ఉన్నతాధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష
* 3 మార్గాల్లో కొత్త రవాణా వ్యవస్థ
* సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం
* డిసెంబర్లో టెండర్లు..
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : గ్రేటర్ హైదరాబాద్‌లో ట్రాఫిక్ సమస్యలను తగ్గించడంతో పాటు ప్రయాణ సమయాన్ని ఆదా చేయడం, కాలుష్య నియంత్రణ లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం కీలక చర్యలకు సిద్ధమవుతోంది. కోర్ అర్బన్ ఏరియా (CURE) పరిధిలోని ప్రధాన ప్రాంతాల్లో పర్సనల్ ర్యాపిడ్ ట్రాన్సిట్ (PRT) వ్యవస్థను ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు.
నగరంలోని అత్యంత రద్దీగా ఉండే మార్గాలను గుర్తించి ఈ విధానాన్ని అమలు చేసేందుకు వెంటనే చర్యలు చేపట్టాలని సూచించారు. ఎంసీఆర్హెచ్ఆర్డీలోని బోధి పెవిలియన్‌లో పర్సనల్ ర్యాపిడ్ ట్రాన్సిట్ విధానంపై ముఖ్యమంత్రి ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో మూడు కీలక మార్గాల్లో (Hyderabad PRT System) పీఆర్టీ లైన్ల ఏర్పాటుకు సంబంధించిన ప్రతిపాదనలపై చర్చించారు.
* కేపీహెచ్‌బీ నుంచి దుర్గం చెరువు వరకు తొలి లైన్
కేపీహెచ్‌బీ మెట్రో స్టేషన్ నుంచి దుర్గం చెరువు, రహేజా మైండ్‌స్పేస్, బయోడైవర్సిటీ మెట్రో స్టేషన్ వరకు అత్యంత రద్దీగా ఉండే మార్గంలో పీఆర్టీ లైన్ ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశించారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించి డిసెంబర్ నాటికి టెండర్ల ప్రక్రియ పూర్తి చేయాలని సూచించారు.
* మెట్రోకు అనుసంధానంగా పీఆర్టీ..
ఏడాది కాలంలో ఈ మార్గంలో పీఆర్టీ వ్యవస్థ అందుబాటులోకి వచ్చేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. ఈ మార్గంలో గచ్చిబౌలి ఐకియా సమీపంలో మల్టీలెవల్ పార్కింగ్ సదుపాయాన్ని ఏర్పాటు చేయాలని చెప్పారు. అదే ప్రాంగణంలో పీఆర్టీ డిపో నిర్మాణానికి అవసరమైన ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు.
* ఎల్బీ స్టేడియం నుంచి రాణిగంజ్ వరకు మరో లైన్
నగరంలోని మరో కీలక మార్గంలోనూ (Hyderabad PRT System) పీఆర్టీ వ్యవస్థను ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి ప్రతిపాదించారు. ఎల్బీ స్టేడియం నుంచి అంబేద్కర్ విగ్రహం.. ఇందిరా పార్క్.. లోయర్ ట్యాంక్‌బండ్ మీదుగా రాణిగంజ్ బస్టాండ్ వరకు మరో పీఆర్టీ లైన్ నిర్మించాలని అధికారులకు సూచించారు. ఈ మార్గం అందుబాటులోకి వస్తే నగరంలోని ప్రధాన ప్రాంతాల మధ్య ప్రయాణానికి మరింత సౌకర్యం కలిగే అవకాశం ఉంటుంది.
* అసెంబ్లీ నుంచి బేగంపేట వరకు మరో కారిడార్
అసెంబ్లీ మెట్రో స్టేషన్ నుంచి రవీంద్రభారతి, సచివాలయం, ఐమాక్స్ మీదుగా బేగంపేటను కలుపుతూ మరో పీఆర్టీ లైన్ ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశించారు. నెక్లెస్ రోడ్ మార్గంలో మల్టీలెవల్ పార్కింగ్ సదుపాయాన్ని ఏర్పాటు చేసి, అందులోనే పీఆర్టీ డిపో నిర్మించాలని సూచించారు.
* ట్రాఫిక్, కాలుష్య నియంత్రణే లక్ష్యం..
హైదరాబాద్‌లో పెరుగుతున్న వాహనాల రద్దీ, ప్రయాణ సమయాన్ని తగ్గించడం, కాలుష్యాన్ని నియంత్రించడం వంటి అంశాలను దృష్టిలో ఉంచుకుని పీఆర్టీ వ్యవస్థను అభివృద్ధి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. నగరంలోని కీలక ప్రాంతాలను అనుసంధానించేలా ఈ కారిడార్లను ఏర్పాటు చేసేందుకు ముఖ్యమంత్రి అధికారులకు దిశానిర్దేశం చేశారు.
హైదరాబాద్‌లో మూడు ప్రధాన మార్గాల్లో పర్సనల్ ర్యాపిడ్ ట్రాన్సిట్ వ్యవస్థ ఏర్పాటుకు ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ప్రాజెక్టు పనులను వేగవంతం చేసి నగర ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాలు కల్పించడంపై ప్రభుత్వం దృష్టి సారించింది.

Please tell us what is wrong. Your report will be sent to the website team.

