భార్య వేధింపులు భరించలేక ఆత్మహత్య చేసుకుంటానంటూ సెల్ఫీ వీడియో
* రోజూ తిడుతోంది.. కొడుతోంది..!
* నా చావు నేను చస్తా..
* అమ్మా..నాన్న సారీ.. అంటూ భర్త అదృశ్యం
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : మహబూబ్నగర్ జిల్లా (Mahabubnagar District) బాలానగర్ మండలం మోతీ ఘనపూర్ గ్రామానికి చెందిన ఓ వివాహితుడు భార్య వేధింపులు భరించలేక ఆత్మహత్య చేసుకుంటానంటూ సెల్ఫీ వీడియో విడుదల చేసి అదృశ్యమైన ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. ఇంట్లో భార్య పెడుతున్న మానసిక, శారీరక వేధింపులను ఇకపై తట్టుకోలేనని కన్నీరుమున్నీరవుతూ తన ఆవేదనను వీడియోలో రికార్డు చేశాడు.
భార్య ప్రతిరోజూ అడ్డగోలుగా తిడుతోందని, రాత్రి వేళల్లో తనపై భౌతిక దాడికి పాల్పడుతోందని బాధితుడు (Husband Harassment Allegations) వీడియోలో ఆరోపించాడు. అంతేకాకుండా ‘చావు.. చావు’ అంటూ పదేపదే వేధిస్తోందని వాపోయాడు. ఈ విషయంపై గతంలో పోలీస్ స్టేషన్కు వెళ్లినా, గ్రామ పెద్దల సమక్షంలో పంచాయితీ నిర్వహించినా ఎలాంటి మార్పు రాలేదని ఆవేదన వ్యక్తం చేశాడు. పంచాయితీ సమయంలో అందరి ముందు మంచిగా ఉంటానని చెప్పి, ఇంటికి వచ్చాక మళ్లీ వేధింపులకు గురిచేస్తోందని ఆరోపించాడు.
* నా చావు నేను చస్తా..!
కుటుంబ కలహాలతో తీవ్ర మనస్తాపానికి గురైన యువకుడు ‘ఇక నా చావు నేను చస్తాను.. అమ్మా, నాన్నా నన్ను క్షమించండి. నేను మీ కడుపున చెడపుట్టాను’ అంటూ తల్లిదండ్రులకు క్షమాపణలు చెబుతూ వీడియో రికార్డు చేశాడు. అనంతరం ఆ వీడియోను కుటుంబ సభ్యులకు పంపించాడు. ఆ తర్వాత ఇంటి నుంచి బయలుదేరిన అతడు రంగారెడ్డి జిల్లా (Rangareddy District) కొత్తూరు సమీపంలో తన ద్విచక్ర వాహనాన్ని (స్కూటీ) రోడ్డు పక్కన వదిలి అదృశ్యమయ్యాడు.
సెల్ఫీ వీడియో చూసిన తల్లిదండ్రులు, బంధువులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించి యువకుడి ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టాలని కోరారు.
* ఆ యువకుడు ఎక్కడ?
బాధితుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు (Police Investigation), కొత్తూరు సమీపంలో వదిలేసిన స్కూటీని స్వాధీనం చేసుకున్నారు. యువకుడి ఆచూకీ కోసం దర్యాప్తు ముమ్మరం చేశారు. మొబైల్ ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా అతడు ఎటువైపు వెళ్లాడనే కోణంలో గాలిస్తున్నారు.
సమీపంలోని చెరువులు, కుంటలు, రైల్వే ట్రాక్లతో పాటు సీసీటీవీ ఫుటేజీలను కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. భార్య వేధింపులే యువకుడి అదృశ్యానికి కారణమని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. అయితే, పోలీసులు అన్ని కోణాల్లో విచారణ జరుపుతూ యువకుడిని క్షేమంగా గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.

