వరంగల్ జిల్లాలో ముగ్గురు రైతుల ఆత్మహత్య (ఫైల్ ఫొటో)
* ఉమ్మడి వరంగల్ జిల్లాలో విషాదం
* పత్తి, వరి, మొక్కజొన్న సాగులో నష్టాలు..
* రైతు కుటుంబాల్లో తీరని విషాదం
ఆకేరు న్యూస్, వరంగల్ : ఉమ్మడి వరంగల్ జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. వ్యవసాయంలో నష్టాలు, అప్పుల భారం భరించలేక ఒకేరోజు ముగ్గురు రైతులు ఆత్మహత్యకు (Warangal Farmer Suicides )పాల్పడ్డారు. వరంగల్, జనగామ, మహబూబాబాద్ జిల్లాల్లో జరిగిన ఈ ఘటనలు రైతు కుటుంబాల్లో విషాదాన్ని నింపాయి. పంటలకు ఆశించిన దిగుబడి రాకపోవడం, పెట్టుబడులు కూడా తిరిగి రాకపోవడంతో ముగ్గురు రైతులు ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం.
* బుజ్జు తండాలో యువ రైతు బలవన్మరణం..
వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలం బుజ్జు తండాకు చెందిన జర్పుల వెంకటేష్ (27) తనకున్న రెండెకరాల భూమిలో పత్తి సాగు చేశాడు. పంటకు ఆశించిన దిగుబడి రాకపోవడంతో తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో మనస్తాపానికి గురైన వెంకటేష్ వ్యవసాయ బావిలో (Warangal Farmer Suicides ) దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. చిన్న వయసులోనే రైతు ప్రాణాలు కోల్పోవడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు.
* పత్తి సాగులో నష్టంతో మహిళా రైతు ఆత్మహత్య
జనగామ జిల్లా నర్మెట మండలం ఆగాపేటలో మరో విషాదం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన మెట్ల ఉప్పలమ్మ (50) పత్తి సాగు చేయగా పంటలో నష్టాలు వచ్చాయి. వ్యవసాయం కోసం చేసిన అప్పులు పెరగడంతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది.
* అప్పుల భారం తాళలేక మరో రైతు మృతి
మహబూబాబాద్ జిల్లా ఇస్లావత్ తండా పరిధిలోని వెంకట్రామ్ తండాకు చెందిన బానోతు రాములు (58) తనకున్న రెండెకరాల భూమిలో వరి, మొక్కజొన్న సాగు చేశాడు. అయితే పంటలకు ఆశించిన దిగుబడి రాకపోవడంతో తీవ్ర నష్టాలు ఎదురయ్యాయి. వ్యవసాయం కోసం చేసిన అప్పులు పెరిగిపోవడంతో మనస్తాపానికి గురై పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
* ప్రభుత్వంపై విమర్శలు..
ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఒకేరోజు ముగ్గురు రైతులు ఆత్మహత్య చేసుకోవడం వ్యవసాయ రంగంలో నెలకొన్న పరిస్థితులపై చర్చకు దారితీసింది. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు సక్రమంగా విద్యుత్ సరఫరా చేయడం లేదని, సాగుకు సరిపడా నీటిని అందించడంలో విఫలమవుతోందని ప్రభుత్వంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
విద్యుత్, సాగునీటి సమస్యలతో పాటు పంట నష్టాలు, అప్పుల భారం రైతులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాయని విమర్శకులు ఆరోపిస్తున్నారు. ఒకేరోజు ముగ్గురు రైతులు ప్రాణాలు కోల్పోవడం స్థానికంగా కలకలం రేపింది. వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్న కుటుంబాలకు భరోసా కల్పించడంతో పాటు పంట నష్టాలు ఎదుర్కొంటున్న రైతులకు తగిన సహాయం అందించాలని పలువురు కోరుతున్నారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.

