డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క (ఫైల్ ఫోటో)
* నెలకు రూ.వెయ్యి కోట్ల వరకు చెల్లింపులు
* టీచర్లకు పదోన్నతులు, బదిలీలు..
ఆకేరు న్యూస్, డెస్క్ : గత బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రంపై రూ.8.21 లక్షల కోట్ల అప్పుల భారం వదిలివెళ్లినప్పటికీ, తమ ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందులను అధిగమిస్తూ ఉద్యోగులకు ప్రతి నెలా ఒకటో తేదీనే జీతాలు చెల్లిస్తోందని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క (Bhatti Vikramarka )తెలిపారు. ప్రతి నెలా సుమారు రూ.6,500 కోట్ల రుణ చెల్లింపులు చేస్తున్నామని, గతంలో పేరుకుపోయిన పెండింగ్ బిల్లులను నెలకు రూ.750 కోట్ల నుంచి రూ.వెయ్యి కోట్ల వరకు దశలవారీగా క్లియర్ చేస్తున్నామని వెల్లడించారు.
* ఉద్యోగులకు ఒకటో తేదీనే జీతాలు..
ఆదివారం ఖైరతాబాద్‌లోని ఇంజినీరింగ్ అసోసియేషన్ భవనంలో నిర్వహించిన స్కూల్ టీచర్స్ ఫెడరేషన్ (ఎస్టీఎఫ్) రాష్ట్ర విద్యా మహాసభలకు భట్టి విక్రమార్క ((Bhatti Vikramarka ) ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఉద్యోగులకు నెలలో 12, 14, 15 తేదీల్లో కూడా జీతాలు అందని పరిస్థితి ఉండేదని గుర్తుచేశారు.
ప్రస్తుతం ఆ పరిస్థితిని మార్చి, ప్రతి నెలా ఒకటో తేదీనే జీతాలు అందిస్తున్నామని చెప్పారు. ఉద్యోగులు, ఉపాధ్యాయుల కుటుంబాలకు వైద్య భద్రత కల్పించేందుకు క్యాష్‌లెస్ హెల్త్‌కార్డు సదుపాయాన్ని కూడా అమల్లోకి తెచ్చామని వివరించారు.
* ప్రభుత్వ విద్యా వ్యవస్థ బలోపేతమే లక్ష్యం..
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నిర్వహించిన సర్వేలో విద్య ద్వారానే పౌరులు, కుటుంబాలు, సమాజం గణనీయంగా అభివృద్ధి చెందగలవని స్పష్టమైందని భట్టి తెలిపారు. తెలంగాణను ఇతర రాష్ట్రాలతోనే కాకుండా ప్రపంచంలోని అభివృద్ధి చెందిన దేశాలతో పోటీపడే స్థాయికి తీసుకెళ్లడమే తమ లక్ష్యమన్నారు.
అందుకోసం ప్రభుత్వ విద్యా వ్యవస్థను బలోపేతం చేస్తూ ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యం ఇస్తున్నామని చెప్పారు. వేలాది మంది ఉపాధ్యాయులకు పెండింగ్ పదోన్నతులు కల్పించామని, సుమారు 11 వేల పోస్టులను భర్తీ చేశామని వివరించారు. అలాగే 35 వేల మంది ఉపాధ్యాయులకు బదిలీలు చేపట్టినట్లు తెలిపారు.
* యంగ్ ఇండియా పాఠశాలలు గేమ్చేంజర్లు..
ప్రభుత్వ విద్యారంగంలో అంతర్జాతీయ ప్రమాణాలతో మౌలిక సదుపాయాలు కల్పించేందుకు యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లు, తెలంగాణ పబ్లిక్ స్కూళ్లను ఏర్పాటు చేస్తున్నామని భట్టి విక్రమార్క తెలిపారు. ఈ పాఠశాలలు రాష్ట్ర విద్యారంగంలో గేమ్చేంజర్లుగా నిలుస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు.
విద్య, వసతితో పాటు క్రీడలకు ప్రాధాన్యం ఇస్తున్నామని, బోధన, బోధనేతర సిబ్బందికి కూడా నివాస సదుపాయాలు కల్పిస్తున్నామని చెప్పారు. గతంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసీలకు వేర్వేరుగా గురుకులాలు ఉండేవని, కుల, వర్గ విభేదాలు లేకుండా అన్ని వర్గాల పిల్లలు ఒకే ప్రాంగణంలో చదువుకోవాలనే ఉద్దేశంతో కొత్త పాఠశాలల విధానాన్ని తీసుకొచ్చామని వివరించారు.
రాష్ట్రవ్యాప్తంగా సుమారు 27 లక్షల మంది విద్యార్థులకు ఉదయం వివిధ రకాల అల్పాహారం, పాలు, ప్రత్యామ్నాయ రోజుల్లో రాగిజావ అందిస్తున్నామని భట్టి తెలిపారు. రెసిడెన్షియల్ పాఠశాలల్లో డైట్ ఛార్జీలను 40 శాతం, కాస్మొటిక్ ఛార్జీలను 200 శాతం పెంచినట్లు వెల్లడించారు.
* సామాజిక పరివర్తనకు టీచర్లే మార్గదర్శకులు
అర్హులైన పేదలకు ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద ఒక్కొక్కరికి రూ.5 లక్షల చొప్పున ఆర్థిక సాయం అందిస్తున్నామని, ఇప్పటివరకు 8 లక్షల ఇళ్లకు అనుమతులు మంజూరు చేసినట్లు భట్టి వివరించారు. ఉపాధ్యాయులు కేవలం విద్యాబోధనకే పరిమితం కాకుండా ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన కుటుంబాలకు చేరేలా సలహాలు, సూచనలు ఇవ్వాలని కోరారు.
ఉపాధ్యాయులు ప్రభుత్వ ఉద్యోగులుగానే కాకుండా సామాజిక పరివర్తనకు మార్గదర్శకులుగా ఎదగాలని పిలుపునిచ్చారు. ఈ మహాసభలో మాజీ ఎమ్మెల్యే కిచ్ఛన్న లక్ష్మారెడ్డి, ఎస్టీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు దేవరకొండ సైదులు, ప్రధాన కార్యదర్శి పోచయ్య, ప్రొఫెసర్ విశ్వేశ్వర్ రావు తదితరులు పాల్గొన్నారు.
Please tell us what is wrong. Your report will be sent to the website team.

