ఇట్లు అర్జున హీరో అనీష్
* ‘ఇట్లు అర్జున’తో కొత్త అనుభూతి – హీరో అనీష్!
* మూగవాడి ప్రేమకథ ప్రేక్షకులకు కొత్త ఎక్స్పీరియన్స్ ఇస్తుంది..
* నాగార్జున, తారక్‌లకు సినిమా బాగా నచ్చింది
ఆకేరు న్యూస్, సినిమా : తొలి సినిమాతోనే ఓ ఛాలెంజింగ్ పాత్రలో నటుడిగా పరిచయం కావడం ఆనందంగా ఉందని హీరో అనీష్ అన్నారు. కింగ్ నాగార్జున సమర్పణలో తెరకెక్కిన ‘ఇట్లు అర్జున (Itlu Arjun Movie)’ చిత్రంతో ఆయన హీరోగా Aneesh పరిచయమవుతున్నారు. అనస్వర రాజన్ కథానాయికగా నటించిన ఈ సినిమాకు మహేష్ ఉప్పల దర్శకత్వం వహించారు.
దర్శకుడు వెంకీ కుడుముల నిర్మాతగా మారి, తన కొత్త బ్యానర్ వాట్ నెక్స్ట్ ఎంటర్టైన్మెంట్స్పై ఈ చిత్రాన్ని నిర్మించారు. ఎస్. తమన్ సంగీతం అందించారు. నవంబర్ 13న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.
ఈ సందర్భంగా హీరో అనీష్ (Aneesh Hero) విలేకరులతో ముచ్చటించారు. సినిమాలోని తన పాత్ర, నటన కోసం చేసిన కసరత్తు, నాగార్జున, ఎన్టీఆర్ నుంచి లభించిన మద్దతు, సినిమా విశేషాలను పంచుకున్నారు.
* మూగవాడి ప్రేమకథ నచ్చింది..
‘ఇట్లు అర్జున (Itlu Arjun Movie)’ కథ విన్నప్పుడు ఒక మూగవాడి ప్రేమకథ తనను బాగా ఆకట్టుకుందని అనీష్ తెలిపారు. తన భావాలను మాటల్లో వ్యక్తపరచలేని వ్యక్తి ప్రేమను ఎలా చూపిస్తాడనే అంశం ఆసక్తికరంగా అనిపించిందన్నారు. హీరో, హీరోయిన్ ప్రయాణంతో పాటు కథలోని యాక్షన్.. ఎమోషన్ సహజంగా అనిపించాయని చెప్పారు. మాట్లాడలేని వ్యక్తి ఆసక్తికరమైన సందర్భాలను ఎలా ఎదుర్కొంటాడనే అంశం తనకు ప్రత్యేకంగా నచ్చిందన్నారు. ఈ పాత్ర కోసం దాదాపు ఆరు నెలల పాటు వర్క్‌షాప్ చేసినట్లు అనీష్ వెల్లడించారు.
* తొలి సినిమాతోనే ఛాలెంజింగ్ రోల్..
బాడీ లాంగ్వేజ్, రియాక్షన్స్, ఎక్స్‌ప్రెషన్స్‌పై దర్శకుడు మహేష్ ఉప్పలకు స్పష్టమైన అవగాహన ఉందన్నారు. సినిమాలో కొంత సైన్ లాంగ్వేజ్‌ను కూడా ఉపయోగించామని చెప్పారు. ప్రతి సన్నివేశాన్ని ముందుగానే రిహార్సల్ చేయడం పాత్రలోకి వెళ్లేందుకు ఎంతో ఉపయోగపడిందన్నారు.
మాట్లాడలేని పాత్ర కావడంతో ఎదుటివారు మాట్లాడుతున్నప్పుడు డైలాగులతో కాకుండా ముఖ కవళికలతోనే స్పందించడం సవాలుగా అనిపించిందని తెలిపారు. లిప్ సింక్ లేకుండా డ్యాన్స్ చేయడం కూడా కొత్త అనుభవమని చెప్పారు.
* నాగార్జున, తారక్ ప్రశంసలు ఆనందాన్నిచ్చాయి..
పెద్ద స్టార్స్ వచ్చి తమ సినిమా గురించి మాట్లాడటం ఇప్పటికీ కలలా అనిపిస్తోందని అనీష్ అన్నారు. తాము ఎంచుకున్న కాన్సెప్ట్, కంటెంట్ నచ్చడం వల్లే ఇంత మంచి మద్దతు లభించిందని భావిస్తున్నట్లు చెప్పారు. నాగార్జున గారు సినిమా చూసిన తర్వాతే సమర్పించేందుకు ముందుకొచ్చారని, ఆయనకు సినిమా బాగా నచ్చిందని తెలిపారు.
ఎన్టీఆర్ కూడా సినిమా చూసి చాలా పాజిటివ్‌గా స్పందించారని అనీష్ వెల్లడించారు. రామ్ చరణ్, ఎన్టీఆర్, అల్లు అర్జున్ వంటి హీరోల సినిమాలు చూస్తూ పెరిగానని, వారంతా తనకు స్ఫూర్తి అని చెప్పారు. ఇంత పెద్ద స్టార్స్ నుంచి మద్దతు లభించడం ఆనందంగా ఉందని, అదే సమయంలో తనపై బాధ్యతను పెంచిందన్నారు.
* అండర్డాగ్ పాత్రకు తగ్గట్టుగా యాక్షన్..
