారు. ప్రతి ఫిర్యాదుపై చట్టప్రకారం స్పందించి బాధితులకు న్యాయం జరిగేలా చూడాలన్నారు. పెండింగ్ కేసులను నిర్లక్ష్యం చేయకుండా నిర్ణీత గడువులోగా దర్యాప్తు పూర్తి చేయాలని స్పష్టం చేశారు.
నేరాలపై నిరంతర నిఘా
జిల్లాలో దొంగతనాలు, చైన్ స్నాచింగ్‌ల నివారణకు రాత్రి వేళల్లో పోలీస్ గస్తీని ముమ్మరం చేయాలని ఎస్పీ ఆదేశించారు. పాత నేరస్తుల కదలికలపై నిరంతరం నిఘా ఉంచాలని, గంజాయి అక్రమ రవాణా, విక్రయాలు, జూదం, పేకాట వంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు.
మహిళల భద్రతకు ప్రాధాన్యం
మహిళలు, చిన్నారుల భద్రత విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహించాలని, పోక్సో కేసుల దర్యాప్తును వేగవంతం చేయాలని తెలిపారు. షీ టీమ్స్ ద్వారా మహిళలు, విద్యార్థినులకు భద్రతపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. సైబర్ నేరాల పట్ల ప్రజలను అప్రమత్తం చేస్తూ, ఆన్లైన్ మోసాలకు గురైన బాధితులు వెంటనే 1930 హెల్ప్‌లైన్‌కు ఫిర్యాదు చేసేలా అవగాహన కల్పించాలని సూచించారు.
ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన
రోడ్డు ప్రమాదాల నివారణకు ట్రాఫిక్ నిబంధనలను కచ్చితంగా అమలు చేయాలని ఎస్పీ తెలిపారు. ద్విచక్ర వాహనదారులు హెల్మెట్, కార్లలో ప్రయాణించేవారు సీట్‌బెల్ట్ తప్పనిసరిగా ధరించేలా అవగాహన కల్పించాలన్నారు. ప్రమాద బాధితులకు సత్వర వైద్య సహాయం అందించే పీఎం రాహత్, రహవీర్ పథకాల గురించి ప్రజలకు వివరించాలని సూచించారు. పీఎం రాహత్ పథకం కింద అర్హులైన ప్రమాద బాధితులకు గరిష్ఠంగా రూ.1.50 లక్షల వరకు ఏడు రోజుల పాటు నగదు రహిత వైద్య చికిత్స అందుతుందని తెలిపారు. ప్రమాద బాధితుల ప్రాణాలను కాపాడేందుకు సహకరించిన వారికి రహవీర్ పథకం కింద రూ.25 వేల ప్రోత్సాహకం అందుతుందని వివరించారు. అత్యవసర పరిస్థితుల్లో 112 నంబర్‌కు సమాచారం అందించాలని సూచించారు.
సాంకేతికతతో కేసుల ఛేదన
CCTNSలో కేసులకు సంబంధించిన వివరాలను ఎప్పటికప్పుడు అప్డేట్ చేయాలని, సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థంగా వినియోగించుకుని నేరాల ఛేదనలో వేగం పెంచాలని ఎస్పీ ఆదేశించారు. గ్రామస్థాయిలో పోలీసింగ్‌ను బలోపేతం చేయడంతో పాటు ప్రజలతో సత్సంబంధాలు కొనసాగించాలని, వారి సమస్యలపై తక్షణమే స్పందించాలని అధికారులకు సూచించారు.
ఈ సమావేశంలో అడిషనల్ ఎస్పీ నరేష్ కుమార్, డీఎస్పీ ఏ. సంపత్ రావు, కాటారం డీఎస్పీ సూర్యనారాయణ, వర్టికల్ డీఎస్పీ రెహమాన్, సీఐలు, ఎస్సైలు, వివిధ విభాగాల పోలీస్ అధికారులు పాల్గొన్నారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.

