సీఎం రేవంత్ రెడ్డి రివ్యూ
* టిమ్స్, వరంగల్ ఆసుపత్రుల పనులు పూర్తి చేయాలి
* అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు..
* 2027 డిసెంబర్ నాటికి కొత్త ఉస్మానియా ఆసుపత్రి అందుబాటులోకి
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : రాష్ట్రంలో ప్రభుత్వ వైద్య సేవలను మరింత విస్తరించేందుకు చేపట్టిన ఆసుపత్రుల నిర్మాణ పనులను వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) అధికారులను ఆదేశించారు. వచ్చే ఏడాది జూన్ 2వ తేదీ నాటికి అల్వాల్, ఎల్బీ నగర్ టిమ్స్‌లు, వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి, నిమ్స్ విస్తరణ పనులు పూర్తి చేయాలని స్పష్టం చేశారు.
2027 డిసెంబర్ నాటికి నూతన ఉస్మానియా ఆసుపత్రి నిర్మాణాన్ని పూర్తి చేసి ప్రజలకు వైద్య సేవలు అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు. ఎంసీఆర్హెచ్ఆర్డీలోని బోధి పెవిలియన్‌లో మంత్రి దామోదర రాజనర్సింహతో కలిసి ముఖ్యమంత్రి ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు.
టిమ్స్‌లు (Tims Hospitals), వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి, నిమ్స్ విస్తరణ, కొత్త ఉస్మానియా ఆసుపత్రి నిర్మాణ పనులతో పాటు ఆయా ఆసుపత్రులకు అవసరమైన వైద్య పరికరాల కొనుగోలు, వైద్యులు, సిబ్బంది నియామకాలను ఏకకాలంలో పూర్తి చేయాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.
* ఆసుపత్రుల్లో పడకల సంఖ్య పెంపు..
ప్రజారోగ్యానికి తమ ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందని ముఖ్యమంత్రి తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో పడకల సంఖ్యను 30 వేల నుంచి 38 వేలకు పెంచినట్లు వెల్లడించారు. రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం కింద ఒక్కో కుటుంబానికి అందించే వైద్య చికిత్సల బీమా కవరేజీని రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచిన విషయాన్ని గుర్తు చేశారు.
సనత్‌నగర్, అల్వాల్, ఎల్బీ నగర్ టిమ్స్‌లలో వైద్యులు, ఇతర సిబ్బంది నియామకాలను ఏకీకృత విధానంలో చేపట్టాలని సీఎం ఆదేశించారు. వైద్య సేవల అవసరాలకు అనుగుణంగా మూడు టిమ్స్‌ల మధ్య వైద్యులు, సిబ్బంది బదిలీలు జరిగేలా విధానం రూపొందించాలని సూచించారు.
ఆసుపత్రుల నిర్వహణ, హౌస్‌కీపింగ్ సిబ్బందిని ఔట్సోర్సింగ్ విధానంలో నియమించాలని చెప్పారు. టిమ్స్‌ల పర్యవేక్షణ బాధ్యతలను గ్రూప్-1 అధికారులకు అప్పగిస్తామని తెలిపారు.
నిర్వహణ, హౌస్‌కీపింగ్ సిబ్బందిపై పర్యవేక్షణ కోసం విశ్రాంత సైనికాధికారులను నియమించాలని సూచించారు. నిర్వహణ బాధ్యతలకు ప్రత్యేక సిబ్బంది ఉంటే వైద్యులు పూర్తిగా వైద్య సేవలపైనే దృష్టి సారించేందుకు అవకాశం ఉంటుందని ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు.
* శస్త్రచికిత్సలకు సనత్‌నగర్ టిమ్స్ వినియోగం..
నిమ్స్‌లో శస్త్రచికిత్సలకు ఎక్కువ సమయం పడుతున్న నేపథ్యంలో సనత్‌నగర్ టిమ్స్‌ను (Tims Hospitals) పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. నిమ్స్‌లో పడకలు అందుబాటులో లేకపోయినా.. శస్త్రచికిత్సలకు ఆలస్యమైనా సనత్‌నగర్ టిమ్స్ సేవలను ఉపయోగించుకోవాలని చెప్పారు.
ఈ విషయంలో వైద్యారోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, నిమ్స్, టిమ్స్ డైరెక్టర్లు నిరంతరం సమన్వయం చేసుకోవాలని CM Revanth Reddy సూచించారు. టిమ్స్‌లో వైద్యుల నియామకాలు పూర్తయ్యే వరకు అవసరమైతే బయటి వైద్యులను నియమించుకోవాలని తెలిపారు.
ఇందుకు అవసరమైన నిధులను వెంటనే విడుదల చేస్తామని హామీ ఇచ్చారు. వైద్యులు, ఇతర సిబ్బంది నియామక ప్రక్రియను వేగవంతం చేయాలని ఆదేశించారు.
* మరో 79 డయాలసిస్ కేంద్రాల పనులు పూర్తి చేయాలి..
అధికారంలోకి వచ్చిన తర్వాత కొత్తగా 16 డయాలసిస్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు ముఖ్యమంత్రి వెల్లడించారు. నిర్మాణంలో ఉన్న మరో 79 డయాలసిస్ కేంద్రాల పనులను వీలైనంత త్వరగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులకు సూచించారు.
టిమ్స్‌లతో పాటు బోధన వైద్య కళాశాలలు, నర్సింగ్ కళాశాలల నిర్మాణ పనులు, అవసరమైన పరికరాల కొనుగోలు ప్రక్రియను కూడా ఒకేసారి పూర్తి చేయాలని చెప్పారు. ఇందుకోసం సమగ్ర కార్యాచరణ ప్రణాళిక రూపొందించి అమలు చేయాలని ఆదేశించారు.
* ప్రభుత్వ ఆసుపత్రుల్లో బయోమెట్రిక్ హాజరు..
ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యులు, సిబ్బంది హాజరును పర్యవేక్షించేందుకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) పర్యవేక్షణతో బయోమెట్రిక్ విధానాన్ని అమలు చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఔట్పేషెంట్ల (OP) సంఖ్య 7 కోట్ల నుంచి 9 కోట్లకు పెరగడం, ఇన్‌పేషెంట్ల (IP) సంఖ్య 23 లక్షల నుంచి 24.30 లక్షలకు చేరడంపై సీఎం సంతృప్తి వ్యక్తం చేశారు.
* వైద్యారోగ్య శాఖకు మరిన్ని నిధులు..
రాష్ట్ర బడ్జెట్లో గతంలో ఆరోగ్య రంగానికి సగటున 3.9 శాతం నిధులు కేటాయించగా, గత మూడేళ్లుగా సగటున 4.8 శాతం కేటాయిస్తున్నట్లు ముఖ్యమంత్రి తెలిపారు. మూడేళ్లలో వైద్యులు, నర్సులు, ఏఎన్ఎంలు, పారామెడికల్ సిబ్బంది కలిపి 13,401 నియామకాలు పూర్తి చేసినట్లు వెల్లడించారు. మరో 5,640 నియామకాల ప్రక్రియ కొనసాగుతోందని చెప్పారు.
ప్రజారోగ్యానికి పెద్దపీట వేసే క్రమంలో వైద్యారోగ్య శాఖకు అవసరమైన నిధులను ఎంత మొత్తమైనా విడుదల చేస్తామని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ఆసుపత్రుల నిర్మాణాలు, పరికరాల కొనుగోళ్లు, నియామకాలు నిర్ణీత గడువులో పూర్తి చేసి ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని అధికారులను ఆదేశించారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.