‘ఇట్లు అర్జున’లో యాక్షన్ సన్నివేశాలను కొత్తగా రూపొందించారని అనీష్ చెప్పారు. మాస్ కమర్షియల్ సినిమాల్లో ఉండే యాక్షన్‌లా కాకుండా, ఒక సాధారణ వ్యక్తి తన పరిస్థితులకు అనుగుణంగా చేసే పోరాటంలా ఉంటుందన్నారు. దాదాపు అన్ని యాక్షన్ సన్నివేశాలను తానే చేశానని, ఎక్కడా డూప్‌ను ఉపయోగించలేదని తెలిపారు.
యాక్షన్ సన్నివేశాల్లో సహజంగా వచ్చే శబ్దాలకు అనుగుణంగా డబ్బింగ్ చెప్పడం కూడా తనకు కొత్త అనుభవమని వివరించారు. మాటలు లేకుండా శరీర కదలికలు, హావభావాలకు అనుగుణంగా డబ్బింగ్ చెప్పినట్లు తెలిపారు. అర్జున పాత్రకు మాటలు రాకపోయినా చాలా తెలివైన వ్యక్తి అని చెప్పారు.
* ఏడాది పాటు కథలు విన్న తర్వాతే ఓకే..
చిన్నప్పటి నుంచే నటనపై ఆసక్తి ఉండేదని అనీష్ తెలిపారు. వైజాగ్‌లో సత్యానంద్ గారి దగ్గర నటనలో శిక్షణ తీసుకున్నానని, అమెరికాలో కూడా ఏడాది పాటు నేర్చుకున్నానని చెప్పారు. తొలి సినిమా చేయడానికి ముందు దాదాపు ఏడాది పాటు కథలు విన్నానన్నారు. ఆ సమయంలో దర్శకుడు మహేష్ ఈ కథను వినిపించారన్నారు. తనకు బాగా నచ్చడంతో అంగీకరించానని వివరించారు. కథ ఓకే చేసిన తర్వాత మరో ఏడాది పాటు వర్క్‌షాప్‌లు, ప్రీ-ప్రొడక్షన్ పనులు జరిగాయని తెలిపారు.
* తమన్ సంగీతం సినిమాకు ప్రధాన ఆకర్షణ..
ఈ సినిమాకు సంగీతం చాలా ముఖ్యమని అనీష్ అన్నారు. ముఖ్యంగా మూగవాడి కథ కావడంతో సంగీతానికి ప్రత్యేక ప్రాధాన్యత ఉంటుందని చెప్పారు. తమన్ ఈ ప్రయాణంలో తనకు ఒక సోదరుడిలా మారిపోయారన్నారు. సినిమా కోసం ఎంతో కష్టపడ్డారని ప్రశంసించారు. పాటలకు మంచి స్పందన వచ్చిందని, నేపథ్య సంగీతం కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని నమ్మకం వ్యక్తం చేశారు.
* అనస్వర రాజన్ , ఇతర నటీనటుల గురించి..
కథానాయిక అనస్వర రాజన్ (Anaswara Rajan) అద్భుతమైన నటి అని అనీష్ అన్నారు. ఆమెతో కలిసి పనిచేయడం చాలా ఆనందంగా ఉందని చెప్పారు. బ్రహ్మాజీ, వెన్నెల కిషోర్ వంటి మంచి నటులు సినిమాలో కీలక పాత్రలు పోషించారన్నారు. ప్రతి పాత్రకు కథలో ప్రత్యేక ప్రాధాన్యత ఉంటుందని తెలిపారు.
దర్శకుడు వెంకీ కుడుములతో తన పరిచయం గురించి మాట్లాడుతూ.. ఆయనకు తన తండ్రితో ముందునుంచే పరిచయం ఉందన్నారు. ‘భీష్మ’ సినిమా తర్వాత వెంకీని కొన్ని సలహాలు అడిగేవాడినని, ఆ సమయంలోనే ‘ఇట్లు అర్జున’ కథ గురించి చెప్పారని వివరించారు. తనకు సినిమాలపై ఆసక్తి ఉందని చెప్పినప్పుడు తల్లిదండ్రులు ఎంతో ప్రోత్సహించారని, లండన్‌లో బిజినెస్ మేనేజ్మెంట్ చదువుకున్నానని తెలిపారు.
* మంచి ఎమోషన్ ఉన్న కథలు చేయాలనుంది..
తొలి సినిమా ప్రయాణంలో సినిమా నిర్మాణం వెనుక ఎంతమంది కష్టపడతారో ప్రత్యక్షంగా తెలుసుకున్నానని అనీష్ చెప్పారు. సినిమా చేయడం అంత సులభం కాదన్నారు. ఈ అనుభవంతో సినిమాపై తనకు మరింత గౌరవం పెరిగిందన్నారు. విడుదల తేదీ వాయిదా పడినప్పుడు కొంత నిరాశ కలిగినా, మంచి సినిమా చేశామనే నమ్మకంతో మళ్లీ ఉత్సాహంగా పనిచేశామని తెలిపారు.
భవిష్యత్తులో ప్రేక్షకులు సినిమాను ఆస్వాదించి, మంచి భావోద్వేగంతో ఇంటికి వెళ్లేలా చేసే కథలను ఎంచుకోవాలనుకుంటున్నట్లు చెప్పారు. ఇప్పటికే రెండు మూడు కథలు విన్నానని, తనకు బలంగా నచ్చి సరిపోయే కథతో ముందుకు వెళ్తానని అనీష్ వెల్లడించారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.

